Top story: బూమ్‌ బూమ్‌ బిట్‌కాయిన్ ఒక్కోటి జస్ట్ లక్ష మాత్రమే..

బిట్‌కాయిన్‌ బ్లాస్ట్‌ అవుతోంది. లక్ష డాలర్ల మార్క్‌ను రేపో మాపో క్రాస్‌ చేయబోతోంది. మరి ఈ బూమ్‌ తాత్కాలికమా...? లేక ఇదే ఆరంభమా...? రానున్న ఐదేళ్లలో బిట్‌కాయిన్‌ భవిష్యత్‌ ఏంటి..? 2010లో మీరు పదివేలు పెట్టి బిట్‌కాయిన్లు కొని ఉంటే మీ దగ్గర ఇప్పుడు ఎంత ఉండేదో తెలుసా...?

  • Written By:
  • Publish Date - November 25, 2024 / 08:42 PM IST

బిట్‌కాయిన్‌ బ్లాస్ట్‌ అవుతోంది. లక్ష డాలర్ల మార్క్‌ను రేపో మాపో క్రాస్‌ చేయబోతోంది. మరి ఈ బూమ్‌ తాత్కాలికమా…? లేక ఇదే ఆరంభమా…? రానున్న ఐదేళ్లలో బిట్‌కాయిన్‌ భవిష్యత్‌ ఏంటి..? 2010లో మీరు పదివేలు పెట్టి బిట్‌కాయిన్లు కొని ఉంటే మీ దగ్గర ఇప్పుడు ఎంత ఉండేదో తెలుసా…?

బిట్‌కాయిన్ ప్రస్తుత ధర 98వేల 551 డాలర్లు… మన కరెన్సీలో చెప్పాలంటే ఒక్క బిట్‌కాయిన్‌ ధర 83లక్షల రూపాయలకు పైనే… ట్రంప్ గెలిచినప్పటి నుంచి బిట్‌కాయిన్‌ దూకుడుకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ కూడా ఎగరనంత వేగంతో బిట్‌కాయిన్‌ దూసుకుపోతోంది. అక్టోబర్‌ 26న బిట్‌కాయిన్ ధర 66వేల 863డాలర్లు. కేవలం నెల రోజుల్లో ఏకంగా 32వేల డాలర్లు పెరిగింది. మన కరెన్సీలో చెప్పాలంటే నెలరోజుల్లో సుమారు 27లక్షల రూపాయలు పెరిగిపోయింది. మరో నాలుగైదు రోజుల్లో లక్ష డాలర్లను అందుకోబోతోంది ఈ ఇమాజినరీ కరెన్సీ. ఎక్కడైనా కరెన్సీ విలువ పడిపోతే ఆర్ధికవేత్తలు పడిపోతారు. కానీ బిట్‌కాయిన్‌ స్పీడ్‌ వారిని కంగారు పెడుతోంది.

బిట్‌కాయిన్‌ ధర ఎంతవరకు చేరుతుందంటే ప్రస్తుతం ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉంది. ఇప్పటికైతే ఆకాశమే దానికి హద్దులా కనిపిస్తోంది. త్వరలోనే లక్ష డాలర్లు దాటుతుంది. ఇదే దూకుడుమీద వెళితే 2025నాటికి 2లక్షల డాలర్లకు, 2029 నాటికి 5లక్షల డాలర్లకు చేరుతుంది. ఇక 2033నాటికి 10లక్షల డాలర్లను టచ్ చేస్తుందని బెర్నస్టీన్‌ ఇన్వెస్ట్‌మెంట్ ఫర్మ్ అంచనా వేసింది. బిట్‌కాయిన్‌ ఊహాజనిత ద్రవ్యమే అయినా కొన్ని కోట్లమంది దీన్ని వినియోగిస్తున్నారు. ప్రభుత్వాలు గుర్తించకపోయినా అనధికారిక అంతర్జాతీయ కరెన్సీగా ఇది చెలామణీ అవుతోంది. బిట్‌కాయిన్‌కు ఉన్న ఎడ్వాంటేజ్‌ ఏంటంటే వాటి సంఖ్య పరిమితం. మన కరెన్సీ అచ్చు వేసినట్లు మింట్‌లో ప్రింట్‌ చేయలేం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్నది 2కోట్ల 10లక్షల బిట్‌కాయిన్లు మాత్రమే. ఇది డిజిటల్ కరెన్సీ కాకపోవడంతో కనీసం ఒక బిట్‌కాయిన్ అయినా ఉండాలన్న నిబంధనలేమీ లేదు. కొన్ని లక్షలు కోట్ల గంటలు డాటా మైనింగ్ చేస్తే కానీ ఒక బిట్‌కాయిన్ తయారుకాదు కాబట్టి ఇష్టం వచ్చినట్లు అవి పుట్టుకొస్తాయని చెప్పలేం. కొనాలన్నా, అమ్మాలన్నా, దాచుకోవాలన్నా అందులోనే జరిగిపోవాలి. జనం పెరిగినా, ఏఐ మాయ మొదలైనా, రోబోటిక్స్ వచ్చినా ఏం జరిగినా సరే బిట్‌కాయిన్లు పెరగవు. జనం దీనిపై ఎంత ఆసక్తి చూపిస్తే దాని ధర అంత పెరుగుతుందన్న మాట. ప్రస్తుతం బిట్‌కాయిన్‌ క్రేజ్‌ ఏ స్థాయిలో ఉందంటే కొనాలనుకునే వారే కానీ అమ్మేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. భవిష్యత్తులో అది మిలియన్‌ డాలర్ల స్థాయికి చేరుతుందని అంచనాలున్నప్పుడు అమ్ముకోవడానికి ఎవరూ ఇష్టపడరు కదా…!

