బీహార్‌లో రాజకీయం, రౌడీయిజం అవిభక్త కవలలు. ఒకటి లేకుండా మరోటి ఉండలేవు. వారి ప్రయోజనాలే వారికి ముఖ్యం. అందుకోసం ఎంతకైనా దిగజారిపోతారు. తాజాగా ఆనంద్‌మోహన్ అనే నేరస్తుడ్ని జైలు నుంచి బయటకు తీసుకొచ్చేందుకు నితీశ్ ప్రభుత్వం తెగ ఆరాటపడిపోతోంది. అలాగని ఆనంద్‌మోహన్ ఓ మామూలు గూండా అని అనుకోకండి. ఓ జిల్లా కలెక్టర్‌ను పట్టపగలు నడిరోడ్డుపై నరికిచంపిన రాక్షసుడు. ఆ చనిపోయిన కలెక్టర్ మన తెలుగోడే. 1994లో బీహార్ పీపుల్స్ పార్టీ నేత, గ్యాంగ్‌స్టర్ చోటాశుక్లా పోలీస్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. అతడి అంత్యక్రియల సమయంలో పెద్దఎత్తున అల్లర్లు చోటుచేసుకున్నాయి.
ఆ సమయంలో గోపాల్‌గంజ్ కలెక్టర్‌గా తెలుగు దళిత ఐఏఎస్ జి.కృష్ణయ్య ఉన్నారు. కారులో వెళుతున్న ఆయన్ను అందరూ చూస్తుండగానే బయటకు లాగి రాళ్లతో కొట్టి కత్తితో నరికి చంపాడు ఆనంద్‌మోహన్. ఈ కేసుతో పాటు పలు కేసుల్లో అతడు నిందితుడు. ఈకేసులో కోర్టు అతడికి మరణశిక్ష విధించింది. తర్వాత దాన్ని యావజ్జీవ కారాగారశిక్షగా మార్చారు. ఆనంద్‌మోహన్ జైల్లో ఉన్నా అక్కడ్నుంచే వ్యవహారాలను చక్కబెట్టాడు. రాజకీయాన్ని నడిపాడు. జైలు నుంచే ఎంపీగా పోటీ చేసి మరీ గెలిచాడు. అయితే మరణశిక్ష పడటంతో పోటీకి దూరమయ్యాడు. స్వతంత్ర భారతంలో మరణశిక్ష పడ్డ తొలి రాజకీయ నేత ఇతనే. తన భార్యను ఎన్నికల బరిలోకి దింపాడు. ఇప్పుడు అతడి భార్య, కొడుకు ఇద్దరూ ఎమ్మెల్యేలే.. ఇతడిని జైలు నుంచి బయటకు తీసుకురావాలన్నది నితీశ్ కుమార్ ప్రయత్నం..
నితీశ్ కుమార్‌కు ఎందుకంత ప్రేమ.?
ఆనంద్‌మోహన్ తోమర్ రాజ్‌పుట్ వర్గానికి చెందినవాడు. ఆ వర్గంలో ఇప్పటికీ పలుకుబడి కలిగినవాడు. యువతలో రాబిన్‌హుడ్ ఇమేజ్ ఇప్పటికీ ఉంది. జైలు నుంచే తన నేర సామ్రాజ్యాన్ని నడుపుతున్నవాడు. ఈ ఏడాది జనవరిలో జేడీయూ రాజ్‌పుట్ సమ్మేళనాన్ని నిర్వహించింది. ఆ సమయంలో ఆనంద్‌మోహన్‌ను విడుదల చేయాలని నినాదాలు చేశారు అతడి అభిమానులు. దీనిపై స్పందించిన నితీశ్…. మీరు ఆందోళన చెందకండి… నేను చేయాల్సింది చేస్తున్నా అంటూ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఆనంద్‌మోహన్ కొడుకు పెళ్లి వేడుకల కోసం పెరోల్‌పై ఉన్నాడు. అంతకుముందు కూతురి పెళ్లంటూ బయటకొచ్చాడు. ఆనంద్‌మోహన్‌ను జేడీయూ అధ్యక్షుడు కౌగిలించుకుని స్వీట్ తినిపిస్తున్న ఫోటో వైరల్ కూడా అయ్యింది. నిజానికి ఏ ప్రభుత్వ అధికారిని హత్య చేసినా పెరోల్ లభించకూడదు. అయితే కేవలం ఆనంద్‌ను బయటకు తీసుకురావడానికి ఏకంగా చట్టాన్నే సవరించింది నితీశ్ సర్కార్. నిజానికి 2021లో ఆనంద్‌మోహన్ శిక్ష రద్దు చేయాలన్న పిటిషన్‌ను నితీశ్ తోసిపుచ్చారు. ఎందుకంటే అప్పుడు బీజేపీ మిత్రపక్షం. కానీ ఇప్పుడు ఆర్జేడీతో కాపురం చేస్తున్నారు నితీశ్. ఆనంద్‌మోహన్ భార్య, కొడుకు ఇద్దరూ ఆర్జేడీ ఎమ్మెల్యేలే… ఆ మిత్రబంధం కోసం రౌడీషీటర్‌ను బయటకు తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు నితీశ్.
