బీజేపీ నేతలు రాజకీయాలకే పరిమితం అవ్వరు.. మిగిలిన రంగాల్లోనూ వేలు పెడుతుంటారు.! పోని అక్కడ కుదురుగా ఉంటారా అంటే.. అమ్మో.. అసలు వాళ్లకు అలాంటి అలవాట్లు లేనేలేవు. ఎక్కడ కాళ్లు పెడితే అక్కడ తమ పార్టీ స్వలాభం చూసుకోవడమే తప్ప ఆ రంగం ఏమైపోయినా పట్టదు! క్రికెట్‌లోనూ రాజకీయా నాయకుల పెత్తనం ఎప్పటినుంచోనే ఉండగా.. బీసీసీఐలోకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జైషా ఎంట్రీ ఇచ్చిన తర్వాత అనేక వివాదాలు చుట్టుముట్టాయి! తాజాగా ఐపీఎల్ ఫీక్స్ అంటూ భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది. ధోనీ కోసమే ఐపీఎల్ ఫిక్స్ చేశారన్న వాదన బలంగా వినిపిస్తుండగా.. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై చేసిన వ్యాఖ్యలు వాటికి మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి.
ఫైనల్ మ్యాచ్‌లో చెన్నైని గెలిపించిన జడేజా బీజేపీ కార్యకర్త అంటూ హాట్ కామెంట్స్ చేశారు అన్నామలై. జడేజా భార్య బీజేపీ ఎమ్మెల్యేనని గుర్తు చేశారు. చెన్నై జట్టులో తమిళ ఆటగాళ్లు లేకున్నా.. ధోనీ కోసం ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నామన్నారు. జడేజా, అతని భార్యతో కలిసి మోదీ దిగిన ఫోటోను అఫిషీయల్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేశారు అన్నామలై. దీంతో ఈ సారి ఐపీఎల్ ఫిక్స్ అన్న ప్రచారానికి అన్నామలై మరింత ఊతమిచ్చారు..అయితే ధోనీ కోసం ఫిక్స్ చేశారా లేకా తమిళనాడులో తమ పార్టీ మైలేజీ కోసం చెన్నైని గెలిపించారా అంటే రెండిటి కోసమూ అన్న సమాధానమే వస్తోంది.
కర్ణాటకలో చావుదెబ్బ:
ఇటివలి ముగిసిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. కాంగ్రెస్ దెబ్బకు ఏకంగా 40కు పైగా సిట్టింగ్ స్థానాలను కోల్పోడంతో సౌతిండియాలో బీజేపీ అడ్రెస్ గల్లంతైంది. దీంతో ఏం చేయాలో అర్థంకానీ దిక్కుతోచని స్థితిలో ఉన్న కాషాయ నేతలకు తమిళనాడు కనిపించింది. తెలంగాణలో ఎలాగో ముస్లింలను చూపించి.. పాతబస్తిని పాకిస్థాన్ అని ప్రచారం చేసి నాలుగు సీట్లు సంపాదించుకునే అవకాశముంది. ఏపీపై ఇప్పుడప్పుడే ఫోకస్ చేస్తే పెద్ద ఉపయోగం ఉండదు. అందుకే తమిళనాడులో ద్రావిడ రాజకీయాల పుట్ట కదిపింది. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో ఈ విషయం స్పష్టమైంది.
చోళుల రాజదండం:
కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి ముందు.. తర్వాత దేశమంతా రాజదండం గురించే చర్చ జరిగింది. చోళుల సంప్రదాయంగా దీన్ని బీజేపీ ప్రచారం చేసింది. బ్రిటిష్ వాళ్లు పోతూపోతూ నెహ్రూకి రాజదండం ఇచ్చి వెళ్లారని..ఆయనెమో దాన్ని మ్యూజియంలో పడైమన్నట్టు కట్టుకథలు అల్లింది. ఇదంతా కాంగ్రెస్‌ని కార్నర్ చేయడం కోసం మాత్రమే కాదు.. చోళులపై తమకున్న ప్రేమ ప్రపంచంలో ఎవరికీ లేదని చెప్పే ప్రయత్నం. అందుకే ఆ రాజదండాన్ని పట్టుకొని మోదీ చాలా సేపు తిరిగారు.. రాజదండంపై ప్రశంసలు కూడా కురిపించారు..దానికి పూజలు చేసి పార్లమెంట్‌లో ప్రతిష్టించారు.
అటు పార్లమెంట్ ప్రారంభోత్సవంలో తమిళ పండితులే అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తమిళ భాష ఎక్కువగా వినపడింది. ఇదంతా ఎందుకు..? నిజంగా రాజదండానికి మోదీ అంత పెద్ద భక్తుడా..? మరి ఇన్నాళ్లు ఆ ఊసే ఎత్తలేదు ఎందుకు..? కర్ణాటక ఎన్నికల్లో ఓటమి తర్వాతే తమిళ జపం ఎందుకు చేస్తున్నట్టు..?
నిజానికి తమిళనాడులో వెనకబడిన, బడుగు బలహీన వర్గాలవారు ఎక్కువుంటారు. అగ్రవర్ణాల పెత్తనాలు, దారుణాలు భరించలేకనే అక్కడ ఎన్నో ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. అందుకే అక్కడ బ్రాహ్మణ ద్వేషం భారీ వృక్షంలా పెరిగిపోయింది.. ఇప్పుడు అదే బ్రాహ్మణలను దగ్గర చేసుకుంటున్నారు మోదీ. ఇలా ఓ వర్గానికి దగ్గరవడం.. మరో వర్గాన్ని రెచ్చగొట్టడం బీజేపీ ట్రెడ్ మార్క్ పాలిటిక్స్. ఇక్కడ కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్నారు మోదీ. అందుకే తమిళులు, చోళులు, పండితులు..ధోనీ..జడేజా అంటూ ఏ ఒక్క ఛాన్సూ మిస్ చేసుకోవడంలేదు!