Priyanka Gandhi: కాంగ్రెస్ ప్రచార బాధ్యతలు ప్రియాంకా చేతికి? రెండు రాష్ట్రాల్లో విజయంతో పెరిగిన గ్రాఫ్

ఎన్నికల వ్యవహారాలతోపాటు, స్టార్ క్యాంపెయినర్‌గా మారుతున్నారు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రచార సారథిగా ఉంటూ, పార్టీని విజయపథంలో నడిపించారు. దీంతో ప్రియాంకా గాంధీ ఇమేజ్ పెరిగింది.

  • Written By:
  • Publish Date - June 8, 2023 / 11:57 AM IST

Priyanka Gandhi: కాంగ్రెస్ పార్టీలో స్టార్ క్యాంపెయినర్ అనగానే అందరికీ ఠక్కున గుర్తొచ్చేది సోనియా గాంధీ, రాహుల్ గాంధీనే. ఇప్పుడు వయసు రీత్యా పార్టీ కార్యక్రమాలకు సోనియా దూరంగా ఉంటున్నారు. రాహుల్ గాంధీ యాక్టివ్‌గా ఉంటున్నారు. అయితే, కీలక బాధ్యతల్ని ప్రియాంకా గాంధీ చూసుకుంటున్నారు. ముఖ్యంగా ఎన్నికల వ్యవహారాలతోపాటు, స్టార్ క్యాంపెయినర్‌గా మారుతున్నారు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రచార సారథిగా ఉంటూ, పార్టీని విజయపథంలో నడిపించారు. దీంతో ప్రియాంకా గాంధీ ఇమేజ్ పెరిగింది. ఈ నేపథ్యంలో పార్టీ ప్రచార బాధ్యతల్ని ప్రియాంక చేతికి అప్పగించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ప్రియాంక.. పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా ఉంటారు. ఈ ఏడాది మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి పార్టీ ప్రచారకర్తగా ప్రియాంక వ్యవహరించనున్నారు.
కాంగ్రెస్ పార్టీ మహిళలకు దగ్గరయ్యేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా మహిళలకు కనీసం రూ.1,500 ఇచ్చేలా పథకాన్ని రూపొందించబోతుంది. ఇలాంటి పథకాల ద్వారా మహిళల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది ప్రియాంక. గత ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో మహిళా సంవాద్ అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించింది. మహిళలకు ఉచిత సిలిండర్లు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వంటి కార్యక్రమాల్ని కూడా అమలు చేయబోతుంది. మహిళా ఓటర్లని ఆకట్టుకునే పథకాలతోపాటు ప్రియాంకను ప్రచారానికి దింపితే ప్రయోజనం ఉంటుందని ఆ పార్టీ భావిస్తోంది. దీనిలో భాగంగా మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణలో ప్రియాంకతో విస్తృతంగా ప్రచారం నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది కాంగ్రెస్. మహిళలకు వీలున్నన్ని ఎక్కువ సీట్లు ఇవ్వాలని కూడా కాంగ్రెస్ నిర్ణయించింది. రాహుల్ గాంధీని పార్లమెంట్ సభ్యుడిగా అనర్హుడిగా ప్రకటించిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రియాంకతోనే ప్రచారం చేయించడమే మంచిదని ఆ పార్టీ అభిప్రాయం.
ప్రజాకర్షక నేతగా
ఇటీవలి కాలంలో ప్రియాంకా గాంధీ ప్రజాకర్షక నేతగా మారుతున్నారు. ప్రచార సభలలో ఆమె వ్యవహరించే తీరు, ఉపన్యాసాలకు మంచి స్పందన వస్తోందని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. ఆమె సొంత ఇమేజ్ కోసం కాకుండా.. పార్టీ కోసమే పని చేస్తున్నారు. కాంగ్రెస్‌కు కొంతకాలంగా దూరమైన వర్గాల విషయంలో ప్రత్యేకంగా అధ్యయనం చేస్తున్నారు. వారిని ఆకట్టుకునేందుకు ప్రత్యేక పథకాలు రూపొందిస్తున్నారు. అలసట లేకుండా ఎక్కువ కాలం ప్రచారం చేయగల సత్తా ఆమె సొంతం. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో ప్రియాంకతో భారీ రోడ్ షోలు, సభలకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో ప్రియాంక పర్యటిస్తారు.