Nandamuri Balakrishna: ఒకే వేదికపై నందమూరి కుటుంబం.. బాలకృష్ణ, ఎన్టీఆర్ కలిసి కనిపిస్తారా..?

నందమూరి తారకరామారావు శత జయంతి సందర్భంగా ఆయన గౌరవార్థం కేంద్రం ప్రత్యేక నాణేన్ని విడుదల చేయనుంది. ఆర్బీఐ రూపొందించిన ప్రత్యేక రూ.100 నాణాన్ని సోమవారం (ఆగష్టు 28) ఢిల్లీలో విడుదల చేయబోతున్నారు.

  • Written By:
  • Publish Date - August 27, 2023 / 04:35 PM IST

Nandamuri Balakrishna: నందమూరి కుటుంబంలో విబేధాలున్నాయంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్‌ను బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు దూరం పెడుతుంటారని తరచూ వినిపిస్తుంటుంది. దీనికి తగ్గట్లే అనేక సంఘటనలు జరిగాయి. నందమూరి కుటుంబానికి చెందిన కొన్ని ఫంక్షన్లలో ఎన్టీఆర్ కనిపించడు. కళ్యాణ్ రామ్ మాత్రమే కనిపిస్తాడు. ఇక.. మిగతా కుటుంబ సభ్యులు కూడా ఒకేచోట కలిసి కనిపించేది. ఈ వివాదానికి, విమర్శలకు ఫుల్ స్టాప్ పడే టైం వచ్చినట్లే కనిపిస్తోంది. త్వరలోనే నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, దగ్గుబాటి పురందేశ్వరి, ఇతర కుటుంబ సభ్యులు కలిసి కనిపించబోతున్నారు.
నందమూరి తారకరామారావు శత జయంతి సందర్భంగా ఆయన గౌరవార్థం కేంద్రం ప్రత్యేక నాణేన్ని విడుదల చేయనుంది. ఆర్బీఐ రూపొందించిన ప్రత్యేక రూ.100 నాణాన్ని సోమవారం (ఆగష్టు 28) ఢిల్లీలో విడుదల చేయబోతున్నారు. రాష్ట్రపతి భవన్‌లో, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆహ్వానించింది. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ, బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, ఇతర కుటుంబ సభ్యులను నిర్వాహకులు ఆహ్వానించారు. దీంతో వీళ్లంతా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఇదే జరిగితే బాలకృష్ణ, ఎన్టీఆర్ కలిసి ఒకే వేదికపై కనిపించబోతున్నారు. వీరిలో ఎవరు హాజరవుతారు..? ఎవరు హ్యాండ్ ఇస్తారు..? అనేది చూడాలి.

నిజానికి ఇటీవల జరిగిన ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమానికి కల్యాణ్ రామ్ సహా చాలా మందికి ఆహ్వానం అందింది. కానీ, ఎన్టీఆర్‌ను పిలవలేదు. కావాలనే ఎన్టీఆర్‌ను పక్కనపెట్టారనే వాదన వినిపించింది. హైదరాబాద్‌తోపాటు, ఏపీలో కూడా వేర్వేరు కార్యక్రమాలు జరిగినా ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందలేదు. దీంతో ఎన్టీఆర్, బాలకృష్ణ సహా నందమూరి కుటుంబ సభ్యుల మధ్య విబేధాలున్నాయనే వాదనకు బలం చేకూరింది. ఢిల్లీలో జరగనున్న కార్యక్రమం ద్వారా ఈ వాదనకు చెక్ పెట్టే అవకాశం లభించింది.