Balineni Srinivasa Reddy: వైసీపీలో అసంతృప్త నేతగా పేరున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వ్యవహారం మరోసారి సంచలనం కలిగిస్తోంది. పార్టీ అధినేత జగన్ తీరుపై అసంతృప్తితో ఉన్న ఆయన ఈసారి పోలీసుల తీరుపై అలకబూనారనే ప్రచారం జరుగుతోంది. పోలీసుల తీరును నిరసిస్తూ.. బాలినేని తాజాగా తన గన్‌మెన్లను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఈ మేరకు ఏపీ డీజీపీకి, గుంటూరు రేంజ్ ఐజీకి లేఖ రాశారు. దీనంతటికీ నకిలీ డాక్యుమెంట్లతో జరిగిన భూ కుంభకోణమే కారణం.
ఒంగోలు నగరంలో ఇటీవల కాలంలో భూ కబ్జాలు పెరిగిపోయాయి. ఓ ముఠా నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి భూ కబ్జాలకు పాల్పడుతోంది. ఈ మేరకు పోలీసులు ముఠాను అరెస్టు చేసి వారివద్ద నుంచి నకిలీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతోపాటు రెవెన్యూ, పంచాయతీ శాఖలకు చెందిన స్టాంప్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో నిందితులను అరెస్టు చేయాలని బాలినేని.. ఒంగోలు ఎస్పీని కోరారు. ఇప్పటికే పోలీసులు ఈ స్కాంలో ఏడుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. ఈ కేసులో ఎలాంటి వాళ్లున్నా వదిలిపెట్టొద్దని బాలినేని జిల్లా కలెక్టర్, ఎస్పీని కోరారు. తన పార్టీ వాళ్లైనా, తన అనుచరురలైనా శిక్షించాలన్నారు. అయితే, ఈ విషయంలో పోలీసులు తాను చెప్పినట్లు వ్యవహరించడం లేదని, నిందితుల్ని అదుపులోకి తీసుకోలేదని బాలినేని ఆరోపించారు. దీనికి నిరనసగా తన గన్‌మెన్లను ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నట్లు తెలిపారు. నాలుగేళ్ల నుంచి పోలీసులు, ప్రభుత్వం నుంచి ఇలాంటి పరిస్థితిని చూస్తున్నట్లు, తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని బాలినేని వ్యాఖ్యానించారు.
పరోక్షంగా ప్రభుత్వంపై బాలినేని విమర్శలు చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే, బాలినేని ఇలా అలగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా వైసీపీపై తన అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను మంత్రి పదవి నుంచి తప్పించిన తర్వాత నుంచి ఆయన పార్టీపై తిరుగుబాటు చేస్తున్నారు.