భూమా మౌనికను పెళ్లి చేసుకున్న హీరో మనోజ్.. సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. రెండు ఫ్యామిలీలు హ్యాపీ.. అభిమానులు హ్యాపీ.. ఆ వెంకన్న దీవెనలు కూడా తీసుకున్నారు ఇద్దరు ! మౌనికకు రాజకీయంగా కొన్ని లక్ష్యాలు ఉన్నాయ్. ఆ విషయం ముందే చెప్పి.. మనోజ్‌ను పెళ్లి చేసుకుందని టాక్.
భూమా ఫ్యామిలీకి ఉమ్మడి కర్నూలు జిల్లాలో మంచి పట్టు ఉంది. మౌనిక తండ్రి నాగిరెడ్డి మూడుసార్లు ఎంపీగా చేస్తే.. ఆమె తల్లి శోభా నాగిరెడ్డి.. ఐదుసార్లు ఎమ్మెల్యేగా చేశారు. తల్లిదండ్రుల రాజకీయ వారసత్వాన్ని ఇద్దరు కూతుళ్లు కంటిన్యూ చేస్తున్నారు. భూమా అఖిలప్రియ.. టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేయగా.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే బరిలో నిలిచేందుకు మౌనికా రెడ్డి సిద్ధం అవుతున్నారు. నంద్యాలతో పాటు.. ఆళ్లగడ్డ అసెంబ్లీల్లో భూమా కుటుంబానికి మంచి పట్టు ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి అఖిలప్రియ పోటీకి సిద్ధం అవుతుండగా.. నంద్యాల నుంచి బరిలో దిగేందుకు మౌనికా రెడ్డి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు స్థానాలు వైసీపీ ఖాతాలోనే ఉన్నాయ్.
ఇదంతా కాదు మ్యాటర్.. అసలు సంగతి వేరే ఉంది. మౌనికా రెడ్డి వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచే బరిలో దిగే అవకాశాలు ఉన్నాయ్. మరి భార్య కోసం మనోజ్.. ఆ పార్టీకి ప్రచారం చేస్తారా లేదా అన్నది హాట్‌టాపిక్‌గా మారింది. మంచు కుటుంబంలో.. మోహన్‌బాబు సహా అందరూ వైసీపీకి మద్దతుగా ఉన్నారు. చంద్రబాబుతో విభేదించిన మోహన్‌బాబు.. జగన్ మీద ప్రశంసలు గుప్పిస్తుంటే.. వైఎస్ కుటుంబంతో విష్ణుకు బంధుత్వం ఉంది. మరి వాళ్లంతా వైసీపీ వైపు ఉంటే.. మనోజ్ టీడీపీ తరఫున భార్య కోసం ప్రచారం చేస్తారా అన్నది ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది.