TDP Vs BJP: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ చేయడాన్ని తెలుగుదేశం కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి సంఘటన జరుగుతుందని వాళ్ళు ఊహించి ఉండరు. అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఎంతో జాగ్రత్తగా ఉండే చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఇలా ఇరుక్కుపోతారని ఎవరూ అనుకోరు. జగన్ అధికారంలోకి వచ్చాక నాలుగున్నర సంవత్సరాలు ఏం మాట్లాడకుండా ఉండి, అకస్మాత్తుగా చంద్రబాబును అరెస్ట్ చేయడం వంటి పరిణామాలు టీడీపీని ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. ఇదంతా కేంద్రంలో బీజేపీ నాయకత్వం సహకారం లేకుండానే జరిగిందా అని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. కేంద్రంలో బిజెపికి, వైసీపీకి విడదీయలేనంత అవినాభావ సంబంధం ఉన్న విషయం బహిరంగ రహస్యమే. జగన్ వేసే ప్రతి అడుగు వెనక కేంద్రం డైరెక్షన్ ఉంటుందనేది తెలిసిన విషయమే. ఇప్పుడు చంద్రబాబు అరెస్టు విషయంలో కూడా మొత్తం బిజెపి డైరెక్షన్లోనే అయిందనేది టిడిపి అనుమానం. బాబుని ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు జైల్లో పెట్టాలని జగన్ ఆలోచన. కానీ బిజెపి సహకారం లేకుండా జగన్ ఆ పని ఎప్పటికీ చేయలేడు.
బిజెపి మీద ఏపీలో కావాల్సినంత వ్యతిరేకత ఉంది. ఇదే సమయంలో జనంలో జగన్ సర్కార్‌పై కూడా వ్యతిరేకత కనిపిస్తోంది. ఇవన్నీ తమకు ఎన్నికల్లో కలిసి వస్తాయని టిడిపి నాయకులు భావిస్తున్నారు. అందుకే ఇప్పటివరకు బిజెపితో పొత్తుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు టిడిపి. మరోవైపు బిజెపితో కలిసి వెళ్లడం నష్టమేనని పార్టీలో సీనియర్ నేతలు కూడా చెప్తున్నారు. అందుకే ఇప్పుడు బిజెపి తెలివిగా పావులు కదిపింది . ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ద్వారా, అంతేకాకుండా మరికొన్ని కేసుల్లో నిందితుడిని చేయడం ద్వారా భవిష్యత్తులో చంద్రబాబుని పూర్తిగా అదుపులో పెట్టుకోవచ్చని బిజెపి ఆలోచన. భవిష్యత్తులో టిడిపి అధికారంలోకి వచ్చినా చంద్రబాబుపై కేసులు ఉంటే ఇప్పుడు జగన్‌ను ఎలా ఆడిస్తున్నారో.. చంద్రబాబును కూడా పూర్తిగా అదుపులో పెట్టి ఆడించొచ్చనిది బిజెపి ఆలోచన అయ్యుండొచ్చు. లేదా టిడిపిని ఇప్పుడే కకావికలం చేయాలంటే చంద్రబాబుని జైల్లో పెడితే ఆ పార్టీ కుదేలు అయిపోతుందని ఆలోచన కూడా కేంద్రంలోని బిజెపికి ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ కాగానే ఏపీ బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి ఈ అరెస్ట్‌ను ఖండించారు. ఆ తర్వాత రోజు జరిగే బందుకు మద్దతిస్తున్నట్లు బిజెపి పేరున లేఖ కూడా విడుదలైంది.
వెంటనే ఢిల్లీ నుంచి పార్టీ నాయకులకు ఆదేశాలు వచ్చాయి. చంద్రబాబు అరెస్టు విషయంలో బిజెపి స్థానిక నేతల అత్యుత్సాహం ప్రదర్శించోద్దని బిజెపి అధినాయకత్వం స్పష్టంగా చెప్పేసింది. పురందరేశ్వరికి హై కమాండ్ నుంచి అక్షింతలు పడినట్లుగా కూడా తెలిసింది. నిజానికి బీజేపీకి ఏపీలో బలం లేకపోయినా.. రాష్ట్రంలోని నేతల బలహీనతల్ని అండబెట్టుకుని వైసీపీని, టిడిపిని, జనసేనని కంట్రోల్ చేస్తూనే వచ్చింది బీజేపీ. ఇప్పుడు జగన్ భుజంపై తుపాకీ పెట్టి చంద్రబాబుని అరెస్టు చేయించడం ద్వారా, చంద్రబాబు అడ్డం తిరగకుండా బిజెపి కంట్రోల్ చేయగలుగుతోంది. చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీకి కూడా రాజకీయ ప్రయోజనాలున్నాయని, ఒకవేళ చంద్రబాబు అధికారంలోకి వచ్చినా సరే.. సీబీఐ కేసుల్ని సాకుగా చూపి, ఆయన్ను కూడా జగన్‌లాగే అదుపులో పెట్టుకోవాలనేది బీజేపీ ఆలోచన అయ్యండొచ్చని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు.