Chandrababu Naidu: స్కిల్‌ స్కాం కేసులో కొత్త ట్విస్ట్‌.. చంద్రబాబు చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోందా..?

చంద్రబాబు మీద కేసుల పరంపర ఇంకెన్నాళ్లు అనే అనుమానాలు వినిపిస్తున్న వేళ.. స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ హయాంలో స్కిల్ ప్రాజెక్ట్‌లో పాలు పంచుకున్న 12 మంది ఐఏఎస్ అధికారులను విచారించాలని ఏపీ సీఐడీకి ఫిర్యాదు అందింది.

  • Written By:
  • Publish Date - November 2, 2023 / 08:06 PM IST

Chandrababu Naidu: తెలుగు రాష్ట్రాల్లో స్కిల్‌ స్కామ్‌ వ్యవహారం రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పేరుతో టీడీపీ హయాంలో చంద్రబాబు కుంభకోణానికి పాల్పడ్డారని కేసు నమోదు చేసిన సీఐడీ.. ఆయనను అదుపులోకి తీసుకుంది. 50 రోజులకు పైగా రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉంచింది. ఈ మధ్యే మధ్యంతర బెయిల్ మీద చంద్రబాబు బయటకు వచ్చారు. ఆయన బయటకు వచ్చినా.. కేసులు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయ్. కొత్తగా ఇసుక వ్యవహారంలో కేసు నమోదు చేసింది సీఐడీ.

దీంతో చంద్రబాబు మీద కేసుల పరంపర ఇంకెన్నాళ్లు అనే అనుమానాలు వినిపిస్తున్న వేళ.. స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ హయాంలో స్కిల్ ప్రాజెక్ట్‌లో పాలు పంచుకున్న 12 మంది ఐఏఎస్ అధికారులను విచారించాలని ఏపీ సీఐడీకి ఫిర్యాదు అందింది. అప్పటి ఐఏఎస్ అధికారులు అజేయ కల్లాం, అజయ్ జైన్‌తో పాటు సీమెన్స్ ప్రాజెక్ట్ అమలు, పర్యవేక్షణ కమిటీలోని అధికారులను విచారణ పరిధిలోకి తీసుకురావాలని ఫిర్యాదుదారు కోరారు. అప్పటి సీఎండీ బంగారు రాజాతో పాటు కార్పొరేషన్‌లోనీ సీఈవో, సీఎఫ్‌వో, ఈడీలను కూడా విచారించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా వున్న అజయ్ రెడ్డిపైనా ఫిర్యాదు చేశారు.

దీంతో ఇప్పుడీ వ్యవహారం ఏ మలుపు తీసుకోబోతుందా అనే చర్చ జరుగుతోంది. మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చిన చంద్రబాబు.. ఆసుపత్రిలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయ్. ఇలాంటి పరిణామాల మధ్య.. స్కిల్ కేసులో మరింత మందిని విచారణకు పిలిచేందుకు సీఐడీ సిద్ధం అవుతుండడం.. దానికోసం వేగంగా పావులు కదులుతుండడం.. కొత్త చర్చకు దారి తీస్తోంది.