BRS-BJP: బీజేపీ, బీఆర్ఎస్ మధ్య సీక్రెట్ బంధం ఉందని కాంగ్రెస్ నేతలు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు. తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్‌ని అధికారంలోకి తేవడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ సభల్లో చెబుతున్నారు. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దగ్గర నుంచీ ఢిల్లీ నుంచి వస్తున్న అమిత్ షా, జేపీ నడ్డా వరకు అందరూ ఈ వాదనను ఖండిస్తున్నారు. ఇందులో నిజమెంతో.. అబద్దమెంతో తెలంగాణ ఓటర్లకు అర్థం కాని పరిస్థితి ఉంది. కానీ రాష్ట్రంలో టఫ్ ఫైట్ నడుస్తున్న 20 స్థానాల్లో బీఆర్ఎస్‌ను బీజేపీయే పరోక్షంగా గెలిపిస్తోందన్న టాక్ కొత్తగా వినిపిస్తోంది.
REVANTH REDDY: నల్లగొండ గడ్డ కాంగ్రెస్ అడ్డా.. ఇందిరమ్మ రాజ్యం తెచ్చే బాధ్యత మాది: రేవంత్ రెడ్డి
తెలంగాణలో ఇరవై నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌ని గెలిపించేందుకు బీజేపీతో రహస్యబంధం ఉందని పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. దక్షిణాదిలో ఇప్పటికే బీజేపీ ఒక్కో రాష్ట్రంలో పట్టుకోల్పోతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది. తమిళనాడులో ఎలాగూ బీజేపీతో పొత్తు ఉన్న AIDMK నెగ్గే పరిస్థితి లేదు. ఆంధ్రలో నాలుగైదు సీట్లు గెలిస్తే ఎక్కువ. ఇప్పుడు తెలంగాణలోనూ మూడో స్థానానికి పడిపోయింది బీజేపీ. ఇలా ఒక్కో రాష్ట్రం హస్తగతం అవుతున్నాయి. 2024లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలంటే.. ముందు తెలంగాణలో గెలవకుండా చేయాలి. అదే పట్టుదలతో బీజేపీ రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. అసలు బీజేపీ లిస్ట్ చివరి క్షణం దాకా రాకపోవడానికి కారణం.. బీఆర్ఎస్ అభ్యర్థులకు సమ ఉజ్జీలను దించకుండా చేసే ప్రయత్నమే అన్న విమర్శలు కూడా వచ్చాయి. కమలం పార్టీని వదిలి వెళ్ళిన ప్రముఖ నేతలు కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు.
గత 20 రోజులుగా తెలంగాణలో ప్రత్యేకించి కాంగ్రెస్ నాయకులపై వరుస ఐటీ దాడులతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది కేంద్రం. కాంగ్రెస్‌లో ఫైనాన్షియల్‌గా మంచి సౌండ్ ఉన్న లీడర్లే ఐటీ, ఈడీల టార్గెట్. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు రాసిన బహిరంగ లేఖలో కూడా ఇదే ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌లో భాగంగా తమ పార్టీ లీడర్లపై దాడులు చేయిస్తున్నారని అన్నారు. సరే ఇవన్నీ పక్కన పెడితే.. తెలంగాణలో కనీసం 20 స్థానాలు బీజెపి దయతోనే బీఆర్ఎస్ గెలుచుకోబోతోంది అంటున్నారు. అదెలా అంటే.. రాష్ట్రమంతా ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది. కానీ 20 అసెంబ్లీ స్థానాల్లో బీజెపి అభ్యర్థులు గెలవకపోయినా.. ఒక్కొక్కరు పది, పదిహేను వేల ఓట్లకు పైగానే తెచ్చుకోగలరు. ఇవన్నీ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లే. రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతున్నాయి. ఇలా చీలితే ఫైనల్‌గా లాభపడేది బీఆర్ఎస్సే. రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ ఉందని అందరూ అనుకుంటున్నారు.
కానీ, టెక్నికల్‌గా చూస్తే చివర్లో BRSకు అనూహ్యంగా 20 సీట్లు అదనంగా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ధైర్యం కూడా అదే. వ్యతిరేక ఓట్లు చీలిపోతే తిరిగి మేమే గెలుస్తాం.. మాకే అధికారం దక్కుతుంది అన్న ధీమా ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. ఇప్పటి దాకా రిలీజైన ఏ సర్వేలకు కూడా అందని విషయం ఇది. జనరల్‌గా సర్వేలో ఎవరికి ఓటు వేస్తారు అన్నది మాత్రమే చెప్తారు. కానీ ఓట్లు ఎలా చీలిపోతాయో సర్వేల్లో బయటపడదు. కానీ ఇప్పుడు తెలంగాణలో జరుగుతోంది ఇదే. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి పోవడం ఖాయంగా కనిపిస్తోంది. కనీసం 20 నియోజకవర్గాల్లో బీజెపి అభ్యర్థులకు ఒక్కో చోట పది నుంచి 15 వేల ఓట్లు వస్తాయంటున్నారు. ఈ ఓట్లతో వాళ్ళయితే ఎలాగూ గెలవరు. కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఇలా ముగ్గురు, నలుగురు అభ్యర్థులు చీల్చుకుంటే.. చివరికి అధికార పార్టీ అభ్యర్థే గెలుస్తాడు. ఈ ప్రయోగమే తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ని మళ్లీ అధికారంలోకి తెస్తుందని అర్థమవుతోంది.