పదోతరగతి పేపర్ల లీక్ వెనక బండి సంజయ్ కుట్ర ఉందని వరంగల్ పోలీసులు తేల్చేశారు. ఆయన్ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు కూడా తరలించారు. ఇదంతా రాజకీయ ప్రేరేపిత కేసు అని బీజేపీ వాదిస్తోంది. అయితే ఏ తప్పు చేయనప్పుడు ఫోన్ ఎందుకు దాయాల్సి వచ్చిందని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. అయితే కథంతా బండి ఫోన్ చుట్టూనే తిరుగుతుండటం కొత్త అనుమానాలకు తావిస్తోంది.
పేపర్ లీక్ కేసులో కీలక నిందితుడు ప్రవీణ్‌తో బండి సంజయ్ పలుమార్లు ఫోన్‌లో మాట్లాడారని, వాట్సప్ కాల్స్ కూడా చేశారని పోలీసులు అంటున్నారు. ఇద్దరి మధ్య వాట్సప్ చాట్ ఈ కేసుకు కీలకం అంటున్నారు. నిజానికి ప్రవీణ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త అని చెబుతున్నారు. గతంలో మీడియాలో పనిచేశాడు. ఇతనే బండి సంజయ్‌కు పేపర్ పంపాడు. ఇది పోలీసులు చెబుతున్నది. అయితే బీజేపీ వాదన వేరేగా ఉంది. ప్రవీణ్, బండి సంజయ్‌కు మధ్య పరిచయం ఉంది. పేపర్ లీక్‌పై మీడియాలో ఏం మాట్లాడాలన్న ఇన్‌పుట్స్ కూడా బండి సంజయ్‌కు ఇచ్చాడు. దానిపై వారిద్దరి మధ్య చాటింగ్ నడిచింది.
తర్వాత రోజు బండి సంజయ్ అదే అంశాలను మీడియా ముందు ప్రస్తావించారు. పేపర్ లీక్‌కు పాల్పడ్డ మైనర్ నుంచి ప్రవీణ్‌కు పేపర్ చేరగానే వెంటనే దాన్ని బండికి ఫార్వర్డ్ చేశాడు. ఇలా పేపర్ లీక్ జరుగుతోందని చెప్పాడు. ఇప్పుడు పోలీసులు ఆ చాట్‌నే తమకు ఆయుధంగా మార్చుకున్నారు. ఎంతో మందికి పేపర్ చేరినా తాము కేవలం బండిని అరెస్ట్ చేయడానికి కారణం ఆ చాటేనని పోలీసులు చెబుతున్నారు. తప్పు చేయనప్పుడు బండి ఫోన్ ఎందుకు దాస్తున్నారని వరంగల్ సీపీ రంగనాథ్ ప్రెస్‌మీట్‌లో ప్రశ్నించారు. ఒకసారి కాదు నాలుగుసార్లు ఫోన్ గురించి ప్రస్తావించారు.
తప్పుచేయనప్పుడు ఫోన్ ఎందుకివ్వలేదు.? అందరికీ ఇదే అనుమానం. అయితే అందుకు వేరే కారణాలున్నట్లు తెలుస్తోంది. బండి సంజయ్ తరచూ ఢిల్లీ పెద్దలతో వాట్సప్ చాట్ చేసేవారు. పార్టీ అధ్యక్షుడిగా అది సహజం. చాలా రహస్యాలు వారి మధ్య ప్రస్తావనకు వచ్చి ఉండొచ్చు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, బీఆర్ఎస్ సర్కార్‌ను ఎలా ఎదుర్కోవాలి, ఎలా ముందుకెళ్లాలి.. వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలి వంటి అంశాలు ఆ ఫోన్‌లో ఉండి ఉండొచ్చు. ఆ ఫోన్ పోలీసుల చేతికి చిక్కితే రహస్యం గడప దాటుతుంది. అందుకే ఫోన్‌ను ఇవ్వడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది. తమకు సంబంధించిన చాలా రహస్య విషయాలు బీఆర్ఎస్ పెద్దలకు చేరతాయని బీజేపీ అనుమానపడుతోంది. అదే జరిగితే రాజకీయంగా బీజీపేకి చావుదెబ్బ తగిలినట్లవుతుంది. ఫోన్ పోలీసుల చేతికి చేరిందంటే అందులోని ప్రతి మెసేజ్, వాయిస్ కాల్స్ ఇలా అన్నింటినీ పోలీసులు జల్లెడ పడతారు. ఎప్పుడెప్పుడు ఎవరెవరితో ఏమేం మాట్లాడారో బయటకు తీస్తారు. అక్కడ్నుంచి అంతా తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు చేరిపోతుంది. అందుకే బండి తన ఫోన్‌ను మాయం చేశారు.
లిక్కర్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత పూర్తిగా ఇరుక్కుపోయి ఉన్నారు. ఇప్పటికే మూడుసార్లు ఈడీ ఆమెను ప్రశ్నించింది. ఆ కేసు నుంచి బయటపడటానికి బండి సంజయ్ ఫోన్‌ను తెలంగాణ ప్రభుత్వ పెద్దలు వాడుకునే అవకాశాలూ లేకపోలేదు. బండి ఫోన్‌లో చిన్న లింక్ దొరికినా చాలు దాన్ని బట్టి కథ అల్లుకుపోవచ్చు.
ఇక తెలంగాణ ప్రభుత్వానికి మరో రకంగా ప్రయోజనం కూడా ఉంటుంది. అటు లిక్కర్ కేసు చిక్కులకు తోడు టీఎస్‌పీఎస్‌పీ పేపర్‌లీక్ కేసుతో రాష్ట్ర ప్రభుత్వం అప్రతిష్టపాలైంది. దీనికి తోడు పులిమీద పుట్రలా వరుసగా రెండ్రోజుల పాటు పదో తరగతి పేపర్లు బయటకు వచ్చాయి. దీంతో తలమరింత బొప్పికట్టింది. దీన్నుంచి తప్పించుకోవడానికి తంటాలు పడుతున్న సమయంలో ఆ పేపర్ బండికి వాట్సప్‌లో చేరిందని తేలింది. అంతే సముద్రంలో చిక్కుకున్నవాడికి చెక్కబల్ల దొరికినట్లు దాన్ని వాడుకున్నారు. ఇష్యూను డైవర్ట్ చేయడానికే బండిని పూర్తిగా ఇరికించినట్లు భావిస్తున్నారు.
ప్రస్తుతానికైతే మీడియా అటెన్షన్ అంతా టెన్త్ పేపర్లపైనే ఉంటుంది. ఈలోపు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ అంశాన్ని జనం మర్చిపోతారు. ఇది బీఆర్ఎస్ పెద్దల ఆలోచన.. పేపర్ లీక్ అంశం రాజకీయంగా నలుగుతుంటే ఎన్నికల్లో తమకు దెబ్బ.. అదే బీజేపీని కూడా దోషిగా నిలబెట్టగలిగితే కనీసం కొంతమేర అందులో సక్సెస్ అయినా మంచిదే అన్నది బీఆర్ఎస్ ఆలోచనగా కనిపిస్తోంది. నిజానికి ఈ కేసు కోర్టులో నిలబడదని ప్రభుత్వ పెద్దలకూ తెలుసు. కానీ ఎలాగోలా తాము బయటపడాలంటే ఇదే మార్గమని భావించినట్లు తెలుస్తోంది. తమ మీద ఎలాగూ బురద పడింది కాబట్టి దాన్ని బీజేపీపై కూడా చల్లితే లెక్క సరిపోతుందనుకున్నట్లున్నారు. రాష్ట్రంలోని పొలిటికల్ ఈక్వేషన్స్ చూస్తుంటే ఈ కేసులో మరిన్ని ట్విస్టులు ఉండే అవకాశాలు లేకపోలేదు.