జగన్ తో కష్టం…పవన్ అంటే ఇష్టం ! బాలినేని లో ఎందుకు ఇంత మార్పు

వైసీపీలో బిగ్ వికెట్ పడింది.. ఆ పార్టీకి వరుసగా పెద్ద దెబ్బలు తగులుతున్నాయి.. వైసీపీ కీలక నేత, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు.. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపారు.. గత కొద్దికాలంగా వైసీపీ అధినేత జగన్ పై అసంతృప్తిగా ఉన్న బాలినేని జనసేన లోకి వెళుతున్నారు.

  • Written By:
  • Publish Date - September 19, 2024 / 11:10 AM IST

వైసీపీలో బిగ్ వికెట్ పడింది.. ఆ పార్టీకి వరుసగా పెద్ద దెబ్బలు తగులుతున్నాయి.. వైసీపీ కీలక నేత, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు.. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపారు.. గత కొద్దికాలంగా వైసీపీ అధినేత జగన్ పై అసంతృప్తిగా ఉన్న బాలినేని జనసేన లోకి వెళుతున్నారు. అందుకే అనూహ్యంగా ఆయన వైసీపీకి రాజీనామా చేశారు.. ఇప్పటికే జనసేన ముఖ్య నేత నాగబాబుతో మంతనాలు జరిపిన బాలినేని ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ తరువాత జనసేనలో చేరడం లాంఛనం మాత్రమే.

వైసీపీ కీలక నేత మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి గుడ్ భై చెప్పారు.. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న బాలినేని వ్యక్తిగత కారణాలు, అంతర్గత విభేదాలతో పార్టీని వీడుతున్నట్లు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపించారు.. రాజకీయాలు వేరు.. బందుత్వాలు వేరంటూ లేఖలో ఘటు వ్యాఖ్యలు చేశారు బాలినేని… ఆ పార్టీ అధినేత అధినేత వైఎస్ జగన్ సొంత చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డికి సొంత బావ… వరుసకు జగన్ కు మామ అవుతారు బాలినేని… ఆ చుట్టరికమే రాజకీయంగా బాలినేని ఎదుగుదలకు ఓ కారణంగా చెప్పుకుంటారు.. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశీర్వాదంతో 1999లో ఒంగోలు కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకున్న బాలినేని అదే పార్టీ నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2009 వైఎస్ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు..

వైఎస్ మరణానంతరం అప్పటి రాజకీయ కారణాలతో జగన్ కాంగ్రెస్ ను విభేదించి బయటకు రావటం.. సొంత పార్టీని పెట్టుకోవటం జరిగిపోయాయి.. అప్పడు క్యాబినెట్ మంత్రిగా ఉన్న బాలినేని తన పదవిని వదులుకుని వైసీపీలోకి వచ్చేశారు.. అప్పట్లో తనకున్న పరిచయాలతో కొందరు ముఖ్య నేతలను సైతం జగన్ వైపుకు తీసుకు రాగలిగారు.. వైసీపీ ఆవిర్బావం తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2012లో ఉప ఎన్నికల్లో నాల్గవసారి గెలిచారు.. అయితే 2014లో ఓడిన బాలినేని 2019లో ఐదవసారి గెలిచి మంత్రి పదవిని పొందారు.. అయితే అప్పటి వరకూ అంతా బాగానే ఉన్నా.. రెండవ సారి మంత్రివర్గ విస్తరణ చేసిన సమయంలో కూడా మంత్రివర్గ విస్తరణలో వంద శాతం మార్పులు ఉంటాయని.. ముందుగా చెప్పారు బాలినేని.. అయితే జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్ తో పాటు పలువురు మంత్రులను కొనసాగించిన జగన్ బాలినేనిని పక్కన పెట్టారు అప్పటి సీఎం జగన్… దీంతో ఆగ్రహం వ్యక్తం చేశారు బాలినేని.. అధిష్టానంపై అలకబూనారు.. రెండు రోజుల పాటు పార్టీ పెద్దల బుజ్జగింపుల అనంతరం మొత్తబడ్డారు..

