Bandi Sanjay: ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు చేయొద్దు.. కిషన్ రెడ్డినైనా పని చేసుకోనివ్వండి.. నేతలకు బండి వార్నింగ్

బండి సంజయ్ ముఖ్యం కాదని, పార్టీనే ముఖ్యమన్నారు. కిషన్ రెడ్డిని పని చేసుకోనివ్వాలని తోటి నేతలకు సూచించారు. బండికి వ్యతిరేకంగా ఈటల, కోమటిరెడ్డి, రఘునందన్ రావు, జితేందర్ రెడ్డి వంటి నేతలు ఢిల్లీ వెళ్లి బీజేపీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

  • Written By:
  • Publish Date - July 21, 2023 / 07:55 PM IST

Bandi Sanjay: తనపై ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలకు తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ చురకలంటించారు. ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు చేయడం ఆపాలని పార్టీ నేతలకు సూచించారు. కార్యకర్తల జీవితాలతో ఆడుకోవద్దన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ ముఖ్యం కాదని, పార్టీనే ముఖ్యమన్నారు. కిషన్ రెడ్డిని పని చేసుకోనివ్వాలని తోటి నేతలకు సూచించారు. బండికి వ్యతిరేకంగా ఈటల, కోమటిరెడ్డి, రఘునందన్ రావు, జితేందర్ రెడ్డి వంటి నేతలు ఢిల్లీ వెళ్లి బీజేపీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనివల్లే బండి పదవి కోల్పోవాల్సి వచ్చిందనే ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ వాదనలకు బలం చేకూరుస్తూ బండి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బండి మాట్లాడుతూ “నేతలు ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు చేయడం మానుకోవాలి. కిషన్ రెడ్డినైనా ప్రశాంతంగా పని చేసుకోనివ్వాలి. కార్యకర్తల జీవితాలతో ఆడుకోవద్దు. నామీద కొంత మంది ఫిర్యాదు చేశారు. అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత రెండుసార్లు జైలుకు వెళ్లా. అధ్యక్షుడిగా నా కర్తవ్యం నెరవేర్చానన్న సంతృప్తి నాకుంది. పార్టీనే ముఖ్యం. బండి సంజయ్ కాదు. పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేయాలి. సీఎం కేసీఆర్ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై రాబోయే వంద రోజుల పాటు బీజేపీ ఉద్యమిస్తుంది.

ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి.. కేసీఆర్ డ్రామాలు, కుట్రలకు తెరతీశారు. పీఆర్సీ వేయబోతున్నట్లు లీకులిస్తున్నారు. పీఆర్సీ వేసినా అమలు చేయరు. ఉద్యోగులు కేసీఆర్ మాటలు నమ్మొద్దు. బీజేపీని ఎదుర్కొనే ధైర్యం లేకే బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఒక్కటే. అయితే.. బీజేపీ బలపడకూడదనే ఉద్దేశంతో బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ నాయకులతో ప్రచారం చేయిస్తున్నారు. గతంలో కేసీఆర్‌ను కలిసిన జాతీయ నేతలంతా ఇప్పుడు కాంగ్రెస్‌ కూటమిలో ఉన్నారు. బీసీలు బీజేపీ వైపే ఉన్నారు. అందుకే వారిని వచ్చే ఎన్నికల్లో తమ వైపు తిప్పుకోవడం కోసమే రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటన చేశారు” అంటూ బండి వ్యాఖ్యానించారు.