Fake politics: అసత్య ప్రచారాలు.. అడ్డగోలు పోస్టులు..! ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న కాషాయ దళాలు

కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలిచినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఫేక్‌ న్యూస్‌లు హల్‌చల్‌ చేస్తున్నాయి. అవి ఫేక్ అని తెలుసుకోకుండా చాలా మంది షేర్లు చేసి పడేస్తున్నారు. తీరా అది అబద్ధమని తెలిసేలోపే మరో ఫేక్ న్యూస్‌ స్ప్రెడ్ అవుతుంది.

  • Written By:
  • Publish Date - May 17, 2023 / 05:54 PM IST

నిజం గల్లీ దాటేలోపు అబద్ధం ఢిల్లీ కశ్మీర్‌ మీదుగా పాకిస్థాన్‌ పోతుందంటే ఇదేనేమో. ఫేక్‌ న్యూస్‌లు ఎక్కువయ్యే కొద్దీ ఫ్యాక్ట్‌ చెక్‌ వెబ్‌సైట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. అవి కూడా ప్రాపగండా బేస్‌ చేసుకునే నడుస్తాయి.. వాళ్లకి కావాల్సిన అబద్ధాలనే డిబంక్‌ చేస్తాయి.. అది వేరే విషయం.! కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవడం ఆ పార్టీ నేతలకు అసలు మింగుడుపడడంలేదు. ఎన్నికల్లో గెలుపొటములన్నది సహజమే.. అందులోనూ కర్ణాటకలో ఓసారి అధికారంలోకి వచ్చిన పార్టీ మరో సారి రాదన్న సంప్రదాయం ఉండేనే ఉంది. మరో ఐదేళ్లు కళ్లుమూసుకుంటే కాంగ్రెస్‌ తప్పిదాల వల్లనో..లేకపోతే కర్ణాటక ఓటర్ల సంప్రదాయం ప్రకారమో మళ్లీ అధికారంలోకి రావొచ్చు. అయితే అదంతా మాకేందుకు..గెలిచింది కాంగ్రెస్‌ కాదు.. పాకిస్థానేనన్న ఫేక్‌ న్యూస్‌లు సృష్టిస్తే సరిపోద్ది అనుకుంటే వచ్చే ఎన్నికల్లో కూడా జనాలు తరిమితరిమి తంతారు.

పాకిస్థాన్‌కు కాంగ్రెస్‌కు లింకేంటి..? ఇప్పుడేం పెద్దగా లేవులే కానీ.. దేశ విభజన సమయంలో ఉండేవి. అయితే బీజేపీ కార్యకర్తలు, నేతల ప్రకారం దేశంలో బీజేపీ తప్ప మిగతావన్ని దేశ వ్యతిరేక పార్టీలు..! వాళ్లు మాత్రమే దేశభక్తులు.. మిగిలిన పార్టీల వాళ్లంతా చైనా మద్దతుదారులు, పాకిస్థాన్ సానుభూతిదారులు. ఇది వాళ్ల సిక్‌ మైండ్‌సెట్. ఇదే పాడు బుద్ధిని కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు తర్వాత మరోసారి బయటపెట్టుకున్నారు. కాంగ్రెస్ విక్టరీని అభినందిస్తూ పాక్‌ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ట్వీట్ చేశాడని.. కాంగ్రెస్‌ను ఎన్నుకున్నందుకు కర్ణాటక ప్రజలకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపాడన్న వార్త సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దేశంలో ఇస్లాం బలోపేతానికి, కర్ణాటక సార్వభౌమాధికారం కోసం తమ ఎస్‌డీపీఐతో కలిసి కాంగ్రెస్ కృషి చేస్తుందని ఆశిస్తున్నాని షరీఫ్ ట్వీట్ చేసినట్టుగా ఉన్న ఆ స్క్రీన్ షాట్‌ని చాలా మంది షేర్ చేశారు. కనీసం షరీఫ్‌ ట్విట్టర్‌ ప్రొఫైల్ ఓపెన్ కూడా చేయకుండా అదే ట్విట్టర్‌ నుంచి ట్రెండింగ్‌ చేశారు. అయితే షరీఫ్‌ అసలు కర్ణాటక ఎన్నికల గురించి ఒక్క ట్వీటూ పెట్టలేదు.

ఐపోలేదు.. ఫేక్ న్యూస్ ఇంకా ఉంది:
షరీఫ్‌ ఫేక్ ట్వీట్ వైరల్‌ అవతుండగానే మరో అసత్య ప్రచారానికి తెరలేపారు బీజేపీ కార్యకర్తలు. ఈ సారి ఏకంగా ఓ ఫేక్ వీడియోను వైరల్‌ చేసింది. కాంగ్రెస్ విజయం తర్వాత, ఇస్లాం మళ్లీ వేర్పాటువాద స్వరాన్ని పెంచిందని.. కర్ణాటకలో అలాంటి ర్యాలీ జరిగిందంటూ ఓ వీడియో ట్రెండ్‌ అయ్యింది. అయితే అసలు ఇండియాలో జరిగిన ర్యాలీ కాదు అని ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ అరెస్ట్ సమయంలో జరిగిన ర్యాలీని కర్ణాటకలో జరిగినట్లు పోస్టులు చేసినట్లు స్పష్టమైంది. ఈ రెండే కాదు.. ఈ లిస్ట్‌లో మరికొన్ని కూడా ఉన్నాయి. నిజానికి బీజేపీ మద్దతుదారుల ఫేక్‌ ప్రచారాలను లెక్కగట్టలేం. ఓటమిని అంగీకరించలేక కాంగ్రెస్‌పై బురద జల్లే కార్యక్రమమే ఇది.