కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన కామెంట్స్ చేసారు. తనకు మంత్రి కేటిఆర్ లీగల్ నోటీసులు పంపడంపై బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. మాజీమంత్రి కేటీఆర్ నాకు లీగల్ నోటీసు పంపినట్లు మీడియాలో చూశానని… లీగల్ నోటీసుతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వారెవరూ లేరు అంటూ స్పష్టం చేసారు. నన్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక లీగల్ నోటీస్ ఇవ్వడం చూస్తుంటే జాలేస్తోందని ఎద్దేవా చేసారు. తాటాకు చప్పళ్లకు భయపడేది లేదన్నారు.
నాపై తొలుత వ్యక్తిగత ఆరోపణలు చేసి అవమానించింది కేటీఆరేనన్న బండి సంజయ్… అందుకు బదులుగానే నేను మాట్లాడిన అని తెలిపారు. ఆయన సుద్దపూస అనుకుంటున్నాడేమో… ఆయన భాగోతం ప్రజలకు తెలుసు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఏం జరిగిందో, ఆ కేసులను ఏ విధంగా నీరుగార్చారో తెలుసన్నారు. ఇప్పటి వరకు మాటకు మాటతోనే బదులిచ్చిన… లీగల్ నోటీసులకు నోటీసులతోనే బదులిస్తా అంటూ కౌంటర్ ఇచ్చారు. మేం చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించే వ్యక్తులమన్న సంజయ్… చట్టం, న్యాయం ప్రకారం కూడా ముందుకు వెళతామని హెచ్చరించారు.