Bandi Vs Etela: తెలంగాణ బీజేపీలో కూడా గ్రూపు రాజకీయాలు రంజుగా సాగుతున్నట్లే కనిపిస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య చాలా కాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. పలు సందర్భాల్లో ఇవి బయటపడ్డాయి. బండి సంజయ్-ఈటల మధ్యే కాదు.. బండికి ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రఘునందన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, విజయశాంతి వంటి పలువురు నేతలతో విబేధాలున్నాయి. పైగా అంతా ఒకటిగా కనిపిస్తున్నా.. పార్టీలో మాత్రం ఎవరిదారి వారిదే అన్నట్లు ఉంటోంది వ్యవహారం. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించుకునేందుకు ప్రదర్శిస్తున్నారు. ఎవరికి వాళ్లు పార్టీలో సొంత ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నారు. దీంతో విభేదాలు మరింత ఎక్కువయ్యాయి. ఇది ఇలాగే కొనసాగితే బీజేపీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలా మారే అవకాశాల్ని కొట్టిపారేయలేం.
బండితో బీజేపీలో ఊపు
బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడు అయ్యాక తెలంగాణ బీజేపీలో ఊపొచ్చిందనేది నిజం. అంతకుముందు కిషన్ రెడ్డి, కే.లక్ష్మణ్ వంటి నేతలున్నా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారు. అయితే, బండి సంజయ్ అధ్యక్ష పదవి చేపట్టగానే కార్యకర్తల్లో ఉత్సాహం వచ్చింది. మోదీ, అమిత్ షా సూచనలతో రాష్ట్రంలో బీజేపీ దూకుడుగా వెళ్తోంది. దీంతో నాయకులు కూడా ప్రజల్లో కనిపిస్తున్నారు. పార్టీ బలపడుతున్నట్లే కనిపిస్తోంది. ఇదే సమయంలో పార్టీలో అంతర్గత పోరు ప్రారంభమైంది. ఆధిపత్యం కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు. నాయకులు గ్రూపులు కట్టి, తమ గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ప్రజల్లో గుర్తింపు ఉంటేనే పదవులు దక్కుతాయనే నమ్మకం. అందుకే నాయకులు తాము ఎదగాలని.. ఇతర నాయకులు ఎదగకూడదని కోరుకుంటారు.
ఈటలతో సమస్య ఇదీ
బండి సంజయ్ అంగీకారంతోనే అప్పట్లో ఈటల బీజేపీలోకి చేరాడు. ఆయన గెలుపు కోసం తనవంతు ప్రయత్నం చేశాడు. ఈటల గెలిచాడు. అయితే, ఆ తర్వాతే బండి-ఈటల మధ్య విభేదాలు మొదలయ్యాయి. టీఆర్ఎస్ నుంచి వచ్చిన ఈటల బీజేపీలో తనదైన గుర్తింపు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇద్దరిదీ ఒకే జిల్లా కావడం కూడా వారి మధ్య విబేధాలకు మరో కారణం. పార్టీలో తన వాళ్లకు పదవులు, సీట్లు ఇచ్చుకునేందుకు అటు బండి ప్రయత్నిస్తుంటే.. మరోవైపు ఈటల కూడా అదే ప్రయత్నాలు చేయసాగాడు. పార్టీలోనూ ఇద్దరూ తమ వాళ్లను ప్రోత్సహించారు. తెలంగాణలో కేసీఆర్‌ను ధీటుగా ఎదుర్కొనే శక్తి తనకు మాత్రమే ఉందన్నట్లు ఈటల చెప్పుకొచ్చాడు. అంటే తాను బీజేపీలో కేసీఆర్ స్థాయి వ్యక్తి చాటుకొనే ప్రయత్నం చేశాడు. అవసరమైతే కేసీఆర్‌పై పోటీ చేసేందుకు కూడా సిద్ధమన్నాడు ఈటల. దీంతో సహజంగానే బండికి కోపం వచ్చింది. ఇలా అనేక అంశాల్లో ఈటలకు, బండికి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. పార్టీ అధ్యక్షుడైన బండికి తెలియకుండానే ఈటల ఇటీవల పొంగులేటిని కలవడం సంచలనం సృష్టించింది. దీంతో పార్టీలో ఇద్దరూ ఒకరితో ఒకరు సంబంధం లేకుండానే నడుచుకుంటున్నారని మరోసారి బయటపడింది.
బండికి ఇతర నేతలతోనూ విభేదాలే
బండి సంజయ్కు ఇతర నేతలతోనూ సమస్యలున్నాయి. ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే రఘునందన్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కే.లక్ష్మణ్‌తోపాటు సీనియర్ నేత విజయశాంతితోనూ సమస్యలున్నాయి. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని, తన సేవల్ని పార్టీ వినియోగించుకోవడం లేదని విజయశాంతి అన్నారు. బండి సంజయ్ వైఖరిపై నేరుగా విమర్శలు చేశారు. ఇటీవల కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలు వివాదాస్పదమైనప్పుడు ఆయనకు బీజేపీ నుంచి ఎవ్వరూ మద్దతుగా మాట్లాడలేదంటేనే ఆయనపై పార్టీ నేతలకు ఏ స్థాయి కోపం ఉందో అర్థం చేసుకోవచ్చు. అరవింద్ లాంటి వాళ్లు నేరుగా బండి వ్యాఖ్యలను తప్పబట్టారు. దీంతో పైకి కనిపించేంత క్రమశిక్షణ బీజేపీలో లేదేమోననే వాదనలు మొదలయ్యాయి. ఈ పార్టీలో కూడా కాంగ్రెస్‌లోలాగే అంతర్గత విబేధాలున్నట్లు తెలుస్తోంది. అయితే, పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండటం.. మోదీ, అమిత షా, నద్దాలాంటి సీనియర్లు బలంగా ఉండటం మూలంగా మరీ కాంగ్రెస్‌లోలాగా బహిరంగంగా విమర్శలు చేసుకోవడం లేదంతే. కానీ, నేతల మధ్య అంతర్గత కలహాలు పార్టీకి హాని చేస్తాయని గుర్తించకుంటే తెలంగాణలో బీజేపీ గెలవడం అసాధ్యం. కలిసికట్టుగా పనిచేస్తేనే విజయం దక్కుతుంది.