నాలుగేళ్ల క్రితం అమెరికన్లు ఎలాంటి పొలిటికల్ సినిమా చూశారో మళ్లీ అదే సినిమా ఇంకోసారి చూడబోతున్నారు. పాత్రలు, పాత్రధారులు అందరూ పాతవారే. లీడ్ రోల్స్ పోషించేది కూడా ఆ ఇద్దరు వ్యక్తులే. అయితే పార్ట్ వన్ లో హీరోగా నిలిచిన వ్యక్తే మళ్లీ పార్ట్ 2లో కూడా హీరోగా మారతారా లేక పాత్రలు తారుమారవుతాయా అన్నదే ఆసక్తి కలిగించే అంశం. వచ్చే ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించగానే చర్చ మొత్తం బైడెన్ వర్సెస్ ట్రంప్ వైపు మారిపోయింది. వీళ్లిద్దరూ మళ్లీ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలబడతారని.. వీరిలో ఒకరిని మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికోవాల్సి వస్తుందని సగటు అమెరికన్లు ఊహించలేదు. ఎందుకంటే వివిధ సంస్థలు నిర్వహిస్తున్న సర్వేల్లో బైడెన్, ట్రంప్ అప్రూవల్ రేట్ ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. రీ ఎలక్షన్‌పై వాళ్లిద్దరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నా పరిస్థితులు సానుకూలంగా కనిపించడం లేదు.
80 వర్సెస్ 76.. తలపండిన నేతల తలరాత ఎలా ఉండబోతోంది ?
వాళ్లిద్దరూ పైకి వృద్ధనేతల్లా కనిపిస్తారు గానీ… అమెరికాలో యంగ్ అండ్ డైనమిక్ అని ఎవరి గురించైనా చెప్పుకోవాలంటే బైడెన్ అండ్ ట్రంప్ గురించే ప్రస్తావించాలి. ప్రస్తుత అధ్యక్షుడు డెమొక్రటిక్ పార్టీ నేత జో బైడెన్ వయసు 80 సంవత్సరాలు. ఇప్పటికే ఆయన ఎక్కువ వయస్సున్న అధ్యక్షుడిగా అమెరికా చరిత్రలో నిలిచిపోయారు. ఒకవేళ బైడెన్ రెండోసారి కూడా గెలిస్తే ఆయన పదవి పూర్తయ్యే సరికి బైడెన్ 86 ఏళ్లకు చేరుకుంటారు. శ్వేతసౌధం చరిత్రలోనే ఇది మరో రికార్డుగా మారుతుంది. ఇక గత ఎన్నికల్లో బైడెన్ చేతిలో ఓడిపోయిన మాజీ అధ్యక్షుడు ట్రంప్ వయస్సు 76. కేవలం బైడెన్ కంటే నాలుగేళ్లు మాత్రమే చిన్న. ఇద్దరూ అమెరికా రాజకీయాల్లో తలపండిన నేతలే. బైడెన్ డెమొక్రటిక్ పార్టీ రాజకీయాల్లో ఆరితేరితే బిజినెస్ మ్యాన్ నుంచి పొలిటీషియన్ గా మారిన ట్రంప్ మరోసారి వైట్‌హౌస్‌పై కన్నేశారు. తాను చేయాల్సింది ఇంకా ఉంది.. అది కూడా పూర్తి చేస్తానంటూ జోబైడెన్ అధ్యక్ష రేసులో ఉన్నట్టు ప్రకటించారు.
వయసు తెస్తున్న తంటా
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుతం జో బైడెన్ వయసు కూడా చర్చనీయాంశంగా మారింది. ఆ వయసులో ఆయన అధికారిక విధులు నిర్వహించగలరా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ట్రంప్ తరపున ప్రచారం చేస్తున్న రిపబ్లికన్ పార్టీ నేతలు బైడెన్ వయసు కష్టాలను ఏకరవుపెడుతున్నారు. ఆయన సరిగా నడవలేకపోతున్నారని…మాటల్లో తేడా ఉందని…ఆయనకు ఏదీ సరిగా గుర్తుండటం లేదని ఇలాంటి వయసు మళ్లిన వ్యక్తిని మరోసారి అధ్యక్షుడిగా చేస్తే అమెరికా మూల్యం చెల్లించుకుంటుందంటూ ట్రంప్ టీమ్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. మాట, నడతలో బైడెన్ బ్యాలెన్స్ తప్పిన వీడియోలను ట్రంప్ క్యాంపెయిన్ టీమ్ విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చింది.
ఆ ఇద్దరి గురించి జనం ఏమనుకుంటున్నారు ?
వయసు మీద పడినా…చేతులు వణుకుతున్నా బైడెన్, ట్రంప్ మళ్లీ అధ్యక్ష ఎన్నికల్లో నిలిచారు. డెమొక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ నుంచి అధికారిక నామినీలుగా వీళ్లే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే వీళ్లిద్దరూ ఎంత ఉత్సాహం చూపించినా మరోసారి వీళ్లను శ్వేతసౌధంలో చూసేందుకు మాత్రం సగటు అమెరికన్లు సిద్ధంగా లేరు. వాళ్లిద్దరిలో ఒకరిని మరోసారి భరించాలా అన్న అభిప్రాయంలో చాలా మంది అమెరికన్లు ఉన్నారు. NBC NEWS నిర్వహించిన సర్వేలో బైడెన్ మరోసారి పోటీ చేయకుండా ఉండే మంచిదని 70శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. ట్రంప్‌ను వద్దనుకునే అమెరికా ప్రజల శాతం 60 వరకు ఉంది. ఒపీనియన్ పోల్ సర్వేలు ఎలా ఉన్నా చివరకు ఆ రెండు పార్టీలు నిర్వహించే ప్రైమర్లీ గెలిచి చివరకు నామినేట్ అయ్యేవాళ్లే అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తారు. ప్రస్తుతానికి ఇటు బైడెన్‌కు గానీ, అటు ట్రంప్‌కు గానీ పెద్దగా ప్రత్యర్థులు లేరు. దాదాపుగా చివరి వరకు వీరిద్దరే బరిలో నిలిచే అవకాశాలున్నాయి.
