తెలంగాణలో టెన్త్ పేపర్ లీకేజ్ కేసు హీట్ పుట్టిస్తోంది. ఇప్పుడు ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. నిన్న ఎగ్జామ్ సెంటర్ నుంచి పేపర్‌ను వాట్సాప్‌లో సర్క్యులేట్ చేసిన నిందితుడు.. ఆ పేపర్‌ను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి కూడా ఫార్వర్డ్ చేశాడు. దీంతో ఈ వ్యవహారంలో బండి సంజయ్ కుట్ర ఉందంటూ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి ఒంటి గంటకు ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు.. బలవంతంగా సంజయ్‌ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఈ విషయం సంచలనంగా మారింది.
ఉదయాన్నే ఈ విషయం మాట్లాడేందుకు పార్టీ ఆఫీస్‌కు వెళ్తు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ను కూడా పోలీసులు ప్రివెంటివ్ అరెస్ట్ చేశారు. దీంతో ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం బొమ్మలరామారం పీఎస్ నుంచి బండి సంజయ్‌ని వరంగల్ తరలిస్తున్నారు. ఏ కోర్టులో సంజయ్‌ని హాజరుపరుస్తారనే విషయంలో పోలీసులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇటు బీజేపీ నేతలు ఈ విషయంలో హైకోర్టును ఆశ్రయించారు. కారణం చెప్పకుండా బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారని.. ఎక్కడ ఉన్నాడో కూడా చెప్పడంలేదంటూ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.
అటు బొమ్మల రామారం పీఎస్ ముందు బీజేపీ కార్యకర్తలు భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. వెంటనే సంజయ్‌ను విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ నేతలే పేపర్ లీక్ చేయించి.. ఆ తప్పును బీజేపీ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇటు బీఆర్‌ఎస్ మాత్రం బీజేపీని దోషిగా చూపిస్తోంది. ఇప్పుడు పేపర్ లీక్‌కు పాల్పడ్డ ప్రశాంత్‌కు, గతంలో TSPSC పేపర్ లీక్ కేసు నిందితుడు రాజశేఖర్ రెడ్డికి బీజేపీ పెద్దలతో సంబంధాలున్నాయంటూ ఫొటోలు చూపిస్తున్నారు బీఆర్‌ఎస్ నేతలు.
తెలంగాణ ప్రజల్లో అభద్రతా భావం కల్పించేందుకు, బీఆర్‌ఎస్ ప్రభుత్వం మీద నమ్మకం పోగొట్టేలా చేసేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. పేపర్ లీక్ అయినా, మాస్ కాపీయింగ్ జరిగినా ఆ విషయం పోలీసులకంటే ముందు బీజేపీ నేతలకు ఎలా తెలుస్తోందంటూ క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్ల ప్రమేయం ఉంటోంది కాబట్టే అందరికంటే ముందు వాళ్లకే లీకేజ్‌ల గురించి తెలుస్తోందంటున్నారు. ఇటు బీజేపీ నేతలు మాత్రం ఈ విషయంలో కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. తప్పు ఉందనిపిస్తే నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలి కానీ.. ఎలాంటి నోటీసులు లేకుండా, విచారణ జరపకుండా ఎలా కుట్ర కేస్ బుక్ చేసి అరెస్ట్ చేస్తారంటూ క్వశ్చన్ చేస్తున్నారు.
డీజీపీతో మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ కేసులో అరెస్ట్ చేశారో డీజీపీకే తెలియకపోతే పోలీసులు ఎందుకు ఉన్నట్టు అంటూ ఫైర్ అయ్యారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా బండి సంజయ్ అరెస్ట్‌ను ఖండించారు. కేసీఆర్ ప్రభుత్వం చేసే తాటాకు చప్పుళ్లకు బీజేపీ భయపడబోదన్నారు. పేపర్ లీకేజ్ వ్యవహారంలో కొనసాగుతున్న ఈ అరెస్ట్‌ల వ్యవహారం తెలంగాణలో మరిన్ని ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదముంది.