ఎగువ నుంచి వస్తున్న వరదలతో ప్రకాశం బ్యారేజ్ కు భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం 70 గేట్లు ఎత్తున అధికారులు ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. ఇక లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు పెరగడంతో అధికారులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో ,ఔట్ ఫ్లో 11 లక్షల 45 వేల 351 క్యూసెక్కలు ఉందని అధికారులు వెల్లడించారు. ఇక విజయవాడకు కేంద్రం నుంచి ప్రత్యేకంగా 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి.
3 తమిళనాడు, 4 పంజాబ్, 3 ఒడిశా రాష్ట్రల నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించారు. ఇదిలా ఉంచితే ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. నాలుగు రోజుల నుంచి వస్తున్న భారీ వరదతో బ్యారేజ్ ప్రమాదపు అంచులలో ఉందని తెలుస్తోంది. వరద తాకిడికి మూడు గేట్లు విరిగిపోయి వరదలో కొట్టుకుపోయాయి. వీటిని పరిశీలించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రకాశం బ్యారేజీని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మూడు గేట్లు పూర్తిగా పనికిరాకుండా పోయాయన్నారు.
ప్రకాశం బ్యారేజీ 70 సంవత్సరాలు అయింది కాబట్టి.. వరదని తట్టుకునే పరిస్థితి లేదనిపిస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. కొత్త బ్యారేజ్ కట్టాల్సిన అవసరం ఉందన్నారు సుజనా. సాంకేతికంగా బ్యారేజ్ పానికివస్తోందా లేదా అనేది సిఎం మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్న ఆయన నా అభిప్రాయం అయితే కొత్త బ్యారేజ్ నిర్మాణం చేయాలి అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ కు వస్తున్న వరదను పూర్తిగా కిందకు వదిలేస్తున్నారు అధికారులు. ఇప్పుడు బ్యారేజ్ గేట్లు విరగడంతో వరద తగ్గిన తర్వాత పరిస్థితి ఏంటీ అనే ఆందోళన అధికారులలో మొదలయింది.
ఇటీవల తుంగభద్ర గేటు వరదల దెబ్బకు ఇరిగిపోయిన సంగతి తెలిసిందే. వారం రోజుల పాటు శ్రమించిన అధికారులు స్టాప్ లాగ్ ఏర్పాటు చేసారు. ఇప్పుడు స్టాప్ లాగ్ ఏర్పాటు చేయడానికి కూడా సాధ్యమయ్యే అవకాశం కనపడటం లేదు. వరద తగ్గితే మినహా అధికారులు చర్యలు తీసుకోవడానికి సాధ్యమయ్యేలా కనపడటం లేదు.