AP BJP SEATS: సీట్ల సంగతి తేల్చని బీజేపీ.. తల పట్టుకుంటున్న టీడీపీ, జనసేన

ఆ పార్టీకి కూటమి నుంచి ఇచ్చినవి ఆరు ఎంపీ స్థానాలు, పది ఎమ్మెల్యే సీట్లు.. వీటిల్లో ఏ స్థానాలను తీసుకోవాలి.. అక్కడ ఏ అభ్యర్థులను నిలబెట్టాలన్నది బీజేపీ అధిష్టానం ఇంకా తేల్చలేదు.

  • Written By:
  • Publish Date - March 21, 2024 / 11:15 AM IST

AP BJP SEATS: ఆంధ్రప్రదేశ్ బీజేపీలో సీట్లతో పాటు అభ్యర్థుల ఎంపిక విషయంలో అయోమయం కనిపిస్తోంది. ఆ పార్టీకి కూటమి నుంచి ఇచ్చినవి ఆరు ఎంపీ స్థానాలు, పది ఎమ్మెల్యే సీట్లు.. వీటిల్లో ఏ స్థానాలను తీసుకోవాలి.. అక్కడ ఏ అభ్యర్థులను నిలబెట్టాలన్నది బీజేపీ అధిష్టానం ఇంకా తేల్చలేదు. బీజేపీ పెద్ఢలతో చర్చించేందుకు రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు సీనియర్లు సోము వీర్రాజు, మధుకర్ ఢిల్లీలోనే మకాం వేశారు.

PITHAPURAM: పిఠాపురంలో పవన్ ఓటమికి.. వైసీపీ త్రికోణ వ్యూహం

సీట్ల సంగతి ఇంకా కొలిక్కి రాకముందే.. అధిష్టానానికి ఏపీ బీజేపీ సీనియర్లు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. ఈ గందరగోళంలో టీడీపీ, జనసేనకు ఏం చేయాలో తెలియడం లేదు. టీడీపీ, జనసేన కూటమిలో చేరడం దగ్గర నుంచి సీట్ల సర్దుబాటు దాకా బీజేపీ అధిష్టానం నాన్చుడు ధోరణితో ఉంది. ఏపీలో ఏ సీట్లు కావాలో.. అక్కడ ఏయే అభ్యర్థులను పోటీలోకి దించాలో బీజేపీ తేల్చుకోలేకపోతోంది. రాజమండ్రి ఎంపీ సీటు కోసం సోము వీర్రాజు, పురంధేశ్వరి పట్టుబడుతున్నారు. అలాగే అనకాపల్లి ఎంపీ టిక్కెట్ తనకే కావాలంటున్నారు సీఎం రమేష్. విశాఖపట్నంలో పోటీకి జీవీఎల్ తెగ పైరవీలు చేస్తున్నారు. రాజంపేట కోసం మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.

అరకు కోసం కొత్తపల్లి గీత, ఏలూరుకి సుజనా చౌదరి, తిరుపతి సీటు కోసం మాజీ IAS రత్నప్రభ, విజయనగరం సీటుపై మాధవ్.. ఇలా ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. సోము వీర్రాజుకు అసెంబ్లీ సీటు ఇవ్వాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. కానీ ఆయన రాజమండ్రి ఎంపీ కోసం పట్టుబడుతున్నారు. అక్కడ ఇప్పటికే పురంధేశ్వరి కర్చీఫ్ వేసుకోవడంతో పార్టీ నేతల మధ్య సిగపట్లు తప్పడం లేదు. బీజేపీ సీట్ల పంచాయితీ తేలకపోవడంతో.. మిగిలిన స్థానాలపై ఎటూ తేల్చుకోలేని స్థితిలో టీడీపీ, జనసేన పార్టీలు ఉన్నాయి. అసలు బీజేపీ ఏ సీట్లు కోరుతోంది.. ఆ తర్వాత మిగిలిన ఏ స్థానాల్లో తాము పోటీ చేయాలన్నది టీడీపీ, జనసేన నేతలకు అర్థంకాక జుట్టు పట్టుకుంటున్నారు.

విజయనగరం, అనకాపల్లి, ఏలూరులో ఇప్పటికే ఎంపీ అభ్యర్థులను టీడీపీ సిద్ధం చేసింది. కానీ వాళ్ళని ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉంది ఆ పార్టీ హైకమాండ్. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ కూడా రావడంతో ఇంకా సీట్ల సర్దుబాటు దగ్గరే ఆగిపోతే.. ప్రచారం ఎలా చేసుకోవాలని మూడు పార్టీల నేతలు ఆందోళనలో ఉన్నారు. బీజేపీ త్వరగా సీట్ల సంగతి తేల్చి.. అభ్యర్థులను ప్రకటించాలని కోరుతున్నారు.