AP Politics: జనసేనపై బీజేపీ రివర్స్ అటాక్..పవన్‌ కల్యాణ్‌కు సవాళ్లు తప్పవా ?

బీజేపీతో పొత్తులపై పవన్ దాదాపు క్లారిటీ ఇచ్చేశారు. కమలానికి హ్యాండ్ ఇస్తున్నామని ఆవిర్భావ వేడుకలో పరోక్షంగా చెప్పిన సేనాని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి దూరంగా ఉంటూ.. తన నిర్ణయం చెప్పేశారు.

  • Written By:
  • Publish Date - March 23, 2023 / 08:00 PM IST

టీడీపీకి దగ్గర కావడం దాదాపు ఖాయం అయింది ఇప్పుడు ! సైకిల్‌ పార్టీ, జనసేన స్నేహం ఎలా ఉండబోతుందన్నది పక్కనపెడితే.. పవన్ మీద కోట్ల ఆశలు పెట్టుకున్న బీజేపీ ఇప్పుడేం చేయబోతున్నదే అసలు మేటర్ ! 2019 ఎన్నికల తర్వాత బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయ్. పొత్తు నిజమే అయినా.. కలిసి పనిచేసింది పెద్దగా లేదు. అప్పట్లో స్థానికసంస్థల ఎన్నికలు.. ఆ తర్వాత ఒక పార్లమెంట్, రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసి ఓడిపోయింది.

ఐతే అప్పుడు కూడా జనసేన నుండి బీజేపీకి ఆశించిన మద్దతు లభించలేదు. ఈ మధ్య జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కమలం పార్టీ అభ్యర్థులకు మద్దతు విషయంలో బీజేపీ దూరంగానే ఉంది. ఉత్తరాంధ్ర స్ధానానికి జరిగిన ఎన్నికలో వైసీపీకి ఓటేయొద్దని పిలుపిచ్చిన పవన్… బీజేపీకి ఓటేయమని మాత్రం అడగలేదు. ఈ విషయం మీద బీజేపీలో పెద్ద చర్చ జరిగింది. మాధవ్‌లాంటి వాళ్లు అయితే.. అసలు రెండు పార్టీలు పొత్తులో ఉన్నాయా లేదా అనే అనుమానాలు ఉన్నాయంటూ కామెంట్ చేశారు. ఈ మాట చాలు.. రెండు పార్టీల మధ్య ఎలాంటి పరిస్థితి ఉందో చెప్పడానికి ! పవన్ మీద బీజేపీ నేతల్లో పెరుగుతున్న అసంతృప్తికి… మాధవ్ ప్రకటనే సాక్ష్యం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.

నిజానికి చాలామంది బీజేపీ నేతలకు పవన్ అంటే కోపంగా ఉంది. తమతో పొత్తులో ఉంటూనే టీడీపీతో పొత్తుగురించి మాట్లాడటాన్ని వాళ్లు డైజెస్ట్‌ చేసుకోలేకపోతున్నారు. ఐతే ఏమీ చేయలేక మౌనంగా ఉంటున్నారు. అలాంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో డిపాజిట్లు రాకపోవటంతో ఆ కోపాన్ని పవన్‌ మీద బహిరంగంగా ప్రకటిస్తున్నారు. ఐతే రాబోయే రోజుల్లో ఈ దూరం మరింత పెరిగే అవకాశాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయ్. జనసేనను ఇరుకున పెట్టే వ్యూహాలు రచించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనే చర్చ జరుగుతోంది. దీంతో పవన్ వర్సెస్ బీజేపీ వార్ ఖాయమా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్.