హెలికాప్టర్ ప్రయాణంపై బాబు కీలక నిర్ణయం

“ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోసం గత శనివారం ముంబై నుంచి విజయవాడకు తెప్పిస్తున్న హెలికాప్టర్ పూణే వద్ద కుప్ప కూలింది” అంటూ వచ్చిన కొన్ని కథనాలు టీడీపీ కార్యకర్తలకు కంటి మీద కునుకు లేకుండా చేసాయి,

  • Written By:
  • Publish Date - August 28, 2024 / 03:45 PM IST

“ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కోసం గత శనివారం ముంబై నుంచి విజయవాడకు తెప్పిస్తున్న హెలికాప్టర్ పూణే వద్ద కుప్ప కూలింది” అంటూ వచ్చిన కొన్ని కథనాలు టీడీపీ కార్యకర్తలకు కంటి మీద కునుకు లేకుండా చేసాయి, చంద్రబాబును అంతమొందించే కుట్రలో భాగంగానే ఈ హెలికాప్టర్ ను తెచ్చే ప్రయత్నం చేసారని కార్యకర్తల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఆ వార్త తర్వాత టీడీపీ కార్యకర్తల్లోనే కాదు, సామాన్య ప్రజల్లో సైతం ముఖ్యమంత్రి భద్రతపై అనుమానాలు నెలకొన్నాయి.

జెడ్ ప్లస్ భద్రత ఉన్న ఒక ముఖ్యమంత్రి, ప్రముఖ రాజకీయ నాయకుడి కోసం అంత మాత్రం ఆలోచన లేకుండా ఒక ముసలి హెలికాప్టర్ ను ఎలా సిద్దం చేయిస్తారనే ప్రశ్నలు పెద్ద ఎత్తున వినిపించాయి. తెలుగు ప్రజలకు హెలికాప్టర్ ఓ చేదు జ్ఞాపకం మిగిల్చింది. 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని హెలికాప్టర్ బలి తీసుకున్న సంగతి విదితమే. అందుకే హెలికాప్టర్ లో రాజకీయ నాయకుల ప్రయాణం అంటే తెలుగు వారిలో ఓ ఆందోళన. ఇప్పుడు ఆ ఆందోళనలు… పూణేలో జరిగిన ఘటనతో ఎక్కువయ్యాయి.

జెడ్ ప్లస్ భద్రత ఉన్న వ్యక్తి విషయంలో ప్రతీ విషయమూ సున్నితమే. ఈగ వాలినా అది భద్రతా లోపమే. అంత పకడ్బందీగా భద్రత పర్యవేక్షణ ఉంటుంది. కాని ముఖ్యమంత్రి ప్రయాణించబోయే ఒక హెలికాప్టర్ కూలింది అంటే అది కచ్చితంగా తప్పిదమే. తేడా జరిగి ఉంటే భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి. ఆ కూలిన హెలికాప్టర్ కూడా భారీ ఎత్తులో ఏం కూలలేదు. అతి తక్కువ ఎత్తులో, వాతావరణం అన్నీ సక్రమంగా ఉన్న సమయంలోనే కూలింది. అద్రుష్టవశాత్తు ఏ ప్రాణ హాని జరగలేదు. కాని హెలికాప్టర్ పూర్తిగా ద్వంశం అయిపొయింది.

వాస్తవానికి నిబంధనల ప్రకారం… పదేళ్ళు సర్వీసు దాటిన హెలికాప్టర్ ను ముఖ్యమంత్రికి కేటాయించకూడదు. కాని అధికారులు మాత్రం… 16 ఏళ్ళ సర్వీసు ఉన్న హెలికాప్టర్ ను చంద్రబాబు కోసం తెప్పించారు. ఏవియేషన్‌ అధికారులు నిబంధనలు విస్మరించి గ్లోబల్‌ వెకాట్ర అనే సంస్థ నుంచి వీటీ-జీవీఐ, ఏడబ్ల్యూ 139 2008 మోడల్‌ హెలికాప్టర్‌ ను విజయవాడ తీసుకురావడానికి ఈ నెల 24న అనుమతులు తీసుకున్నారు. ఆ హెలికాప్టర్ ముంబై నుంచి హైదరాబాద్‌ కు వచ్చి ఆ తర్వాత విజయవాడకు రావాల్సి ఉంది.

కాని అనూహ్యంగా పూణే వద్ద కూలిపోయింది. ఇది కచ్చితంగా భద్రతా లోపమే. ముఖ్యమంత్రుల భద్రత విషయంలో కొన్ని ప్రమాణాలు పాటించాల్సి ఉంది. అయితే గత ప్రభుత్వంలో ఇలాంటి సున్నిత విషయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. ముఖ్యమంత్రుల హెలికాప్టర్ ప్రయాణానికి సంబంధించి కీలకంగా వ్యవహరించే అధికారులను మార్చి వేరే వారికి బాధ్యతలను అప్పగించారు. గతంలో చంద్రబాబు సిఎంగా ఉన్న సమయంలో… ప్రొటోకాల్‌, ఏవియేషన్‌ ఎండీగా ఎయిర్ ఫోర్స్ లో పని చేసే కల్నల్ స్థాయి అధికారి వ్యవహరించే వారు.

