Upendra: కన్నడ నటుడు ఉపేంద్రపై కేసు నమోదైంది. తన రాజకీయ పార్టీ వార్షికోత్సవం సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దళితులను అవమానించేలా ఆయన వ్యాఖ్యలు చేశారంటూ బెంగళూరులో కేసు నమోదు అయింది. ప్రజాకీయ పార్టీ వార్షికోత్సవంలో భాగంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో లైవ్ నిర్వహించారు ఉపేంద్ర. విమర్శకులను ఓ వర్గంతో పోలుస్తూ సామెతలు చెప్పారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీశాయి.
ఆయన వ్యాఖ్యలు తమని ఆవేదనకు గురి చేశాయంటూ.. బెంగళూరులోని చెన్నమన్నకేరే అచ్చుకట్టు పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు అందింది. దీంతో ఉపేంద్రపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. తన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో ఉపేంద్ర క్షమాపణలు చెప్పారు. లైవ్ వీడియోను కూడా తన సామాజిక మాధ్యమాల నుంచి తొలగించారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టా లైవ్‌లో పొరపాటున నోరు జారి కొన్ని వ్యాఖ్యలు చేశానని.. తన వ్యాఖ్యల కారణంగా కొంతమంది ఇబ్బందిపడ్డారని గ్రహించిన వెంటనే లైవ్ వీడియోను తొలగించానని.. ఆ విధంగా వ్యాఖ్యలు చేసినందుకు క్షమించండి అంటూ పోస్ట్ చేశాడు ఉపేంద్ర. ఐతే వివాదం మాత్రం ఆగడం లేదు. ఉపేంద్ర మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఉపేంద్ర కన్నడ నటుడు అయినా.. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన పరిచయమే.
తెలుగులో కూడా ఉపేంద్ర చాలా సినిమాల్లో నటించి మెప్పించాడు.. నటుడిగా మాత్రమే కాదు దర్శకుడిగా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మధ్యే రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టాడు. ఆ పార్టీ యానివర్సరీలో మాటలతోనే ఇప్పుడు కేసు వరకు వెళ్లింది.