Kiran Kumar Reddy: నల్లారికి ప్రయార్టీ అందుకేనా..? బీజేపీ మాస్టర్ ప్లాన్ పనిచేస్తుందా..?

కాషాయ కండువా కప్పుకున్న కొద్దికాలానికే కిరణ్‌ను నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ప్రకటించిన బీజేపీ ఢిల్లీ పెద్దలు ఆయన ద్వారా తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే పని చేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఇప్పటికీ ఆ పార్టీ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - July 26, 2023 / 10:43 AM IST

Kiran Kumar Reddy: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ మధ్య తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొనడం విజయశాంతి సహా కొంత మంది నేతలకు నచ్చలేదు. సమైక్య ఆంధ్రకు జైకొట్టిన నల్లారితో వేదిక పంచుకోవడానికి ఇష్టపడని రాములమ్మ తన అసంతృప్తిని బహిరంగంగానే ప్రకటించారు. తెలంగాణ బీజేపీ నేతల్లో కిరణ్ కుమార్ రెడ్డిపై ఎవరికి ఎలాంటి అభిప్రాయం ఉన్నా ఆయనకు బీజేపీ హైకమాండ్ అధిక ప్రాధాన్యం ఇస్తోంది. దీని వెనుక కాషాయ పార్టీకి ఓ ఎజెండా ఉంది.
కిరణ్‌కు బీజేపీ స్పెషల్ మిషన్
సమైక్యవాది.. తెలంగాణ అంటే గిట్టదు.. సీఎంగా ఉన్నప్పుడు రూపాయి ఇవ్వను పొమ్మన్నాడు.. కిరణ్ కుమార్ రెడ్డిని చాలా మంది తెలంగాణ బీజేపీ నేతలు ఈ కోణంలోనే చూస్తున్నారు. అందుకే విజయశాంతి వంటి నేతలకు ఆయనంటే గిట్టడం లేదు. అయితే ఢిల్లీ నాయకత్వం మాత్రం కిరణ్ సేవలను మరో రకంగా వాడుకునే ప్రయత్నం చేస్తోంది. అది కూడా తెలంగాణలో. కాషాయ కండువా కప్పుకున్న కొద్దికాలానికే కిరణ్‌ను నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ప్రకటించిన బీజేపీ ఢిల్లీ పెద్దలు ఆయన ద్వారా తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే పని చేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఇప్పటికీ ఆ పార్టీ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. రాజకీయాలకు అతీతంగా ఆయనకు కాంగ్రెస్ పార్టీలో అగ్రస్థాయి నేతలు టచ్‌లో ఉంటున్నారు. పార్టీల పరంగానే కాదు.. వ్యక్తిగతంగా కూడా కిరణ్‌కు కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది స్నేహితులు ఉన్నారు. కిరణ్‌కున్న పరిచయాలను ఉపయోగించుకుని ఆయన ద్వారా తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్‌‌ను అమలు చేయాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. అందులో భాగంగానే కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ బీజేపీ నేతలకు దగ్గరగా ఉంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. బండి సంజయ్ నుంచి పార్టీ పగ్గాలు కిషన్ రెడ్డికి అప్పగించిన తర్వాత ఆయనకు మరింత ప్రాధాన్యం పెరిగినట్టు కనిపిస్తోంది. అందుకే కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకారానికి కూడా కిరణ్ హాజరయ్యారు.
పోయేవాళ్లు పోతే.. కొత్తవాళ్లు రావాలిగా
ఈ మధ్య తెలంగాణ బీజేపీలో అసంతృప్తుల అగ్గి రాజుకుంది. బండి సంజయ్ వర్సెస్ ఈటల వ్యవహారం ఢిల్లీ స్థాయిలో రచ్చకు దారితీసింది. లేని పోని ఫిర్యాదులు చేయకండయ్యా అంటూ ఈమధ్య బండి బహిరంగంగానే తన వ్యతిరేక వర్గానికి చురకలు అంటించారు. పార్టీలో అంతర్గత ఘర్షణ వాతావరణంతో పాటు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం లేదన్న ప్రచారం నేపథ్యంలో చాలా మంది ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. అధ్యక్షుడి మార్పు జరిగినా ఇప్పటికీ తెలంగాణ బీజేపీలో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులానే ఉంది. దీంతో పార్టీ బలహీన పడకుండా ఉండేందుకు ఢిల్లీలో వ్యూహాలు అమలు చేస్తున్నారు కాషాయ పెద్దలు. బీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ అసంతృప్త నేతలకు గాలం వేసేందుకు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి స్పెషల్ టాస్క్ అప్పగించినట్టుగా వార్తలు వస్తున్నాయి.
నల్లారి కీ రోల్ ప్లే చేయగలరా ?
కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ హైకమాండ్ ఎలాంటి టాస్క్ అప్పగించినా.. ఆయన తెలంగాణలో తనదైన ముద్ర వేయగలరా లేదా అన్నది చూడాలి. రాష్ట్ర విభజన తర్వాత నుంచి లో ప్రొఫైల్ మెయింటెన్ చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి యాక్టివ్ పొలిటీషియన్‌గా పెద్దగా కనిపించడం లేదు. బీజేపీలో చేరిన తర్వాత కూడా అగ్రెసివ్ స్పీచ్‌లు లేవు. అయితే చాప కింద నీరులా నల్లారి తన పని తాను చేసుకుపోతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో ఉన్న తన దగ్గర స్నేహితులను మెల్లగా బీజేపీ వైపు రప్పించేందుకు ఆయన గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ డైరెక్షన్‌లో నల్లారి ఆపరేషన్ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.