Bandi Sanjay: బండి సంజయ్.. నిన్నమొన్నటి వరకు తెలంగాణ బీజేపీలో ఫైర్ బ్రాండ్!! అలాంటి డైనమిక్ మాస్ లీడర్ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. తనకు పార్టీ జాతీయ నాయకత్వం ఇచ్చిన బాధ్యతలను ఫార్మాలిటీ ప్రకారం చేస్తూ ముందకు సాగిపోతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న టైంలో అసెంబ్లీకి పోటీ చేయాలని ఆయన అనుకునేవారని, ఇప్పుడు ఆ ఆలోచనను దాదాపుగా విరమించుకున్నారని తెలుస్తోంది. దీంతో కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి బండి సంజయ్ పోటీ చేయరని తేలిపోయింది. కరీంనగర్ నుంచే గత పార్లమెంటు ఎన్నికల్లో గెలిచిన బండి.. ఈసారి కూడా లోక్‌సభ బరిలోకి దిగేందుకే మొగ్గుచూపుతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 2018 అసెంబ్లీ పోల్స్‌లో కరీంనగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి.. గంగుల కమలాకర్ చేతిలో ఓడిపోవడంతో బండి సంజయ్‌పై అప్పట్లో సానుభూతి పెరిగింది. ఈ సానుభూతి పవనాలు కలిసొచ్చి.. 2019లో జరిగిన కరీంనగర్ లోక్‌సభ ఎన్నికలో అవలీలగా ఆయన విజయ ఢంకా మోగించారు. మొత్తం 4,98,276 ఓట్లు సాధించి, సమీప ప్రత్యర్థి బి.వినోద్‌కుమార్‌పై 89,508 ఓట్ల మెజారిటీని సాధించారు.
ఇటు అసెంబ్లీ.. అటు లోక్‌సభలోనూ..
ఈసారి తెలంగాణ బీజేపీలో పరిస్థితులు మరోలా ఉన్నాయి. రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో సంజయ్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆయనలో మునుపటి జోష్ కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కరీంనగర్ అసెంబ్లీ నుంచి ఎలాగైనా గెలవాలనే కసితో నియోజకవర్గాన్ని ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్ అనే ఐదు భాగాలుగా విభజించి ఎన్నికల ప్రణాళికను గతంలో బండి సిద్ధం చేసుకున్నారట. ఇటువంటి టైంలో బీజేపీ పెద్దలు రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి షాక్ ఇవ్వడంతో సంజయ్ చాలా బాధపడ్డారని తెలిసింది. ప్రస్తుతం బండి సంజయ్‌కు ఎదురుగాలి వీస్తున్నాయి. ఇదే సమయంలో ఆయనకు పట్టున్న స్థానాల్లోనూ పోటీ చేసేందుకు పార్టీకి చెందిన ఇతర నేతలు సై అంటున్నారట. ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలిసి పైరవీలు కూడా చేస్తున్నారట. ఒకవేళ కరీంనగర్ అసెంబ్లీని బండి వద్దనుకుంటే తనకు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్సీ సంతోష్ అడుగుతున్నారట. బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఆయన ఇంట్రెస్టును కిషన్ రెడ్డి పరిగణనలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు బండి సంజయ్ సిట్టింగ్ పార్లమెంటు స్థానం కరీంనగర్ నుంచి పోటీచేస్తానని బీజేపీ సీనియర్ నేత పొల్సాని సుగుణాకర్‌రావు అంటున్నారట. ఆయన ఇప్పటికే తనవంతు ప్రయత్నాలు మొదలుపెట్టారట. బండి సంజయ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నన్ని రోజులు వినిపించని డిమాండ్లు ఇప్పుడు తెరపైకి వస్తుండటం బీజేపీలో మారిపోయిన సమీకరణాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
బండి ఎగ్జిట్.. కీలక లీడర్లు సైలెంట్..
ఇక బండి సంజయ్‌ను రాష్ట్ర చీఫ్ పదవి నుంచి తప్పించినప్పటి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. విజయశాంతి పలుకు లేదు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి కనిపించకుండా పోయారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు.. పార్టీ కార్యాలయం వైపే కన్నెత్తి చూడటం లేదు. ఇటీవల గెలిచిన ఎమ్మెల్సీ ఎవీఎన్ రెడ్డి పార్టీకి అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. వీరంతా కాషాయ గూటిలో ఇమడలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ డేంజర్ సిగ్నల్స్‌తోనైనా అలర్ట్ కాకుంటే.. వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి గడ్డుకాలం ఎదురవడం ఖాయం!!