BJP DECIDES: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అందరి దృష్టీ బీజేపీపైనే ఉంది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడుతుంది అన్నది డిసైడ్ చేయబోయేది కమలం పార్టీయే అంటున్నారు విశ్లేషకులు. అందుకు తగిన సమీకరణాలు, లెక్కలను చూపిస్తున్నారు. 2018లో బీజేపీకి ఓట్ల శాతం 6.98 ఉండగా.. 2019 లోక్ సభ ఎన్నికల నాటికి.. అంటే కొన్ని నెలల్లోనే ఆ పార్టీకి 19.65శాతానికి పెరిగింది. ఒక్క అసెంబ్లీ సీటు నుంచి నాలుగు లోక్ సభ స్థానాలు గెలుచుకునే దాకా వెళ్ళింది. మరి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎలాంటి షాక్స్ ఇవ్వబోతోంది..? బీఆర్ఎస్, కాంగ్రెస్ గెలుపోటములను కమలం పార్టీయే డిసైడ్ చేయబోతోందా..?
ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాల్లో బీజేపీ 30 సీట్లల్లో గట్టి పోటీ ఇస్తుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
REVANTH REDDY: కేసీఆర్ బకాసురుడు.. పదేళ్లలో కేసీఆర్ కుటుంబమే బంగారమయమైంది: రేవంత్ రెడ్డి
ఈ స్థానాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి పెద్దగా పోటీ ఎదురు కాదని అంటున్నారు. ఇందులో ముథేల్, నిర్మల్, కోరుట్ల, నిజామాబాద్ అర్బన్, హుజూరాబాద్, గోషామహల్, కరీంనగర్ లాంటి సీట్లు ఉన్నాయి. ఇవి ఎక్కువగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే ఉన్నాయి. ఈ సీట్లను బీజేపీ గెలుచుకోవడం గానీ లేదంటే గట్టి పోటీ అయినా ఇస్తుందని అంటున్నారు. వీటిని ఏ కేటగిరీ స్థానాలుగా కమలం పార్టీ భావిస్తోంది. ఇక బీ కేటగిరీలో మరో 15 సీట్లు ముక్కోణపు పోరులో ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఇందులో హైదరాబాద్‌లోని ముషీరాబాద్, కామారెడ్డిలాంటి స్థానాలు ఉన్నాయి. కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ రెడ్డి పోటీలో ఉన్నా.. నేను లోకల్ అని బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. మిగిలిన 89 స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోరు గట్టిగా నడుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ స్థానాల్లో మేమున్నాం అని చెప్పుకోడానికి బీజేపీ, జనసేన గుర్తులు ఈవీఎంలలో ఉంటాయి.
బీజేపీ అధిష్టానం కూడా గెలిచే 30 స్థానాలపైనే గట్టిగా దృష్టి పెట్టిందని అంటున్నారు. వీటిల్లో కనీసం 15 సీట్లు గెలిచి, మరో 15 స్థానాల్లో సెకండ్ పొజిషన్‌లో ఉన్నా.. 2024లో లోక్‌సభ ఎన్నికలకు ఈ ఓట్లు పనికొస్తాయనేది బీజేపీ శ్రేణుల ఆలోచన. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 48 స్థానాల్లో బీజేపీ కార్పొరేటర్లు గెలిచారు. వీళ్ళల్లో కొందరు బీఆర్ఎస్‌లో చేరినా.. హైదరాబాద్ పరిధిలోని అసెంబ్లీ సీట్లల్లో సత్తా చాటాలని కమలం పార్టీ భావిస్తోంది. అందుకే ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షాతో సిటీ బేస్డ్‌గా బహిరంగ సభలను కూడా నిర్వహిస్తోంది. మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో తమిళుల జనాభా ఉంది. అందుకే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై, నటి ఖుష్బూ లాంటి స్టార్ క్యాంపెయినర్లతో ఈ ఏరియాలో ప్రచారం చేయిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీకి ఓటింగ్ శాతం పెరగడం తమకే కలిసి వస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా కాంగ్రెస్‌కే పోకుండా ఇలా బీజేపీ చీల్చడం వల్ల తమకు ప్రయోజనం ఉంటుందని నమ్ముతున్నారు. 2018లో బీజేపీ దాదాపు 100 సీట్లల్లో డిపాజిట్ కోల్పోయింది. కానీ ఈసారి అంత ఘోరమైన పరిస్థితి ఉండదని అంచనా వేస్తున్నారు. ముగ్గురు సిట్టింగ్ ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దింపడానికి కారణం కూడా ఇదే.
Eatala Rajender: గజ్వేల్‌లో ఈటల మాస్టర్‌ప్లాన్.. కేసీఆర్‌కు మాములు షాక్ ఇవ్వట్లేదుగా..
తమ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు సెగ్మెంట్లపై వీరు ప్రభావితం చూపిస్తారన్నది బీజేపీ అధిష్టానం ఆలోచన. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్.. కోరుట్ల నుంచి పోటీలో ఉన్నారు. జగిత్యాల, నిజాబాద్ అర్బన్ సహా 6 స్థానాల్లో ఆయన ప్రభావం చూపించే అవకాశముంది. అలాగే కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి అక్కడి ఎంపీ బండి సంజయ్ నిలబడ్డారు. ఆయన కూడా తన ఎంపీ స్థానం పరిధిలో నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. బీసీ ముఖ్యమంత్రి నినాదం బీజేపీకి అంతగా కలసి వస్తుందని అనుకోవడం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కానీ ఎస్సీల్లో మాదిగ వర్గం ఓట్లు మాత్రం ఈసారి కమలం పార్టీకే పడతాయంటున్నారు. గతంలో బీఆర్ఎస్‌కే ఓట్లేసిన మైనార్టీలు ఈసారి కాంగ్రెస్‌వైపు చూస్తున్నారు. హైదరాబాద్ తప్ప.. జిల్లాల్లోని ముస్లిం ఓటు బ్యాంక్ కాంగ్రెస్‌కు టర్న్ అయింది. బీఆర్ఎస్ ముస్లింలకు 3 టిక్కెట్లు ఇస్తే, కాంగ్రెస్ ఐదు టిక్కెట్లు ఇచ్చింది. దాంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఓట్ల శాతంపై ఈ వర్గం ప్రభావం చూపించే ఛాన్సుంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీ చీల్చే ఓట్లను బట్టే.. కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ ఏది అధికారంలోకి వస్తుంది అన్నది డిసైడ్ అవుతుందని భావిస్తున్నారు.