కాని ఇప్పుడు మాత్రం ఐఅండ్‌ఐ సంస్థలో పనిచేసే ఓ జాయింట్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారికి ఏవియేషన్‌ బాధ్యతలు అప్పగించారు. సదరు అధికారికి ఏవియేషన్‌పై పెద్దగా అవగాహన ఉండదు. అందుకే చంద్రబాబు ప్రయాణించబోయే హెలికాప్టర్ కూలింది అనే ఆరోపణలు ఉన్నాయి. కల్నల్ స్థాయి అధికారి ఉన్న సమయంలో వాతావరణంలో ఏ మాత్రం తేడా ఉన్నా సరే ప్రయాణానికి అనుమతులు వచ్చేవి కాదు. వైఎస్ ప్రమాద అనుభవంతో భద్రతను అత్యంత సున్నితంగా పరిశీలించిన తర్వాతనే పర్యటనలకు అధికారులు అనుమతులు ఇస్తున్నారు.

సాధారణంగా భారీ వర్షం కురవడం, వెలుతురు లేమి, పొగమంచు, వేగమైన గాలులు ఉంటే హెలికాప్టర్ ప్రయాణానికి అనుమతులు ఇవ్వరు. వీఐపీలు ప్రయాణిస్తున్న హెలికాప్టర్లు అటువంటి పరిస్తితిలోనే కుప్ప కూలాయి కాబట్టి ఏ మాత్రం తేడా వచ్చినా సరే అనుమతులు ఇవ్వడం లేదు. కాని కూలిన హెలికాప్టర్ కు అటువంటి పరిస్థితి ఏం లేదు. ఒకవేళ చంద్రబాబు పర్యటించాల్సి ఉంటే… వాతావరణం అనుకూలంగా ఉన్న సమయంలో అనుమతి ఇచ్చేవారు. ఆ సమయంలో ఆ హెలికాప్టర్ కూలి ఉంటే పరిస్థితి ఏంటీ అనే ప్రశ్నలు వినపడుతున్నాయి.

వాస్తవానికి చంద్రబాబు ఉపయోగించే రెగ్యులర్ హెలికాప్టర్ కాదు అది. రెగ్యులర్ గా ప్రయాణించే హెలికాప్టర్ ను సర్వీస్ కు పంపారు. తాత్కాలికంగా కూలిన హెలికాప్టర్ ను చంద్రబాబు కోసం తెప్పించారు. ఆ సమయంలో ప్రమాదం జరిగింది. గత ప్రభుత్వం వినియోగించిన రెగ్యులర్ హెలికాప్టర్ నే చంద్రబాబు వినియోగిస్తున్నారు. దీనితో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై పెద్ద చర్చే జరుగుతోంది. సాధారణ సర్వీస్ కు వెళ్ళిన హెలికాప్టర్ బాగానే ఉంది కాబట్టి… దానిని స్టాండ్ బైగా ఉపయోగించి కొత్త హెలికాప్టర్ ను కొనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఇతర సంస్థల మీద ఆధారపడకుండా కొత్త హెలికాప్టర్ ను కొనడం మంచిది అనే భావనలో ఉంది ప్రభుత్వం. దీనిపై కేబినేట్ లో నిర్ణయం తీసుకున్న తర్వాత కొనే అవకాశం ఉండవచ్చు. అలాగే ముఖ్యమంత్రి భద్రత విషయంలో పునఃపరిశీలించుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. ఏవియేషన్, ప్రోటోకాల్ బాధ్యతలను గతంలో మాదిరిగానే కల్నల్ స్థాయి అధికారికి ఇవ్వడం మంచిది అనే అభిప్రాయం వినపడుతోంది. అయితే ఈ అనుభవంతో చంద్రబాబు… హెలికాప్టర్ ప్రయాణాలను తగ్గించుకునే యోచనలో ఉన్నారని కూడా అంటున్నారు. విమాన ప్రయాణం చేసి… అక్కడి నుంచి కాన్వాయ్ లోనే ప్రయాణం చేసే యోచన చేస్తున్నారట.

ఏదైనా ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళిన సమయంలో, విమాన ప్రయాణానికి అనువుగా, అందుబాటులో లేని ప్రాంతంలోనే హెలికాప్టర్ ను వినియోగించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టుగా తెలుస్తోంది. అటు కుటుంబ సభ్యులు కూడా ఈ విషయంలో చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతున్నట్టుగా తెలుస్తోంది. పర్యటనలను తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని, అమరావతిలోనే ఎక్కువగా ఉండాలని కోరుతున్నారు. కీలక కార్యక్రమాలు ఉంటే మినహా జిల్లాల పర్యటనలు చేయవద్దని, చేసినా విమానాల్లోనే వెళ్లాలని ఒత్తిడి చేస్తున్నారట.