T BJP: బీజేపీలో ఏం జరుగుతోంది..? నేతల్లోనే గందరగోళం..!

మొన్నటివరకు తెలంగాణలో రాబోయేది తమ పార్టీయే అని గొప్పలు చెప్పుకొన్న బీజేపీ ఉన్నట్లుండి సైలెన్స్ అయిపోయింది. కిషన్ రెడ్డి అధ్యక్షుడైన తర్వాత నుంచే పార్టీలో ఈ పరిస్థితి తలెత్తిందని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - August 31, 2023 / 02:36 PM IST

T BJP: తెలంగాణ బీజేపీ సైలెన్స్ అయిపోయింది. పార్టీని జనాలే కాదు.. సొంత నేతలే పట్టించుకోవడం లేదు. ఒకవైపు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మరింత దూకుడుగా వ్యవహరించాల్సిన బీజేపీ అధిష్టానం మౌనం వహించడంపై సొంత పార్టీ నేతల్లోనే ఆందోళన నెలకొంది. అసలు పార్టీలో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఉందనే వాదన వినిపిస్తోంది.
మొన్నటివరకు తెలంగాణలో రాబోయేది తమ పార్టీయే అని గొప్పలు చెప్పుకొన్న బీజేపీ ఉన్నట్లుండి సైలెన్స్ అయిపోయింది. కిషన్ రెడ్డి అధ్యక్షుడైన తర్వాత నుంచే పార్టీలో ఈ పరిస్థితి తలెత్తిందని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. బండి సంజయ్‌ను తప్పించిన తర్వాత నుంచి పార్టీలో ఎలాంటి హడావిడి లేదు. నిజం చెప్పాలంటే బండిని తప్పించాలని ప్రయత్నించిన నేతలు కూడా ఇప్పుడు పార్టీలో అంత యాక్టివ్‌గా ఉండటం లేదు. ఈటల, రఘునందన్ రావు, కోమటిరెడ్డి వంటి కొందరు నేతలు బండికి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేశారు. ఆయా నేతలు కోరుకున్నట్లే అధిష్టానం బండిని తప్పించింది.

దీంతో వాళ్లంతా తమ పంతం నెగ్గిందనుకున్నారు. కానీ, ఇప్పుడు చూస్తే బండి హయాంలోనే పార్టీ బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. కిషన్ రెడ్డికి బాధ్యతలు ఇచ్చిన తర్వాత నుంచి చాలా మంది నేతలు పార్టీకి అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి వంటి నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నేతల్లోనే కాదు.. కార్యకర్తల్లోనూ ఉత్సాహం లేదు. పార్టీ తరఫున ఏ కార్యక్రమం చేపట్టినా కింది స్థాయి నేతల నుంచి కూడా మద్దతు లభించడం లేదు. అమిత్ షా వంటి అగ్రనేత నిర్వహించిన ఖమ్మం సభ సక్సెస్ కాకపోవడమే దీనికి నిదర్శనం.

ఒకట్రెండు సభలు, సమావేశాలు తప్ప బీజేపీ తరఫున కార్యక్రమాలు లేవు. ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు, ప్రెస్‌మీట్లు కూడా లేవు. పార్టీలో కీలక నేతలు ఉన్నా.. ఎవరికి, ఏం చేయాలో పాలుపోవడం లేదు. దీంతో పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కాక నేతలు అయోమయానికి గురవుతున్నారు. బీఆర్ఎస్ ఎన్నికలకు అభ్యర్థుల్ని ప్రకటించేసింది. కాంగ్రెస్ అదే పనిలో ఉంది. కానీ, బీజేపీలో ఎలాంటి హడావిడి లేదు. పార్టీలోనూ పెద్దగా చేరికలు లేవు. బీజేపీ నేతలే ఇతర పార్టీలవైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ దూకుడుగా వ్యవహరించాల్సి ఉంది. లేకపోతే రాబోయే ఎన్నికల్లో బీజేపీ సింగిల్ డిజిట్ దాటడం కూడా కష్టమనే వాదనలు వినిపిస్తున్నాయి.