Top story: 2027లోనే లోక్‌సభ, ఏపీ, తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు…!

2029లో జరగాల్సిన లోక్‌సభ, ఎపీ అసెంబ్లీ ఎన్నికలు, 2028లో జరగాల్సిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అన్నీ 2027లోనే జరగబోతున్నాయి. ఇక జమిలీని ఆపడం ఎవరి తరమూ కాదు... మహారాష్ట్ర గెలుపు ఊపుతో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ 2027లో వన్ నేషన్- వన్ ఎలక్షన్‌కు పావులు కదుపుతున్నారు.

  • Written By:
  • Publish Date - November 24, 2024 / 12:58 PM IST

2029లో జరగాల్సిన లోక్‌సభ, ఎపీ అసెంబ్లీ ఎన్నికలు, 2028లో జరగాల్సిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అన్నీ 2027లోనే జరగబోతున్నాయి. ఇక జమిలీని ఆపడం ఎవరి తరమూ కాదు… మహారాష్ట్ర గెలుపు ఊపుతో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ 2027లో వన్ నేషన్- వన్ ఎలక్షన్‌కు పావులు కదుపుతున్నారు. ఇక దాన్ని ఆపడం కష్టమే… మహా మ్యాండేట్‌ మోడీ పాలనకు లిట్మస్ టెస్ట్ అని బీజేపీ చెబుతోంది.

మహారాష్ట్రలో సునామీ స్థాయి విజయం అధికార బీజేపీకి బిగ్ బూస్ట్‌లా మారింది. కమలం దూకుడు ముందు వందేళ్లు పైబడ్డ పార్టీ కూడా తోకముడిచింది. రాజకీయ చాణుక్యుడు శరద్‌పవార్ ఎత్తులు పారలేదు. ఉద్దవ్‌థాక్రే పాచికలూ పనిచేయలేదు… ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ ఆటలో అరటిపండులా మిగిలిపోయింది. మహారాష్ట్ర కట్టగట్టుకుని బీజేపీ కూటమి మహాయుతికి జై కొట్టింది. అసలు గెలుపే కష్టమనుకున్న క్యాష్‌రిచ్‌ మహారాష్ట్రలో ఈ స్థాయి గెలుపు కమలానికి ఎనలేని ఉత్సాహాన్నిచ్చింది. బీజేపీ చేపట్టాలనుకున్న పలు సంస్కరణలకు ఈ విజయం ఓ ఎంట్రీ కార్డులా మారింది.

మోడీ దూకుడు, బీజేపి విజయాలు చూస్తుంటే 2027లో జమిలీ ఎన్నికలు తప్పదనే అనిపిస్తోంది. ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అయితే రాష్ట్రాల ఎన్నికల కారణంగా ప్రాసెస్‌ను కాస్త స్లో చేసింది. కానీ ఇప్పుడు మహా గెలుపుతో జూలు విదిల్చి జమిలీపై ఫోకస్ పెట్టబోతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. త్వరలో జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో జమిలీ ఎన్నికలపై బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. అందరి మద్దతును కూడగట్టి వీలైనంత త్వరగా జమిలికి లైన్ క్లియర్ చేయాలన్నది బీజేపీ ఆలోచన. రానున్న మూడు నెలలు కీలకమని పొలిటికల్ పండిట్స్ చెబుతున్నారు. దేశంలో బీజేపీ, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలే ఎక్కువ. కాబట్టి ఆ బిల్లుకు మెజారిటీ రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదం తెలపడం లాంచనమే. అది జరిగిన వెంటనే ఎన్నికల సందడి మొదలైపోతుంది. తమకు ఎదురులేదు కాబట్టి మోడీ జమిలీ ఆలోచనకు బ్రేక్ పడే అవకాశాలు అసల్లేవు. పైగా జమిలీపై ముందుకెళ్లడానికి ఇదే సరైన సమయమని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే భాగస్వామ్య పార్టీలకు ఈ దిశగా సంకేతాలు కూడా ఇచ్చింది బీజేపీ. ఇప్పుడు స్పీడ్ పెంచితే 2027లో జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే భారీగా ప్రజాధనం ఆదా అవుతుందని కేంద్రం వాదిస్తోంది. పైగా పదే పదే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అభివృద్ధి పనులకు విఘాతం కలుగుతోందని అంటోంది. ఒకేసారి ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీలపై తాము పైచేయి సాధించవచ్చు అని బీజేపీ భావిస్తోంది. కానీ అసలు కథ వేరేగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. దేశమంతా కాషాయజెండా ఎగరాలన్నది ఆర్ఎస్ఎస్ కల. అందులో భాగంగానే జమిలీ అన్న ప్రచారం కూడా ఉంది. ఒకేసారి ఎన్నికలు జరిగితే గెలుపు తమదేనని బీజేపీ భావిస్తోంది. పైగా మోడీ నాలుగోసారీ ప్రధానిగా పదవిని చేపట్టవచ్చు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ కొట్టినా చావు తప్పి కన్ను లొట్టపోయినట్లైంది పరిస్థితి. 4వందల సీట్లనుకుంటే కేవలం 240సీట్లే వచ్చాయి. అందుకే జమిలీ పెడితే తమకు సీట్లు పెరుగుతాయన్నది బీజేపీ ఆలోచన. రాజకీయంగా బీజేపీకి ఇది అద్భుతకాలమనే చెప్పాలి. ఇప్పటివరకూ మోడీకి ఎదురులేదు. అలాగే కాంగ్రెస్‌కు దిశ, దశ లేదు… ఇండియా కూటమిగా ఏర్పడినా ఇప్పటివరకూ కలిసి విజయం సాధించిన సందర్భాలు లేవు. కశ్మీర్‌, జార్ఖండ్‌ లాంటీ ఒకటీ అరా చోట్ల గెలిచినా అది కాంగ్రెస్ బలం కాదు.. ప్రాంతీయ పార్టీల బలమే కాంగ్రెస్‌ను గెలిపించింది. కాంగ్రెస్‌ను పూర్తిగా చంపేయడానికి ఇదే సరైన టైమ్ అన్నది బీజేపీ ఆలోచనలా ఉంది.

జమిలి తప్పదని చాలా పార్టీలు ఇప్పటికే డిసైడైపోయాయి. అటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అసెంబ్లీలోనే 2027లో ఎన్నికలు అన్నట్లు మాట్లాడారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా మరో రెండేళ్లలో ఎన్నికలు ఉన్నాయంటున్నారు. దానికి రెడీ అవ్వాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌కు కూడా జమిలీ తప్పదని దాదాపు అర్థమైనట్లుంది. మహారాష్ట్రలో గెలిచి ఉంటే ఆ ఊపుతో ధైర్యంగా పోరాడే అవకాశం ఉండేది. కానీ మహా ఓటమితో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. వన్ నేషన్ వన్ ఎలక్షనే కాదు మరికొన్ని అంశాలు కూడా బీజేపీ టాప్ లిస్ట్‌లో ఉన్నాయి. యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు దిశగా అడుగులు వేయవచ్చు. ఇవే కాదు బీజేపీ అమ్ములపొదిలో మరికొన్ని అస్త్రాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అవన్నీ ఒకదాని వెనుక ఒకటి అమలు చేసే అవకాశం ఉంది.