కులాల లెక్కలేంటి.?
బీజేపీతో ఉన్నంతకాలం నితీశ్ హిందుత్వాన్ని అడ్డుపెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఆ ముసుగు తొలగిపోయింది. ఓ వైపు రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోంది. మరోవైపు తన సొంత సామాజికవర్గం( కురిమి/కోరిస్-ఓబీసీ)లో కూడా నితీశ్ ప్రాబల్యం తగ్గుతోంది. బీహార్‌లో వీరి జనాభా కేవలం ఐదుశాతమే. కానీ ఇప్పుడు వారిలో కూడా మార్పు వచ్చింది. మంచి విద్య, ఆర్థికంగా కాస్త బలపడ్డారు. ఆ కమ్యూనిటీలో కొంతశాతం ఇప్పుడు బీజేపీ వైపు చూస్తోంది. నితీశ్‌కు ఒకప్పుడు నమ్మకమైన మిత్రుడు ఉపేంద్ర కుశ్వాహా పార్టీని వీడి సొంత కుంపటి పెట్టుకున్నారు. ఇది నితీశ్‌కు చావుదెబ్బలాంటిదే. ఇక బీహార్‌లో బలమైన యాదవ, ముస్లిం వర్గాలు ఆర్జేడీకి మద్దతుగా నిలుస్తున్నాయి. నితీష్‌ను దించేసి తేజస్విని సీఎం సీటులో కూర్చోబెట్టాలని భావిస్తున్న ఆ వర్గాల సపోర్ట్ నితీశ్‌కు ఉంటుందని అనుకోవడానికి వీల్లేదు. ఇక ముస్లింలు 2020లో నితీశ్‌కు ఎంత నష్టాన్ని చేసారో ఆయనకు గుర్తుంది.
అగ్రవర్ణాలపై ఆశ
బీహార్‌లో అగ్రవర్ణాలు 12శాతం ఉన్నాయి. అందులో రాజ్‌పుట్‌ల వాటా 4శాతం. ఇప్పుడు ఆనంద్ మోహన్‌ను విడుదల చేయడం ద్వారా తాను వారివైపు ఉన్నానన్న సంకేతాన్ని ఇవ్వదలచుకున్నారు నితీశ్. 2014తర్వాత బీహార్‌లో అగ్రవర్ణాలు బీజేపీ వైపు చూస్తున్నాయి. అందుకే వారిని ఆకట్టుకుని తనవైపు తిప్పుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు నితీశ్. పైగా ఆనంద్ మోహన్‌కు మిథిలాంచల్ ప్రాంతంలో గట్టి పట్టుంది. అతడికి రాబిన్ హుడ్ ఇమేజ్ కూడా ఉంది. అది కూడా తనకు కలసి వస్తుందన్నది నితీశ్ ఆశ.
అస్థిత్వం, విశ్వసనీయత కోసం పోరాటం చేస్తున్నారు నితీశ్. ఆయన ముందు ప్రస్తుతం రెండు ఛాలెంజ్‌లు ఉన్నాయి. ఒకటి 2024 ఎన్నికల్లో మోడీకి తానే ప్రత్యామ్నాయం అని చెప్పుకోవడం.. రెండు 2025 బీహార్ ఎన్నికల్లో మరోసారి గెలవడం. ఈ రెండు సందర్భాల్లోనూ బీజేపీనే ఆయనకు ప్రత్యర్థి. అందుకే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగమే ఆనంద్ మోహన్ విడుదల ప్రయత్నం. చూడాలి మరి నితీశ్ కులాల లెక్కలు ఎంత మేర ఫలిస్తాయో..!