అయితే బాలినేని మంత్రి పదవి పోవటానికి మాత్రం పార్టీ అధిష్టానానికి బాలినేని ఆర్దిక సర్దుబాట్లు చేయక పోవటమే ఓ కారణమై ఉంటుందని ఆయన సన్నిహితులు భావిస్తుంటారు.. తన నియోజకవర్గంలో ప్రతీ కార్యకర్త వ్యక్తిగతంగా ఎటువంటి సహాయం చేసే అలవాటు ఉన్న బాలినేని అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోక పోవటం వల్లే మంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చిందని చెబుతారు.. కారణాలు ఏవైనప్పటికీ అప్పటి నుంచి ఆ ఇద్దరి మధ్య కొంత గ్యాప్ ఏర్పడిందనేది కాదనేలేని వాస్తవం.. అయితే అప్పటి నుంచి ఆయన పార్టీ అధినేత నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడటం.. పార్టీ నేతలు ఆయనను పిలిచి మాట్లాడటం.. ఆయన సర్దుకుని వెళ్లటం జరిగిపోయేవి.. ఓ దశలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన బాలినేని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.. సొంత పార్టీలోని కొందరు వ్యక్తులు.. తనను.. తన కుమారుడు ప్రణీత్ రెడ్డిని టార్గెట్ చేసి టీడీపీ నేతలతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు.. బాలినేని మంచోడే కానీ ఆయన కుమారుడు మామూలోడు కాదు అంటూ విష ప్రచారాలు చేస్తూ తమ కుమారుడికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలని కుట్రలు పన్నుతున్నారని కన్నీటి పర్యంతమయ్యారు బాలినేని.. ఎప్పుడు వివాదాలకు దూరంగా ఉండే బాలినేనికి మంత్రి పదవి పోయిన అనంతరం వరుస వివాదాలు వెంటాడాయి.. వీటన్నింటికీ ఆయన బావ, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి మధ్య విభేదాలే కారణంగా ఆయన సన్నిహితులు చెబుతుంటారు..

ఆయన ప్రోద్బలం తోనే అటు సొంత పార్టీతో పాటు టీడీపీ నేతలు బాలినేనిని టార్గెట్ గా రాజకీయాలు నడిపారంటుంటారు.. ప్రతీ చిన్న విషయాన్ని కాంట్రవర్సీ చేయటం.. సోషల్ మీడియాలో బాలినేనికి వ్యతిరేకంగా పోస్టింగులు పెట్టడం జరుగుతున్నాయి.. ప్రతీసారి ఆయనపై ఓ వివాదం బయటకు రావటం.. దాంతో తనకు సంభందం లేదని ఆయన చెప్పుకు రావటం జరిగాయి… వీటన్నింటికీ పార్టీ లోని తన వ్యతిరేక వర్గమే కారణమని బాలినేని కూడా పలు సందర్బాల్లో మీడియా తోనే డైరెక్ట్ గా చెప్పారు.. ఒంగోలులో నకిలీ స్టాంపులతో భూవిక్రయాల విషయంలో బాలినేని సన్నిహితుల పాత్ర ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.. దీంతో ఆయన పట్టుబట్టి సిట్ వేయించారు.. సిట్ అధికారులు సరైన తీరులో విచారణ చేయటం లేదంటూ తన గన్ మెన్లను సైతం ప్రభుత్వానికి సరెండర్ చేయటం జరిగిపోయాయి.. తిరిగి పార్టీ పెద్దల జోక్యంతో ఆయన సర్దుకున్నారు.. అనంతరం ఒంగోలులో 25 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేసేందుకు భూముల కొనుగోలుకు అప్పటి సీఎం జగన్ దగ్గర గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారు.. రైతుల దగ్గర భూములను కొనుగోలు ఒప్పందాల అనంతరం ఆ డబ్బును రైతుల ఖాతాల్లో వేయించేందుకు సీఎం జగన్ దగ్గరకు తాడేపల్లి చుట్టూ తిరగాల్సి వచ్చింది.. ఓ దశలో అసలు పేదలకు ఇళ్ల పట్టాలు అసలు ఇస్తారా అన్న సంగ్దిదత ఏర్పడింది..