జనవరి 20న అమెరికాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది. అది బిట్‌కాయిన్‌కు రాజమార్గమని మెజారిటీ ఇన్వెస్టర్స్‌ నమ్ముతున్నారు. ట్రంప్‌ బిట్‌కాయిన్‌కు అనుకూలంగా ఉన్నారు. ఇక మస్క్‌ సంస్థ టెస్లా ఇప్పటికే ఇందులో భారీగా పెట్టుబడులు పెట్టింది. చాలా మంది అమెరికన్ లా మేకర్స్‌ బిట్‌కాయిన్‌పై తమ వైఖరిని మార్చుకుంటున్నారు. అందుకు ఉదాహరణే బిట్‌కాయిన్ రిజర్వ్స్ రన్ చేయాలని పెన్సిల్వేనియాలో ఓ చట్టం తీసుకువచ్చేందుకు ప్రయత్నించడం. అమెరికా సెక్యూరిటీ అండ్ ఎక్స్‌చేంజ్ కమిషన్ ఛైర్మన్ గారీ గెన్‌స్లర్‌ రాజీనామా కూడా బిట్‌కాయిన్ దూకుడును పెంచేదే.. ఆయన అవలంభించిన కఠిన విధానాలు అమెరికా ఆర్థిక సంస్థలను ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు అవి స్వేచ్ఛగాబిట్‌కాయిన్ వంటి ఇన్నోవేటివ్ కరెన్సీవైపు చూసేందుకు వెసులుబాటు దొరుకుతుంది. ట్రంప్ గెలిచినప్పటి నుంచి ఇప్పటివరకు బిట్‌కాయిన్ల విలువ 84లక్షల కోట్ల రూపాయలకు పైగా పెరిగింది.

2010లో బిట్‌కాయిన్‌ ఖరీదు 0.05డాలర్లు… అప్పుడు మన కరెన్సీలో డాలర్ విలువ 45రూపాయల 73పైసలు… ఉదాహరణకు అప్పుడుమీరు 10వేలు పెట్టి బిట్‌కాయిన్‌ తీసుకొని ఉంటే మీకు సుమారు 4వేల 367 బిట్‌కాయిన్లు వచ్చేవి. మరిప్పుడు ఒక్కో బిట్‌కాయిన్‌ ధర 83లక్షల మూడు వేల వరకు ఉంది. ఆ లెక్కన ఇప్పుడు మీ దగ్గరున్న బిట్‌కాయిన్‌ విలువ ఎంతో తెలుసా అక్షరాలా 3వేల 625కోట్లు… అంటే ఎంతశాతం పెరిగింతో తెలుసా…? 36లక్షల రెట్లకు పైగా పెరిగిందన్నమాట. బిట్‌కాయిన్ ప్రస్తానాన్ని చూస్తే 2010లో ఇది అమల్లోకి వచ్చింది. ఓ వ్యక్తి 10వేల బిట్‌కాయిన్లు ఉయోగించి రెండు పిజ్జాలు కొనుగోలు చేశాడు. ఇదే బిట్‌కాయిన్‌తో మొట్టమొదటి ట్రాన్సాక్షన్. తర్వాత క్రమక్రమంగా దాని విలువ పెరిగిపోయింది. 2017లో తొలిసారి 20వేల మార్క్‌ను అందుకుంది. ఆ తర్వాత చాలా పెద్దసంస్థలు ఇందులో పెట్టుబడులకు ఆసక్తి చూపాయి. 2020లో టెస్లా, స్క్వేర్ ఇన్వెస్టింగ్ వంటి సంస్థలు పెట్టుబడులు పెట్టడంతో బిట్‌కాయిన్‌ క్రేజ్‌ చుక్కల్లోకి చేరింది. ఆ తర్వాత బైడెన్ ప్రభుత్వ నియంత్రణతో కాస్త జోరు తగ్గిందేమో కానీ ధర పెరగడం మాత్రం ఆగలేదు. 2023లో అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ బిట్‌కాయిన్‌ ఈటీఎఫ్‌లకు ఆమోదం తెలిపింది. ఇక ట్రంప్‌ గెలిచాక బ్రేకుల్లేని కారులా దూసుకుపోయింది. ఇటీవలే 98వేల డాలర్లను అందుకుని లక్షవైపు పరుగు తీస్తోంది. మన దేశంలో క్రిప్టో కరెన్సీపై స్పష్టత లేదు. దీనిపై పూర్తి బ్యాన్ ఉందన్నట్లు RBI వ్యవహరిస్తోంది. అయితే క్రిప్టో లాభాలపై 30శాతం పన్ను విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అదే విధంగా ఓ దశ దాటితే దానిపై అదనంగా 1శాతం టీడీఎస్‌ కూడా కట్ చేస్తోంది. కానీ బీ అలర్ట్‌… బిట్‌కాయిన్‌ అనేది ఓ డిజిటల్ కరెన్సీ. ఊహాజనిత ద్రవ్యం. దానిపై పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. పైగా రిస్కీ కరెన్సీ కూడా. పెరుగుతుంది అని ఊహిస్తున్నాం… ఏ మాత్రం తేడా వచ్చినా నష్టం వందల్లో, వేలల్లో ఉండదు. జీవితాలు తల్లకిందులు కావచ్చు. కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి.