ఆంధ్రప్రదేశ్ లో ఆత్మ సాక్షి సర్వే సంచలనం కలిగిస్తోంది. అధికార వైసీపీ పరిస్థితి ఏమాత్రం బాగలేదని తేల్చిన ఈ సర్వేలో మెజారిటీ మంత్రులు కూడా ఓడిపోతారని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. టీడీపీకి అధికారం ఖాయమని తేల్చింది. ఇన్నాళ్లూ జనసేనతో పొత్తు పెట్టుకుంటేనే టీడీపీ అధికారంలోకి వస్తుందని.. లేకుంటే మళ్లీ వైసీపీదే విజయమని అందరూ భావిస్తూ వచ్చారు. అయితే ఆత్మసాక్షి సర్వే ఇందుకు విరుద్ధంగా ఉంది.
ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ అధికారాన్ని దక్కించుకుంటుందని ఆత్మసాక్షి సర్వే వెల్లడించింది. తెలుగుదేశం పార్టీకి 78, వైసీపీకి 63, జనసేనకు 7 సీట్లు పక్కాగా దక్కుతాయని తేల్చింది. ఇక 27 సీట్లలో హోరాహోరీ పోరు నడుస్తోందని తెలిపింది. గతేడాది నవంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 17 వరకూ ప్రతి నియోజకవర్గంలో శాంపిల్స్ సేకరించి సర్వే నిర్వహించింది ఆత్మసాక్షి. ఇందులో వైసీపీకి 41.50 శాతం, టీడీపీకి 42.50, జనసేనకు 11శాతం, ఇతరులకు 2.5శాతం ఓట్లు లభిస్తాయని అంచనా వేసింది. అంతేకాక.. ఎవరికి ఓటు వేస్తామో చెప్పని వాళ్లు మరో 2.5శాతం ఉన్నట్టు వెల్లడించింది.
వాస్తవానికి చాలా సంస్థలు సర్వేలు చేస్తుంటాయి. వాటి అంచనాలు సక్సెస్ కావచ్చు, కాకపోవచ్చు. కానీ అత్మసాక్షి సర్వేకు కొంచెం ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే.. 2019 ఎన్నికల సమయంలో ఆత్మసాక్షి తప్ప అన్ని సర్వే సంస్థలూ టీడీపీదే అధికారం అని చెప్పాయి. కానీ ఆత్మసాక్షి మాత్రమే వైసీపీ ఘన విజయం సాధించబోతోందని సీట్లతో సహా చెప్పింది. వైసీపీకి 142 దాకా సీట్లు వస్తాయని అంచనా వేయగా 151 సీట్లు వచ్చాయి. అలాగే 22 ఏంపీ సీట్లు వస్తాయని తేల్చగా 23 దక్కాయి. దీంతో ఒక్కసారిగా అందరి చూపు ఆత్మసాక్షిపై పడింది. అప్పుడు ఆత్మసాక్షి సర్వే ఫలితాలు మాత్రమే నిజమయ్యాయి. అందుకే ఇప్పుడు కూడా ఆత్మసాక్షి చెప్పింది కాబట్టి నిజమవుతుందనే అంచనాలు పెరిగిపోయాయి.
ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం 175కు 175 సీట్లూ గెలవాలనుకుంటోంది. కానీ ఆత్మసాక్షి సర్వే చూస్తే కనీసం అధికారం దక్కించుకోవడం కూడా అసాధ్యమని స్పష్టమవుతోంది. అంతేకాదు.. ఈ సర్వేలో దాదాపు సగం మంది మంత్రులు ఓడిపోవడం ఖాయమని పేర్లతో సహా వెల్లడించింది ఆత్మసాక్షి. మంత్రులు ఆర్కే రోజా, గుడివాడ అమరనాథ్, గుమ్మనూరు జయరాం, సీదిరి అప్పల్రాజు, ఉషశ్రీ చరణ్, విశ్వరూప్, విడదల రజని, మేరుగు నాగార్జున, తానేటి వనిత, జోగి రమేశ్, కారుమూరి వెంకట నాగేశ్వర రావు, కొట్టు సత్యనారాయణ ఓడిపోవడం ఖాయమని సర్వే తేల్చింది. మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, ఆళ్ల నాని, బాలినేని శ్రీనివాస రెడ్డి, వెలంపల్లి శ్రీనివాస్, చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, అవంతి శ్రీనివాస్, శంకరనారాయణ, పేర్ని నాని కూడా ఓటమిబాటలో ఉన్నట్టు ఆత్మసాక్షి తెలిపింది.
ఇదిప్పుడు వైసీపీలో తీవ్ర సంచలనం కలిగిస్తోంది. తమకు తిరగులేదనుకుంటున్న వైసీపీకి ఇది ఏమాత్రం మింగుడు పడడం లేదు. మరోవైపు టీడీపీకి మాత్రం ఈ సర్వే మంచి బూస్టప్ ఇచ్చింది.