దీంతో బాలినేని వారికి ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తేనే తాను పోటీలో ఉంటానని తెగేసి చెప్పారు.. ఆ తర్వాత జగన్ నగదు విడుదల చేశారు.. ఎన్నికల సమయంలో కూడా ఒంగోలు ఎంపీగా మాగుంటను కొనసాగించాలని పట్టుబట్టారు బాలినేని.. ఆయనను కొనసాగించాలని పలుసార్లు పార్టీ అధినేత జగన్ కు విన్నవించారు.. అయినా ఆయన ఎంపీ అభ్యర్దిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పొటీలో నిలవటం.. ఆయన ఓడిపోవటం జరిగిపోయాయి.. ఎన్నికల్లో ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్దిగా చెవిరెడ్డిని నిలబెడితే మూడు, నాలుగు నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్దులకు ఇబ్బందులు తప్పవని వైసీపీ అధిష్టానాన్ని ఆయన ముందుగానే హెచ్చరించారు.. అయినా పట్టువీడక పోవటంతో బాలినేని చేసేదేమీ లేక సర్దుకున్నారు.. దీంతో ముందుగా అనుకున్నట్లుగానే ఒంగోలు, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల్లో టీడీపీ ఎంపీ మాగుంట ప్రభావంతో వైసీపీ అభ్యర్దులు ఓడిపోయారని బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.. పార్టీ అధినేత జగన్ ఏకపక్ష ధోరణి వల్లే పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని తన సన్నిహితుల వద్ద పలు సందర్బాల్లో చెప్పారు బాలినేని..

ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయం అనంతరం ఈవీఎంలు, వీవీప్యాట్లకు చెందిన లెక్కలు తేల్చాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు బాలినేని. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈవీఎంలు, వీవీప్యాట్లు లెక్కించాలని గట్టిగా బాలినేని పట్టుబట్టారు. ఎన్నికల కమిషన్‌ ఆయా ప్రాంతాల్లో మాక్‌ పోలింగ్‌ చేపడుతుందని చెప్పడంతో తిరిగి కోర్టును ఆశ్రయించారు.. ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారాయట. తాను ఈవీఎంల విషయంలో ఒంటరిగా ఇంతగా పోరాడుతుంటే పార్టీ నుంచి తనకు సరైన సపోర్ట్‌ రావడంలేదని ఆయన బాహాటంగానే ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎన్నికల అనంతరం పార్టీ అధినేత జగన్ ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశాలకు హాజరుకాలేదు.. అధినేత వైఖరిలో మార్పు రాలేదని.. కార్యకర్తలను పట్టించుకోని పార్టీలకు మనుగడ ఉండదని చెప్పుకొచ్చిన బాలినేని జగన్ వ్యవహార శైలిలో మార్పు రాలేదని.. ఆయన మారకుండా తాము ఏం చేయగలుగుతామని తనను కలిసిన పార్టీ నేతలతో చెప్పారు..

గతంలో కూడా పలు సందర్బాల్లో పార్టీ బాగుకోసమే ఏం మాట్లాడినా తనపై పార్టీ వ్యతిరేక ముద్ర వేశారని ఆవేదన వ్యక్తం చేశారు బాలినేని.. ఈ క్రమం లోనే ఇటీవల తాడేపల్లిలో వైసీపీ అధినేత జగన్‌ను కూడా కలిసి మాట్లాడారట బాలినేని. తాను చెప్పదల్చుకున్న అంశాలు సూటిగా జగన్‌కు చెప్పి వచ్చేశారట. వారిద్దరి మధ్య ఏఏ అంశాలు చర్చకు వచ్చాయన్నది అటు బాలినేని కానీ.. ఇటు జగన్ వైపు నుంచి కానీ ఎటువంటి సమాచారం లేదు.. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలని పార్టీ ముఖ్య నేతలకు జిల్లా అధ్యక్ష భాద్యతలు అప్పగిస్తున్నానంటూ బాలినేనికి చెప్పారట జగన్.. అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం.. చర్చల అనంతరం బాలినేని అసంతృప్తిగా ఉన్నారని ఆయన సన్నిహితులు చెప్పుకొచ్చారు.. అయితే ఇదే సమయంలో బాలినేని పార్టీ మారుతున్నారని ప్రచారం ప్రారంభమైంది. బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి వెళ్తారనే వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలో ఒంగోలు కార్పోరేషన్ లో పలువురు వైసీపీ కార్పోరేటర్లు టీడీపీ లోకి వెళ్లిపోయారు.. అనంతరం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఒంగోలు నగర పాలక సంస్థకు చెందిన వైసీపీ కార్పొరేటర్లతో బాలినేని సమావేశమయ్యారు. ఈ సందర్బంగా తన భవిష్యత్తు కార్యాచరణతో పలు రాజకీయ అంశాలను వారితో పంచుకున్నారు బాలినేని.. అయితే ఆయన పార్టీ మార్పు విషయాన్ని వారితో చర్చించటానికే బాలినేని సమావేశమయ్యారని భావించిన వైసీపీ అధిష్టానం ఆ సమయంలో హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న మాజీమంత్రి విడదల రజినీతోపాటు వైసీపీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డిని బాలినేనితో చర్చించేందుకు రాయబారానికి పంపినట్లు సమాచారం. అయితే వారి చర్చల్లో ఏం జరిగిందనే విషయంలోనూ ఎవరికి స్పష్టత లేదు..

ఇదే సమయంలో ఈవీఎంలపై ఈసీకి ఫిర్యాదు చేసిన విషయంలో జగన్ ఒత్తిడి మేరకే చేశాను తప్ప తనకు సంభందం లేదని.. జగన్ ఏకపక్ష ధోరణి వల్లే వైసీపీ ఓడిపోయిందని.. పార్టీ ఓడిపోతుందని తమకు ఏడాది ముందే తెలుసని బాలినేని చెప్పినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి.. అయితే ఇదంగా తనకు సంభందం లేదని ఖండించారు బాలినేని.. తాజాగా మరోసారి వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి జగన్ రెడీ అయిపోయారని.. ఆ లాంఛనం పూర్తి చేయడానికి ఆయన సోదరి షర్మిల అడ్డుపడుతున్నారని బాలినేని మట్లాడినట్లుగా చిలువలు.. పలువలుగా కధనాలు వచ్చేశాయి.. జగన్ విలీన ప్రయత్నాల గురించి ఆ పార్టీ సీనియర్ నేత, స్వయంగా జగన్ కు సమీప బంధువు అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి కుండబద్దలు కొట్టేశారంటూ సోషల్ మీడియాలో కధనాలు హల్ చల్ చేశాయి.. గతంలో కూడా ఆయనపై పలుసార్లు ఏవో ఆరోపణలు రావటం.. ఆయన దాంతో తనకు సంభందం లేదని చెప్పుకు రావటం పరిపాటిగా మారింది.. ఇప్పుడు కూడా ఇదే తరహాలో తనపై వస్తున్న వార్తలపై ఆవేదన వ్యక్తం చేశారు బాలినేని.. ఎవరి రాజకీయ అవసరాల కోసమో తనను పావుగా వాడుకుంటున్నారు బాలినేని.. గతంలో కూడా తాను వివిధ కారణాలతో తమ పార్టీ అధినేత జగన్ ను కలిసిన ప్రతీసారి తమ జరగని సంభాషణలను కూడా ప్రముఖంగా బయటకు వచ్చేవని చెప్పుకొచ్చారు.. తాను పార్టీలో ఉండటం ఇష్టం లేని తమ పార్టీ నేతలు ఇలాంటి ప్రచారాలు చేయించి ఉండవచ్చని భావిస్తున్నారు.. తమ మధ్య ఉన్న గ్యాప్ లను రాజకీయంగా వాడుకునేందుకు కొందరు భావిస్తూ ఉండవచ్చని అంచనా వేశారు..

