Top story: బాప్ రే బిట్ కాయిన్, నన్ను ఆపేదెవడ్రా…!

ఏందిరా నాయనా.... ఆ జోరేంది... ఆ దూకుడేంది...! ఇన్నాళ్లు మన్ను తిన్న పాములా పడి ఉన్న ఆ బిట్ కాయిన్ ఇప్పుడిలా రెచ్చిపోతోందేటిరా బాబూ...! ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న బిట్ కాయిన్ ట్రంప్ పుణ్యమా అని తెగ రెచ్చిపోతోంది.

  • Written By:
  • Publish Date - November 13, 2024 / 04:22 PM IST

ఏందిరా నాయనా…. ఆ జోరేంది… ఆ దూకుడేంది…! ఇన్నాళ్లు మన్ను తిన్న పాములా పడి ఉన్న ఆ బిట్ కాయిన్ ఇప్పుడిలా రెచ్చిపోతోందేటిరా బాబూ…! ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న బిట్ కాయిన్ ట్రంప్ పుణ్యమా అని తెగ రెచ్చిపోతోంది. ఒక్క బిట్ కాయిన్ ఖరీదు ఇప్పుడు 90వేల డాలర్లు… ఈ ఇయర్ ఎండ్ కు ఏకంగా లక్ష టార్గెట్ అంటోంది,

నవంబర్ 5న ఒక బిట్ కాయిన్ ధర 67వేల 813 డాలర్లు…. ఇప్పుడు బిట్ కాయిన్ ధర ఎంతో తెలుసా… 88 వేల డాలర్లు… అంటే వారం రోజుల్లో ఎంత పెరిగిందో తెలుసా.. 20వేల డాలర్లు అంటే మన కరెన్సీలో చెప్పాలంటే సుమారు 17లక్షలు పెరిగింది. బిట్ కాయిన్ ఏ రేంజ్ లో కాలరెగరేస్తోందో చెప్పడానికి ఇదే కారణం. గత ఏడాది ఇదే రోజుకు ఇప్పటికి తేడా చూస్తే ఎంతో తెలుసా ఏకంగా 51వేల డాలర్లు పెరిగింది. మన కరెన్సీలో చెప్పాలంటే 43లక్షల రూపాయలకు పైనే… ఏడాది కాలంలో రెండున్నర రెట్లకు పైగా పెరిగింది బిట్ కాయిన్ వాల్యూ…

ఒక బిట్ కాయిన్ విలువ 88వేల డాలర్లు… మన కరెన్సీలో చెప్పాలంటే 75లక్షలకు పైనే అన్నమాట. అంటే మన దగ్గర రెండు బిట్ కాయిన్లుంటే మనం కోటీశ్వరులమే. ఇంత విలువ ఉన్న బిట్ కాయిన్ కు నిజానికి రూపం లేదు. అదో ఊహాజనిత ద్రవ్యం. అది వేరే స్టోరీ… ఇప్పుడు ఈ కాయిన్ ఎందుకిలా పరుగులు పెడుతోందన్నదే పెద్ద స్టోరీ. నిజానికి గత ఐదేళ్లలో బంగారం దూసుకుపోతే బిట్ కాయిన్ బేర్ మంది. కానీ ఎప్పుడైతే పెద్దన్న ట్రంప్ విజయం సాధించాడో ఇక అప్పట్నుంచే బిట్ కాయిన్ పరగందుకుంది. పందెంలోకి దిగిన పొగరుపట్టిన గుర్రంలా దూసుకుపోతోంది. అధ్యక్ష ఎన్నికల తర్వాత బిట్ కాయిన్ ఏకంగా 30శాతం పెరిగింది.

