మరో నాలుగు నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. వైసీపీని మళ్ళీ ఎలా అధికారంలోకి తీసుకురావాలా.. అని జగన్ స్కెచ్చులేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పులు.. మరికొందరికి ట్రాన్సఫర్లు.. ఇలా బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ టైమ్ లో ప్రభుత్వ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది నుంచి వరుసగా వస్తున్న సమ్మె సైరన్లతో సీఎం జగన్ పరేషాన్ అవుతున్నారు. పాదయాత్రలో హామీలిచ్చి గెలిచి.. ప్రభుత్వం చేపట్టి ఐదేళ్ళయినా తమను పట్టించుకోవట్లేదని మండిపడుతున్నారు ఉద్యోగులు, సిబ్బంది.
తమ సమస్యల పరిష్కారం కోసం 15 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె చేస్తున్నారు. ఇప్పుడు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా సమ్మె సైరన్ మోగించారు. జగన్ పాదయాత్ర సమయంలో నేనున్నాను.. నేను విన్నాను అంటూ.. ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది.. వివిధ వర్గాల వారి విజ్ఞాపనలను నెరవేరుస్తానని హామీలు ఇచ్చారు. కానీ YCP ప్రభుత్వం ఏర్పడి ఐదేళ్ళు కావొస్తున్నా. ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదని మండిపడుతున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నుంచి వీళ్ళంతా సమ్మెకు దిగుతున్నారు.
15 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తుండటంతో.. సెంటర్లన్నీ మూతపడ్డాయి. ఐదు రోజులుగా సమగ్ర శిక్షణా సిబ్బంది కూడా సమ్మె చేస్తున్నారు. ఈనెల 26 నుంచి మున్సిపల్ కార్మికులు విధులను బహిష్కరించబోతున్నారు. ఆ తరువాత 28 నుంచి VRAలు నిరసనకు దిగుతున్నారు. కొత్త ఏడాది ప్రారంభం నుంచే ఫీల్డ్ అసిస్టెంట్స్ కూడా ఛలో విజయవాడ చేపడతామని హెచ్చరించారు. ఇలా తమ డిమాండ్ల సాధన కోసం ఒక్కొక్కరు సమ్మె, ఆందోళనలకు దిగుతుండటంతో అధికారపార్టీకి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఆయా ఉద్యోగ సంఘాలను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తోంది వైసీపీ ప్రభుత్వం. మిగతా డిమాండ్లను ఒప్పుకుంటున్నా.. జీతాలు పెంచడానికి మాత్రం నో చెబుతోంది. దాంతో చర్చలు విఫలమవుతున్నాయి.
సమస్యల పరిష్కరించకపోగా.. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చేస్తుండటంతో.. ఉద్యోగుల్లో అసహనం పెరిగిపోతోంది. సమ్మె చేస్తున్న వారికి టీడీపీ, జనసేన లాంటి ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలా మందిలో వైసీపీపై వ్యతిరేకత ఏర్పడింది. ఇప్పుడు ఒక్కో విభాగం సమ్మెకు దిగితే.. రేపు ఎన్నికల నాటికి ఈ వ్యతిరేకత ఇంకా తీవ్రం అవుతుందన్న భయం అధికార పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. అంగన్వాడీలపై మంత్రి ఉషశ్రీ చేసిన కామెంట్స్ తో ప్రభుత్వ ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు. సమ్మె చేస్తున్న వారిపై వైసీపీ లీడర్లు కామెంట్స్ చేయడం, కోపగించుకోవడం లాంటివి చేస్తుండటంతో ఇది ఎక్కడికి దారి తీస్తుందో అని వైసీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తల్లో టెన్షన్ పెరిగిపోతోంది.