తనపై ఆరోపణలు చేసే వ్యక్తులు నిరభ్యంతరంగా విచారణ చేయించుకోవచ్చని… తాను ఏ విచారణకైనా సిద్దమేనని ఆయన స్పష్టం చేశారు.. వైసీపీ లో జగన్ ఎవరికి ఇవ్వని ప్రాధాన్యతను జగన్ తనకు ఇస్తున్నారని.. కొందరు వ్యక్తులు ప్రొజెక్ట్ అయ్యేలా చేస్తున్నారని ఎవరి ఇబ్బందులు వారికుంటాయని చెప్పారు.. తమ సొంత పార్టీ లోని కొందరు వ్యక్తులతో పాటు వైసీపీని రాజకీయంగా ఇబ్బందులకు గురిచేయాలనుకుంటున్న వ్యక్తులు తన పేరిట రకరకాల పోస్టులను సృష్టిస్తున్నారని.. అలాంటి వాటితో తనకు సంభందం లేదన్నారు బాలినేని.. తన పేరుతో జరుగుతున్న ప్రచారాలతో తనకు సంభందం లేదని స్పష్టం చేశారు.. ఏదైనా ఉంటే నేరుగా మాట్లాడాలి కానీ ఇలా దొడ్డిదారిన పనులు చేయటం సరికాదన్నారు.. వైసీపీలోని ఓ కోటరీ వల్లే పార్టీ పరిస్దితి ఇలా తయారైందన్నారు బాలినేని.. ఒక్కొక్కసారి ఈ ప్రచారాలను చూసి నిజంగా తాను ఇలా మాట్లాడానా.. ఎక్కడ మాట్లాడారు.. ఎందుకు.. అని కొందరు తన సన్నిహితులు అడిగిన సందర్బాలు కూడా ఉన్నాయని వాపోయారు బాలినేని..

పార్టీ లోని ఆ కోటరీ వల్లే ఇదంతా జరుగుతున్నదని భావిస్తున్నారు బాలినేని.. వారి వల్ల పార్టీకి ఇబ్బందులు తప్పవని స్పష్టం చేసిన ఆయన విషయాలు అందరికీ చెబుతానని చెప్పుకొచ్చారు.. వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని.. కొన్ని కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామా లేఖలో ఆయన కీలక విషయాలను ప్రస్తావించారు. రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరన్నారు. జగన్ నిర్ణయాలు సరిగా లేనప్పుడు వ్యతిరేకించినట్లు చెప్పారు. రాజకీయాల్లో భాష గౌరవంగా, హుందాతనంగా ఉండాలన్నారు. రాజకీయాల్లో విలువలు కాపాడాల్సిన బాధ్యత నాయకులదే అని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ఎవరు వచ్చినా సాయం చేసినట్లు బాలినేని తెలిపారు. విలువలు నమ్ముకుని ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా.. రెండుసార్లు మంత్రిగా పనిచేశానని బాలినేని లేఖలో ప్రస్తావించారు. ఇప్పుడు కొన్ని కారణాలతో వైసీపీ వీడుతున్నట్లు తెలిపారు. జగన్ కాంగ్రెస్ ని వీడిన నాటి నుంచి అతని వెంటే ఉన్న బాలినేని,
తన విధేయతను ,బంధుత్వాన్ని కూడా పక్కనపెట్టి… జనసేన వైపు వెళ్లిపోయారు. కొత్త తరహా రాజకీయం, ప్రకాశం జిల్లాలో చూడబోతున్నాం.