రాజకీయ నాయకుల మీద కేసులు కామన్. ఓవరాల్‌గా లెక్క తీస్తే.. కేసు లేని పొలిటికల్ లీడర్ ఎవరూ కనిపించరు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అది మరింత వింతగా ఉంది సీన్. సీఎంగా చేస్తున్న వాళ్లు.. వాళ్లను ఎదురిస్తున్న ప్రతిపక్ష పార్టీల పెద్దలు.. అందరి మీద కేసులు ఉన్నాయ్. అందరూ బెయిల్ మీద ఉండడం.. తెలుగు రాష్ట్రాల్లో విచిత్రంగా మారింది. కవిత ఎపిసోడ్ నుంచి వెనక్కి వెళ్తే చంద్రబాబు, రేవంత్ అంతకుముందు జగన్.. ఇలా వీళ్లంతా జైలులో ఉంది.. బెయిల్ మీద బయటకు వచ్చినవాళ్లే. ఒక్కొక్కరిది ఒక్కో కేసు.. జైలు జీవితం చూసి వచ్చిన వాళ్లే.. కష్టపడి, పోరాడి చివరికి బెయిల్ మీద బయటకు వచ్చి… ఇప్పుడు రాజకీయాలను ఏలుతున్నారు. 40ఏళ్ల పొలిటికల్ కెరీర్‌లో చంద్రబాబు.. స్కిల్ కేసులో మొదటిసారి అరెస్ట్ అయ్యారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కేసులో అరెస్టయిన చంద్రబాబు.. 52రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అద్భుత విజయాన్ని దక్కించుకున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇక వైసీపీ అధినేత జగన్ అయితే.. 12ఏళ్లుగా బెయిల్ మీదే ఉన్నారు. ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి మొత్తం 11చార్జిషీట్లను జగన్‌పై సీబీఐ నమోదు చేసింది. వీటిలో ఆయన ఏ1 నిందితుడిగా ఉన్నారు. సీబీఐ చార్జిషీట్ల మీద విచారణ పలు దశల్లో ఉంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 16నెలలకు పైగా జైల్లో ఉన్నారు జగన్. ఆరుసార్లు బెయిల్ కోసం ప్రయత్నించి.. ఏడోసారి సక్సెస్ అయ్యారు. ఏపీ సీఎం అయ్యే వరకు కూడా ప్రతీ శుక్రవారం.. సీబీఐ కోర్టుకు విచారణకు వెళ్లేవారు. ఇప్పుడు మళ్లీ అదే జరగబోతుందని విపక్ష నేతలు కౌంటర్లు వేస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డికి కూడా ఓటుకు నోటు కేసులో బెయిల్ వచ్చింది. 2015లో తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. సంచలన ఘటన చోటుచేసుకుంది. ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో టీడీపీ నేతలు బేరసారాలు సాగించారు. స్టీఫెన్‌సన్‌కు రేవంత్ రెడ్డి భారీగా డబ్బు ఇస్తున్న వీడియోలు బయటికి రావడం.. అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేపాయి. ఓటుకు నోటుగా ఫేమస్ ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా, ప్రధాన నిందితుడుగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈ కేసులో రేవంత్ కొద్దిరోజులు జైలులో ఉన్నారు. తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చి.. టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు సీఎం అయ్యారు. ఇక ప్రతిపక్ష నేత కాకపోయినా.. ప్రతిపక్షంలో ఉన్న నాయకురాలిగా కవిత కూడా.. ఇదే కోవాకు చెందిన వారు అవుతారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో 150రోజులకు పైగా తీహార్ జైలులో ఉన్న కవిత.. బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇలా ప్రతిపక్షం, అధికార పక్షం.. అధినేతలు, నాయకులు బెయిల్ మీదే ఉన్న సీన్ తెలుగు రాష్ట్రాలకే సొంతం అన్నట్లు తయారయింది. ఇదంతా ఎలా ఉన్నా.. జైలుకు వెళ్లి బెయిల్ మీద వచ్చిన నేతలంతా.. ఆ తర్వాత రాజకీయంగా సూపర్ సక్సెస్ కొట్టారు. జగన్ నుంచి రేవంత్ వరకు.. అందరూ సీఎం అయ్యారు. దీంతో ఇప్పుడు కవిత విషయంలో అదే జరుగుతుందా.. అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందా అనే ఆసక్తికర చర్చ జరుగుతోంది.