బండి సంజయ్ కి కమలంలో కీలక పదవి లభించింది.. మరి ఆయనకు కేంద్ర మంత్రి పదవి లేనట్టేనా..? అధ్యక్షుడిగా తప్పించిన ఆయనకు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఎందుకు ఇచ్చినట్టు..? ఇప్పట్లో కేంద్ర మంత్రి వర్గ విస్తరణ లేనట్టేనా..?
బీజేపీ జాతీయ కమిటీని ప్రకటించారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్దా. ఆ కమిటీలో కొందరు కొత్తవారికి అవకాశం కల్పించారు. తెలంగాణ నుంచి జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న డికే అరుణను కంటిన్యూ చేశారు. కొత్తగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ కి చోటు దక్కింది.
సంజయ్ కి ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడంపై పార్టీ లో చర్చ జరుగుతోంది. ఆయనకు అంత కీలక పదవి ఇవ్వడం వెనుక కారణాలు చర్చించుకుంటున్నారు. ఆయన్ను అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత పార్టీలోనూ ప్రజల్లోనూ వ్యతిరేకత వ్యక్తం కావడం.. పార్టీ శ్రేణుల్లో నిరాశ నెలకొందనే వార్తలు రావడం.. పార్టీ పైన తీవ్ర ప్రభావం పడుతుందని సమాచారం రావడంతో బండి సంజయ్ ని ప్రధాన కార్యదర్శిగా నియమించారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతుంది. బండి సంజయ్ ని బలంగా నమ్మే కేడర్ పార్టీకి దూరం కాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే బండి సంజయ్ ని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో కేంద్ర మంత్రిగా అవకాశం ఉండకపోవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. కేంద్ర మంత్రిగా తీసుకోవద్దనే ఉద్దేశంతోనే ఆయనకు పార్టీ పదవి ఇచ్చి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంత్రివర్గ విస్తరణ ఉంటుందా ఉండదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఆలస్యం కావచ్చనే చర్చ కూడా జరుగుతోంది. ఏదేమైనా బండి సంజయ్ కి కీలక పదవి ఇవ్వడంపై ఇంటా బయట జోరుగా చర్చ జరుగుతుంది. సంజయ్ కి అన్యాయం జరిగింది అనే దానికి చెక్ పెట్టారనే మాటలు వివిధ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. సంజయ్ ని తెలంగాణేతర రాష్ట్రాలకు ఇంఛార్జి గా నియమించే అవకాశం ఉంది..
కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి కొనసాగే అవకాశాలు ఉన్నాయని బండి సంజయ్ నియామకం వల్ల అనుకోవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరొకరికి తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి వర్గంలో అవకాశం ఉండొచ్చని సమాచారం. బండి సంజయ్ ని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ ని కొనసాగిస్తారా తప్పిస్తారా మన సందేహాలు కూడా పార్టీలో వ్యక్తం అవుతున్నాయి. ఇక గతంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన మురళీధర్ రావుకి ఈసారి జాతీయ కమిటీలో చోటు లభించలేదు. అయితే మురళీధర్ రావు తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రెండో వ్యక్తి బండి సంజయ్ కావడం విశేషం.