Janasena Yathra: విశాఖ మరోసారి రణరంగం కాక తప్పదా..! పవన్ వ్యూహమేంటి..?

జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి విజయోత్సవ యాత్ర ఉత్తరాంధ్రలో అడుగు పెట్టకముందే రాజకీయ వేడి రగిలింది. పవన్‌ను అడ్డుకోవడానికి అధికార వైసీపీ పోలీసులను అడ్డుపెట్టుకుంటోంది. మమ్మల్ని ఎలా అడ్డుకుంటారో చూస్తామంటూ జనసైనికులు సవాల్ చేస్తున్నారు. దీంతో విశాఖలో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది.

  • Written By:
  • Publish Date - August 8, 2023 / 01:39 PM IST

జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి విజయోత్సవ యాత్ర ఉత్తరాంధ్రలో అడుగు పెట్టకముందే రాజకీయ వేడి రగిలింది. పవన్‌ను అడ్డుకోవడానికి అధికార వైసీపీ పోలీసులను అడ్డుపెట్టుకుంటోంది. మమ్మల్ని ఎలా అడ్డుకుంటారో చూస్తామంటూ జనసైనికులు సవాల్ చేస్తున్నారు. దీంతో విశాఖలో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది.

ఉమ్మడి విశాఖ జిల్లాలో మూడో విడత పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు టూర్ షెడ్యూల్ ప్రకటించింది జనసేన. తొలి రెండు విడతల్లో వారాహి యాత్ర సక్సెస్ కావడంతో జనసైనికులు మంచి ఊపుమీదున్నారు. విశాఖలోనూ పవన్ టూర్ సక్సెస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పదిరోజుల పాటు పవన్ స్టీల్ సిటీలోనే మకాం వేయనున్నారు. అయితే జనసైనికుల దూకుడుపై నీళ్లు చల్లుతున్నారు విశాఖ పోలీసులు. సెక్షన్ 30ని అమల్లోకి తీసుకువచ్చారు. ఈనెల చివరివరకు ఇవి అమల్లో ఉంటాయి. అంటే ముందస్తు అనుమతి లేకుండా ఇక్కడ ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. ర్యాలీలు చేయకూడదు. ఓరకంగా సెక్షన్ 144లాంటిదే ఇది కూడా. పవన్ యాత్రను అడ్డుకునేందుకే పోలీసులు వీటిని అమలు చేస్తున్నారని జనసైనికులు మండిపడుతున్నారు.

వైసీపీ వ్యూహమేంటి..?
సెక్షన్ 30 అమల్లో ఉండటంతో ఎలాంటి ర్యాలీలు నిర్వహించనివ్వరు. అనుమతి ఇచ్చినా సవాలక్ష నిబంధనలు పెడతారు. మాములుగానే పవన్ అంటే అభిమానులు పోటెత్తుతారు. ఖచ్చితంగా పోలీసుల షరతులు పాటించడం కష్టం అవుతుంది. దాన్ని సాకుగా చూపి పవన్ యాత్రను అడ్డుకోవాలన్నది అధికారపక్షం ఆలోచనగా కనిపిస్తోంది.

గతేడాది గుర్తుందా..!
గతేడాది కూడా విశాఖలో ఇదే జరిగింది. పవన్ కల్యాణ్ పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. మంత్రుల కాన్వాయ్‌పై జనసైనికులు రాళ్లు వేశారంటూ వారిపై లాఠీఛార్జ్ చేశారు. కొందరిని అరెస్ట్ చేశారు. వారిని కొట్టారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. రాత్రి పూట పవన్ ర్యాలీలో కరెంట్ తీసేశారు. శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నందున పవన్ పర్యటన ఆపివేయాలని ఆదేశించారు. విశాఖ విడిచి వెళ్లాలని ఆదేశించారు. జనసైనికులను విడుదల చేయకుండా పవన్ విశాఖ వదలి వెళ్లాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు. ఈసారి కూడా అదే వ్యూహాన్ని అనుసరించాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎందుకంత భయం..?
విశాఖలో వైసీపీ పరిస్థితి గతం కంటే దిగజారిపోయింది. రాజధాని అని చెప్పినా ప్రజలు నమ్మలేదు. ఈ పరిస్థితుల్లో పవన్ పదిరోజుల పర్యటన అంటే దాని ప్రభావం ఎలా ఉంటుందో వైసీపీ నేతలకు తెలుసు. పైగా ఈసారి పవన్ ఫోకస్ వేరే విధంగా ఉండబోతోంది. తొలి రెండు విడతల్లో ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజాసమస్యలపై ప్రధానంగా దృష్టి సారించారు పవన్. ఈసారి గోదావరి జిల్లాల కంటే మరింత వాడీవేడిగా జరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. పదిరోజుల్లో పవన్ రెండు బహిరంగసభలు నిర్వహిస్తారు. జనవాణి కార్యక్రమంలో పాల్గొంటారు. నియోజకవర్గ నేతలతో స్థానిక పరిస్థితులపై చర్చించడమే కాకుండా ముఖ్యమైన ప్రదేశాల్లో పర్యటించనున్నారు. బుషికొండ అంశాన్ని హైలెట్ చేయనున్నారు. అలాగే ఎంపీ సత్యనారాయణ ఫ్యామిలీ కిడ్నాప్ అంశాన్ని ప్రస్తావించి శాంతి భద్రతలు లేవన్న విషయాన్ని ప్రజల ముందుంచబోతున్నారు జనసేనాని. సిటీ నడిబొడ్డులో ఉన్న దసపల్ల భూములతో పాటు కశింకోట మండలం జమ్మదులపాలెం అసైన్డ్ భూములపై ఫోకస్ చేస్తారు. ఈ భూముల వెనుక మంత్రి అమర్నాథ్, ఆయన అనుచరులు హస్తం వుందని జనసేన ఆరోపిస్తోంది. వైసీపీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలు భూకబ్జాలకు పాల్పడుతున్నారనే అంశాన్ని జనంలో చర్చకు ఉంచబోతున్నారు పవన్. దీంతో పవన్ వారాహి యాత్రను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని వైసీపీ భావిస్తోంది.

జనసైనికులేమంటున్నారు..?
పవన్ యాత్రకు అడ్డంకులు సృష్టించడాన్ని జనసైనికులు సీరియస్‌గా తీసుకున్నారు. ప్రత్యక్ష ఆందోళన కు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికిప్పుడు హఠాత్తుగా సెక్షన్ 30 అమలు చేయాల్సిన అవసరమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. రుషికొండ అక్రమాలు బయటపడతాయనే భయంతోనే పవన్‌ను అడ్డుకుంటున్నారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు అనుమతిచ్చినా ఇవ్వకపోయినా యాత్రను మాత్రం సక్సెస్ చేస్తున్నామని సవాల్ విసురుతున్నారు. దీంతో ప్రశాంత విశాఖ తీరంలో ఏం జరగబోతుందోనన్న టెన్షన్ నెలకొంది.