నిన్నటివరకు మార్స్‌లో ఉన్న తెలంగాణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు..కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఆగమేఘాల మీద భూమీపై పడ్డారు. ఏదో అనుకుంటే మరేదో అయ్యిందన్న ఫీలింగ్ వాళ్ల కళ్లలో క్లియర్ కట్‌గా కనిపిస్తుంది. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం సంగతి అటు ఉంచితే కనీసం ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినని సీట్లు కూడా రాకపోవడంతో తెలంగాణ కమలనాథులకు ఫ్యూజులౌట్ అయ్యాయి. అక్కడ కనీసం 90సీట్లు వచ్చినా.. ఎడ్జ్‌లో ఓడిపోయామని బిల్డప్‌లు ఇచ్చుకుంటూ కేసీఆర్‌కు కౌంటర్‌లు వేసుకుంటూ ఎన్నికలకు సిద్ధమయ్యేవాళ్లు. మరో కొద్దీ నెలల్లోనే తెలంగాణ గడ్డపై ఎన్నికలు జరగనుండగా.. కర్ణాటక అసెంబ్లీ రిజల్ట్స్ ఇక్కడ బీజేపీ నేతల మూడ్‌ని పాడుచేసింది.
ఇక మీరేం గెలుస్తారులే:
కర్ణాటక ఎన్నికల తర్వాత దేశం చూపు తెలంగాణవైపే ఉంది. సౌతిండియాలో కర్ణాటక తర్వాత బీజేపీ ఎక్కువగా ఫోకస్ చేస్తున్న రాష్ట్రం తెలంగాణనే కావడంతో పాటు కేంద్రంలో మోదీని గద్దె దింపడమే లక్ష్యంగా కేసీఆర్ కంకణం కట్టుకొని ఉండడంతో అందరిచూపు ఇక్కడి రాజకీయాలపైనే ఉన్నాయి. అయితే కర్ణాటక ఎన్నికల్లో అధికార పీఠాన్ని బీజేపీ కోల్పోవడం తెలంగాణ కాషాయ నేతలకు మింగుడుపడడం లేదు. అక్కడ గెలిచి ఉంటే ర్యాలీల్లో, ఎన్నికల ప్రచారాల్లో ఈ విషయాన్ని పదేపదే ప్రస్తావించి కేసీఆర్ కాన్ఫిడెన్స్‌ని దెబ్బతీసే అవకాశముండేది. గతంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటింది. 2019లో నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకుంది. అటు కేంద్రంలో కిషన్‌రెడ్డికి మంచి పొజిషన్ ఇచ్చారు. ఇలా అన్నీ తమకు అనుకులంగా ఉన్నాయని.. అంతా హ్యాపీనేనని.. ఈ ఏడాది ఎన్నికల్లో తమదే విజయమని తెలంగాణ బీజేపీ భావిస్తుండగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఆ పార్టీలో జోష్‌ని తగ్గించాయి.
బీజేపీకి కష్టమే కావొచ్చు:
ప్రజల్లో కేసీఆర్‌కు తీవ్ర వ్యతిరేకత ఉందని.. ఓటర్లంతా బీజేపీవైపే ఉన్నారని తెలంగాణ బీజేపీ విస్త్రతంగా ప్రచారం చేస్తోంది. నిజానికి గతంతో పోల్చితే కేసీఆర్ గ్రాఫ్ పడిపోయిందని అటు విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్‌కు ఇప్పటికీ రూరల్ ఏరియాస్‌పై పట్టు ఉంది. ఇటు బీజేపీకి మాత్రం ఎన్నికల్లో పోటీ చేసేందుకు అసలు 60అభ్యర్థులైనా ఉన్నారా అంటే.. కమలనాథుల నుంచి ఎలాంటి సమాధానమూ రాని దుస్థితి! ఇలాంటి పరిస్థితిలో ఉన్న బీజేపీ.. తెలంగాణలో గెలుస్తామని చెప్పడం విడ్డూరంగా ఉంది. ముస్లింలను చూపించి జీహెచ్‌ఎంసీ ప్రాంతాల్లో ఓట్లు తెచ్చుకోవచ్చు కానీ.. రాష్ట్రాంలోని మిగిలిన ప్రాంతాల్లో ఎవరిని చూపించి ఓట్లు అడుగుతారు? ప్రజల కోసం బీజేపీ పోరాడింది ఏముంది?
కేసీఆర్ వర్సెస్ కాంగ్రెసేనా?
నిజానికి తెలంగాణలో మొదటి నుంచి కాంగ్రెస్ వర్సెస్ కేసీఆర్ మధ్య పోటినే ఉండేది. అయితే కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా లేకుండా చేసేలా కేసీఆర్ ఆ పార్టీ నేతలను తమ పార్టీలోకి తెచ్చుకోవడం, అంతర్గత కుమ్ములాటలు, రేవంత్ రెడ్డి వర్సెస్ ఇతర సీనియర్ల వివాదాలతో కాంగ్రెస్ డౌన్ ఫాల్ ప్రారంభమైంది. అదే సమయంలో బీజేపీ పుంజుకుంది. దుబ్బాక బైఎలక్షన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ సత్తా చాటడంతో బీఆర్‌ఎస్‌కు పోటి తామేనని కమలనాథులు ప్రచారం చేసుకున్నారు. అయితే బీజేపీకి అంత సీన్ లేదని.. కర్ణాటకలో కాంగ్రెస్ ఎలా అయితే కమ్ బ్యాక్ ఇచ్చిందో తెలంగాణలో కూడా అదే రేంజ్‌లో దూసుకొస్తుందని.. రానున్న ఎన్నికల్లో పోటీ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.