AP BJP: ఏపీ బీజేపీ పరిస్థితి ఇంతేనా…? ఇక మారదా…??

ఎప్పుడైనా ప్రజల తరపున పోరాడినప్పుడే పార్టీకి ఆదరణ లభిస్తుంది. అధికార పార్టీకి వంతపాడుతుంటే ప్రజల తరపున ఎలా పోరాడగలరు. ఇప్పుడు బీజేపీ పరిస్థితి కూడా ఇంతే.

  • Written By:
  • Publish Date - July 13, 2023 / 12:19 PM IST

దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి తిరుగులేదు. దాదాపు 20 రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారంలో ఉంది. కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది. కానీ దక్షిణ భారతదేశంలో.. ముఖ్యంగా ఆంద్రప్రదేశ్ లో మాత్రం ఆ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. ఎంతోమంది అధ్యక్షులు వస్తున్నారు.. పోతున్నారు.. కానీ పార్టీని మాత్రం పట్టాలెక్కించలేకపోతున్నారు. బలమైన నేతలు పార్టీలో ఉన్నా పార్టీ మాత్రం బలపడకపోగా.. రోజురోజుకూ బలహీనపడుతోంది. అధిష్టానం దృష్టి పెట్టకపోవడం వల్ల పరిస్థితి ఇలా ఉందా.. లేకుంటే రాష్ట్ర నేతల చేతకానితనం వల్ల ఇలా ఉందా అనేది అర్థం కావడం లేదు.

ఆంధ్రప్రదేశ్ లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే కల బీజేపీకి ఎప్పటి నుంచో ఉంది. కేంద్ర నేతలు రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారీ ఈసారి రాబోయేది తామేనని చెప్తుంటారు. అది ఆ క్షణానికి మాత్రం గొప్ప వార్తలాగా అనిపిస్తుంది బీజేపీ నేతలకు. వాళ్లు ఫ్లైట్ ఎక్కగానే రాష్ట్ర నేతలు ఎవరి దారి వాళ్లు చూసుకుని వెళ్లిపోతుంటారు. వాళ్ల పనుల్లో నిమగ్నమైపోతుంటారు. పార్టీని పట్టించుకునే తీరిక వాళ్లకుండదు. అందుకే పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారైంది. ఎంతోమంది నేతలు పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు. వాళ్లలో ఎంతోమంది సీనియర్లు ఉన్నారు. అయినా పార్టీ మాత్రం గాడిన పడలేదు.

ఇన్నాళ్లూ సోము వీర్రాజు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే ఆయన అందరు నేతలను కలుపుకుపోవడం లేదనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ముఖ్యంగా కాపు నేతలకు మాత్రమే ఆయన ప్రతినిధిగా ఉంటున్నారని.. మిగిలిన సామాజిక వర్గ నేతలను పట్టించుకోవడం లేదని అధిష్టానానికి కంప్లెయింట్స్ అందాయి. దీంతో సోము వీర్రాజును పక్కన పెట్టి దగ్గుబాటి పురందేశ్వరికి పార్టీ పగ్గాలిచ్చింది హైకమాండ్. పురందేశ్వరికి వ్యక్తిగత చరిష్మా ఉంది. దీంతో ఆమె పార్టీని గాడిన పెడతారని హైకమాండ్ ఆశిస్తోంది. అందుకే ఆమెకు పగ్గాలిచ్చింది. అయితే అధ్యక్షులను మార్చినంత మాత్రాన ఉపయోగం ఉండదు. వాళ్లు పార్టీకోసం పనిచేసినప్పుడే ఫలితం ఉంటుంది.

బీజేపీ రాష్ట్రంలో బలపడకపోవడానికి మరో కారణం అధికార పార్టీతో అంటకాగడమే. ఎప్పుడైనా ప్రజల తరపున పోరాడినప్పుడే పార్టీకి ఆదరణ లభిస్తుంది. అధికార పార్టీకి వంతపాడుతుంటే ప్రజల తరపున ఎలా పోరాడగలరు. ఇప్పుడు బీజేపీ పరిస్థితి కూడా ఇంతే. అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ నేతలు అస్సలు ప్రయత్నించడం లేదు. అలాంటప్పుడు బీజేపీ జనాల్లోకి ఎలా వెళ్తుంది.. ఆ పార్టీకి ఎలా ఆదరణ లభిస్తుంది.. అందుకే బీజేపీ అధ్యక్షులు మారినంత మాత్రాన పార్టీ బలోపేతమవుతుందని భావించడం అత్యాశే. ఈ వాస్తవాన్ని బీజేపీ నేతలు గ్రహించనంత కాలం ఆ పార్టీ పరిస్థితి ఇంతే. ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తే ఇప్పుడు కూడా ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు. ఆ విషయం ఆ పార్టీ నేతలకు కూడా తెలుసు.