ఇంతకీ ట్రంప్ గెలుపుకు, బిట్ కాయిన్ పరుగుకు మధ్య లింకేంటి అంటే చాలానే ఉంది. బిట్ కాయిన్ కు రూపం లేదు. దాన్ని ప్రపంచదేశాలు కరెన్సీగా అంగీకరించలేదు. కానీ ట్రంప్ మాత్రం బిట్ కాయిన్ ను గుర్తించేశారు. బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీకి కేంద్రంగా అమెరికాను మార్చేస్తానని హామీ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడి అండ ఉంటే ఇక బిట్ కాయిన్ ఊరుకుంటుందా…? అంతేకాదు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు ట్రంప్ తన ప్రభుత్వంలో కీలక పదవి ఇవ్వబోతున్నారు. మస్క్ కూడా చాలాకాలంగా క్రిప్టో కరెన్సీకి అనుకూలంగా ఉన్నారు. 2021లో టెస్లా 12వేల 649 కోట్ల రూపాయలను బిట్ కాయిన్ లో పెట్టుబడులు పెట్టింది. కాబోయే అధ్యక్షుడు, ఆయన ముఖ్య అనుచరుడు ఇద్దరూ క్రిప్టో కరెన్సీకి అనుకూలంగా ఉండటంతో ఇన్వెస్టర్లు ఈ రిస్కీ కరెన్సీ వైపు మళ్లుతున్నారు. రెండ్రోజుల క్రితం బిట్ కాయిన్ ధర 90వేలు దాటేసింది. దాని దూకుడు చూస్తుంటే ఈ ఏడాది చివరకు అంటే మరో నెలన్నరలోనే ఏకంగా లక్ష డాలర్ల మార్కును టచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. అమెరికా అధికారులు కూడా దీనికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. బైడెన్ ప్రభుత్వం క్రిప్టోను ప్రోత్సహించలేదు. దీంతో ఐదేళ్లు అల్లాడిపోయిన క్రిప్టో ఇప్పుడు జూలు విదిల్చింది. ఒక్క బిట్ కాయినే కాదు మిగిలిన అన్ని క్రిప్టోలు ఇదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఎథేర్, ఎక్స్ఆర్సీ, డోజీకాయిన్, కాయిన్ బేస్. మైక్రో స్టాటర్జీ ఇలా పలు క్రిప్టోలు మంచి దూకుడు మీదున్నాయి.

ప్రస్తుతం 1.752 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువతో ప్రపంచంలోనే అతిపెద్ద ఎనిమిదో అసెట్ గా ఉంది బిట్ కాయిన్. 1.726 ట్రిలియన్ డాలర్లతో ఉన్న వెండిని అధిగమించింది. ఫ్రాన్స్ జీడీపీని కూడా ఇది మించిపోయింది. మెటా, టెస్లా, వారన్ బఫెట్ బెర్క్ షైర్ హాత్ వే విలువకన్నా బిట్ కాయిన్ విలువే ఎక్కువ, ఇక బంగారం అన్నిటికంటే ఎక్కువగా 17.6 ట్రిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉంది. రానున్న రోజుల్లో బిట్ కాయిన్ ధర మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ఇప్పుడు బిట్ కాయిన్ సరైన సైకిల్ లో ఉందని చెబుతున్నారు. మధ్యలో అప్పుడప్పుడు కాస్త తగ్గినా ఇప్పట్లో బిట్ కాయిన్ ను పట్టుకోలేమన్నది అందరి లెక్క. ఫెడ్ వడ్డీరేట్లు తగ్గించడం కూడా బిట్ కాయిన్ కు కలసి వచ్చింది.

బిట్ కాయిన్ 12 ఏళ్ల క్రితం మొదలైంది. అప్పుడు దాని విలువ ఎంతో తెలుసా…? కేవలం అరపైసా… మరిప్పుడు 80లక్షలు… ఎంత పెరిగిందో ఊహించుకోండి. క్రిప్టో కరెన్సీ అంటే ఓపెన్ సోర్స్ కంప్యూటర్ అల్గారిథమ్ ఆథారిత నెట్ వర్క్ ద్వారా నడుస్తోంది. ఒక్క క్రిప్టో కాయిన్ తయారు చేయడానికి కొన్ని లక్షల పనిగంటలు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ కరెన్సీని ఏ ప్రభుత్వమూ జారీ చేయదు. ఏ బ్యాంకూ దీన్ని కంట్రోల్ చేయదు. యాప్ ద్వారా లావాదేవీలు జరుపుకోవచ్చు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా ఇది నడుస్తుంది.

మన దేశంలో క్రిప్టో కరెన్సీని గుర్తించలేదు. కానీ మనవాళ్లు కోటిమందికి పైగా క్రిప్టోలో పెట్టుబడులు పెట్టినట్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి బిట్ కాయిన్ దూకుడు మీదుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ పేరుతో మోసాలు జరిగే అవకాశం ఉందంటున్నారు.