Bandaru Satyanarayana: ఆందోళనలు, ఉద్రిక్తత నడుమ టీడీపీ నేత, మాజీ ఎంపీ బండారు సత్యనారాయణ మూర్తిని గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. విశాఖపట్నం, పరవాడలోని తన ఇంట్లో ఉన్న బండారు సత్యనారాయణను సోమవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఏపీ సీఎం జగన్, మంత్రి రోజాపై బండారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రోజాపై ఆయన చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉండటంతో ఏపీ మహిళా కమిషన్ స్పందించింది.
బండారుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ డీజీపీకి మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ లేఖ రాశారు. ఆయనపై గుంటూరులో కేసు కూడా నమోదైంది. దీంతో బండారును అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ఆదివారం, అర్ధరాత్రి ఆయన ఇంటికి చేరుకున్నారు. ఈ విషయం తెలిసి టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకుని పోలీసుల్ని అడ్డుకున్నారు. దీంతో అర్ధరాత్రి నుంచి బండారు ఇంటివద్ద ఉద్రిక్తత తలెత్తింది. టీడీపీ శ్రేణులు, పలువురు నేతలు ఆయన ఇంటికి చేరుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసుల్ని అడ్డుకున్నారు. పోలీసులు కూడా టీడీపీ శ్రేణులు రాకుండా బారికేడ్లు అడ్డుపెట్టి, అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే, భారీ సంఖ్యంలో టీడీపీ నాయకులు రావడంతో తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒక దశలో పోలీసులకు, టీడీపీ శ్రేణలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ దశలో పోలీసులు బండారు ఇంట్లోకి చేరుకున్నారు. ఆయన మాత్రం ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు అంగీకరించలేదు. చివరకు పోలీసులు భారీ సంఖ్యలో బలగాల్ని మోహరించి, బండారును అరెస్టు చేశారు.
ఇంటి వద్ద బండారుకు 41ఏ, 41బి సెక్షన్ల కింద నోటీసులు ఇచ్చి అరెస్టు చేశారు. అనంతరం బండారుకు అనకాపల్లి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అక్కడి నుంచి భద్రత మధ్య బండారును గుంటూరు తరలిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ఈ కేసులో బండారు తరఫున లాయర్లు కోర్టును ఆశ్రయించారు. ఆయన అరెస్టును సవాల్ చేశారు. దీనిపై విచారణ జరగాల్సి ఉంది. బండారుకు నారా లోకేష్ కూడా ఫోన్ చేసినట్లు సమాచారం. లోకేష్ ఆయనకు సంఘీభావం తెలిపారు. బండారు అరెస్టును నిరసిస్తూ టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.