Bandla Ganesh: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ఏపీ ప్రభుత్వం.. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టును పలువురు సినీ ప్రముఖులు ఖండిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ కూడా స్పందించారు. ఐటీ వర్గాలు చేపట్టిన ర్యాలీలో బండ్ల పాల్గొన్నారు. ఈ సందర్భగా చంద్రబాబుకు అనుకూలంగా కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్టు తనను ఎంతో బాధించిందన్నారు. ఈ బాధతో తన ఇంట్లో వినాయక చవితి వేడుకలు జరుపుకోలేదన్నారు.
అంతేకాదు.. చంద్రబాబు కోసం ధర్నాలు, నిరసనలు చేస్తున్న ఐటీ ఉద్యోగులు తమ ఉద్యోగాలకు సెలవు పెట్టి, సొంతూళ్లకు వెళ్లి ధర్నాలు చేయాలని సూచించాడు. “తెలుగు జాతికి పెద్ద చంద్రబాబు నాయుడు. ఆయన 14 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించారు. ఒక విజనరీ సీఎం రాజమండ్రి జైలులో మగ్గుతుంటే తిండి ఎలా తినాలనిపిస్తున్నది. నాకు చాలా కడుపు మంటగా, బాధగా ఉంది. చంద్రబాబు మళ్లీ రాష్ట్రాన్ని ఏలుతారు. దేశాన్ని శాసిస్తారు. చంద్రబాబు జైల్లో ఇబ్బంది పడుతుంటే అన్నం కూడా తినబుద్ధి కావడంలేదు. చంద్రబాబు జాతీయ సంపద. ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ర్యాలీలు, ధర్నాలు చేస్తే చంపుతారా..? చంపాలంటే చంపుకోండి. చంద్రబాబును జైల్లో పెట్టిన దానికంటే ఎక్కువేం కాదు. శ్రీకృష్ణుడికే తప్పలేదు. శ్రీరాముడికే వనవాసం తప్పలేదు. చంద్రబాబు కోసం దేనికైనా మేము సిద్దంగా ఉన్నాం. చంద్రబాబు పేరు చెప్పుకొని ఎందరో బాగుపడ్డారు. ఐటి ఉద్యోగులు హైదరాబాదులో రోడ్లపై కాకుండా.. నెల రోజులు ఉద్యోగాలకు సెలవు పెట్టి సొంతూళ్లోని బొడ్రాయి ముందు ధర్నా చేయాలి.
రాబోయే ఎన్నికల్లో టిడిపి ఘనవిజయం సాధించి చంద్రబాబు మరో మరోసారి సీఎం కావడం ఖాయం” అని బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు. టీడీపీతో జనసేన పొత్తు ప్రకటన తర్వాత చంద్రబాబుకు మద్దతుగా బండ్ల గణేష్ కామెంట్లు చేయడం విశేషం.