బైడెన్ తనను తాను నిరూపించుకోవాలి
మళ్లీ అధ్యక్ష రేసులో ఎందుకు నిలిచారు అని బైడెన్‌ను ఎవరైనా ప్రశ్నిస్తే ఆయన చెప్పే సమాధానాలు ఒకటి తాను పూర్తి చేయాల్సిన మిషన్ ఇంకా ఉంది. రెండు ప్రస్తుతం అమెరికా రాజకీయాల్లో ట్రంప్ విధానాలను గట్టిగా ఎదురించగల ఏకైక వ్యక్తిని తానే అని ఆయన భావించడం. డెమొక్రటిక్ పార్టీ కూడా ఇంచుమించు అదే అభిప్రాయంతో ఉంది. అందుకే బైడెన్ వయస్సును పరిగణలోకి తీసుకోకుండా ఆయనకు అండగా నిలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
బైడెన్‌కు ఈసారి క్యాట్ వాక్ కాదు
అమెరికాలో పరిస్థితులు మారిపోయాయి. ప్రపంచమంతా కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో బైడెన్ ట్రంప్‌తో ఢీకొట్టి విజయం సాధించారు. అప్పటికే ట్రంప్ లోపభూయిష్ట విధానాలతో అమెరికన్ ప్రజలు విసిగిపోయి ఉన్నారు. చివరకు రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు కూడా ట్రంప్‌ను వ్యతిరేకించి బైడన్‌కు ఓటు వేశారు. మరో ఏడాదిలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సమయంలో బైడెన్ గతం కంటే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అందులో మొదటిది ఆయన వయస్సు. 80 ఏళ్ల వయసులో బైడెన్ సమర్థంగా దేశాన్ని నడిపించలేరని అమెరికన్ ఓటర్లు భావిస్తే ఆయన శ్వేతసౌధంలో రెండోసారి అడుగుపెట్టే అవకాశాన్ని కోల్పోతారు. ద్రవ్యోల్బణం రూపంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా బైడెన్‌కు పెద్ద సవాల్‌నే విసురుతోంది. ద్రవ్యోల్బణం 40ఏళ్ల గరిష్టానికి చేరుకోవడం బైడెన్ తో పాటు డెమొక్రటిక్ పార్టీని కలవరపెడుతుంది. కోవిడ్ తర్వాత పరిస్థితులు మెరుగుపడ్డా మాక్రో ఎకనమిక్స్ డేటా ఏమాత్రం సంతృప్తికరంగా లేదు. అన్నింటి కంటే ముఖ్యమైంది మరోసారి మాంద్యం ముంచుకొస్తుందేమోనన్న భయం. రోజు వారీ ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు కూడా బైడెన్‌కు నిద్రపట్టనివ్వడం లేదు. ఆఫ్ఘనిస్తాన్‌లో యుద్ధానికి ముగింపు పలికినా… బలగాలు వెనక్కి రప్పించిన తీరు విమర్శలపాలైంది. ఇక అమెరికాను నిత్యం వెంటాడే సమస్య గన్ కల్చర్ , ఇమిగ్రేషన్. అమెరికా తుపాకుల రాజ్యంగా ఎప్పుడో మారిపోయింది. బైడెన్ హయాంలో కూడా విచ్చలవిడిగా తుపాకుల వాడకం పెరిగిపోయింది. మెక్సికో సహా వివిధ దేశాల నుంచి వచ్చే అక్రమ వలసలను బైడెన్ నియంత్రించలేకపోయారు.
అమెరికన్లు ట్రంప్‌ను కోరుకుంటున్నారా ?
అమెరికా రాజకీయాల్లో మోస్ట్ కాంట్రవర్షియల్ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే అది ట్రంప్ మాత్రమే. ఆయనవి విధ్వంసకర రాజకీయ విధానాలు. అధికారంలో ఉండగా సొంత పార్టీ నేతలతో కూడా చీవాట్లు తిన్న వ్యక్తి. అభిశంసనతో పాటు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటూ పరువు పోగొట్టుకున్నారు. అయితే ఆర్థిక మూలాలు బలంగా ఉండటంతో రిపబ్లికన్ పార్టీకి ఆయన అవసరం చాలా ఉంది. అందుకే ఆయన మరోసారి బరిలో నిలవగలిగారు.
2024 బోరింగ్ ఎలక్షన్స్
అమెరికాలో అధ్యక్ష ఎన్నిక ప్రకృతి సుధీర్ఘంగా సాగుతుంది. ఏడాది ముందు నుంచే కసరత్తు మొదలవుతుంది. ఈసారి అధ్యక్ష ఎన్నికలపై అమెరికన్లు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. కారణం మళ్లీ వాళ్లిద్దరే. బైడెన్, ట్రంప్ మళ్లీ పోటీచేస్తుండటంతో వాళ్ల పాలనా విధానాలను ఇప్పటికే చూసిన సగటు అమెరికన్లు… వీళ్లిద్దరికీ ప్రత్యామ్నాయం ఎవరైనా ఉంటే బాగుండని భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం, మాంద్యం పరిస్థితుల్లో కొత్త తరానికి అవకాశం రావాలని కోరుకుంటున్నారు.