AP BJP: పొత్తులపై బీజేపీలో గందరగోళం.. జనసేనతోనే ఉంటామన్న పురందేశ్వరి.. టీడీపీతో కూడా కలుస్తామన్న ఆదినారాయణ రెడ్డి

టీడీపీతో పొత్తు విషయంలో అధ్యక్షురాలు పురందేశ్వరి ఏమీ తేల్చనప్పటికీ, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి మాత్రం జనసేనతోపాటు టీడీపీతోనూ పొత్తు ఉంటుందని వెల్లడించారు. ఈ విషయంలో ఢిల్లీ హైకమాండ్ నుంచి వచ్చిన సూచనమేరకే తాను మాట్లాడుతున్నట్లు చెప్పారు

  • Written By:
  • Updated On - July 14, 2023 / 04:09 PM IST

AP BJP: జనసేనతోనే ఉంటామన్న పురందేశ్వరి.. టీడీపీని కలుపుకొంటామన్న ఆదినారాయణ రెడ్డి.. బీజేపీలో గందరగోళం
పొత్తుల విషయంలో ఏపీ బీజేపీలో గందరగోళం కొనసాగుతోంది. కొత్తగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన దగ్గుబాటి పురందేశ్వరి జనసేనతో సమన్వయం చేసుకుని ముందుకు సాగుతామని చెబుతుంటే.. బీజేపీ ఉపాధ్యక్షుడు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి మాట్లాడేతూ టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ఉంటుందన్నారు. అధ్యక్షురాలు జనసేనతో పొత్తు గురించి మాత్రమే చెబితే.. మరో నేత టీడీపీతో పొత్తు ఉంటుందని చెప్పారు. దీంతో ఏది నిజమో తెలియని పరిస్థితి నెలకొంది.
ఏపీ రాజకీయాల్లో పొత్తులు ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తాయి. వైసీపీ ఒంటరిగానే ఉంది. జనసేన-బీజేపీ మాత్రం కలిసే ఉన్నట్లు చెబుతుంటాయి. అయితే, కలిసి పని చేసిన సందర్భాలు చాలా తక్కువ. మరోవైపు జనసేన-టీడీపీ పొత్తు కూడా దాదాపు ఖాయమే అనే ప్రచారం ఎప్పట్నుంచో ఉంది. అసలైన చిక్కు వచ్చింది మాత్రం టీడీపీతో జనసేన-బీజేపీ కలిసి ఉండటం. ఈ విషయంలోనే స్పష్టత రావడం లేదు. టీడీపీ కలిసేందుకు జనసేన సిద్ధంగానే ఉన్నా.. బీజేపీ నుంచి సానుకూలత రాలేదు. మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే బాగుంటుందని పవన్, చంద్రబాబు భావిస్తున్నారు. ఈ విషయంలో పవన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. టీడీపీతో పొత్తు విషయంలో బీజేపీ ఏమీ తేల్చలేదు. ఈ సమయంలో జనసేన పరిస్థితి సందిగ్ధంలో పడింది. టీడీపీతో బీజేపీ కలవకుంటే ఏం చేయాలో తెలియని స్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో బీజేపీతో ఉండాలా.. ఆ పార్టీని వదిలి టీడీపీతో వెళ్లాలా అనేది తేల్చుకోలేకపోతున్నాడు పవన్.
జనసేనతోనే అంటున్న పురందేశ్వరి
అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన పురందేశ్వరి.. తాము ఎప్పట్నుంచో జనసేనతో కలిసున్నామని చెప్పింది. ‘‘పవన్‌కల్యాణ్‌తో నిన్నా, మొన్నా ఉన్నాం. రేపూ ఉంటాం. జనసేనతో సమన్వయం చేసుకుంటాం. ఆ పార్టీతో మైత్రి కొనసాగుతుంది. పాత్తుల అంశాన్ని పార్టీ నాయకత్వం చూసుకుంటుంది. ఈ అంశంలో పవన్‌తో సోమువీర్రాజు మాట్లాడుతునే ఉండేవారు. జనసేన మాకు ఎప్పటికీ మిత్ర పక్షమే’’ అని పురందేశ్వరి స్పష్టం చేశారు. అయితే, టీడీపీతో పొత్తు గురించి ఏం తేల్చలేదు. దీంతో టీడీపీతో పొత్తు ఉంటుందా..? ఉండదా..? అనే విషయంలో సందేహం అలాగే కొనసాగుతోంది.
టీడీపీతో పొత్తు ఉంటుందన్న ఆదినారాయణ రెడ్డి
టీడీపీతో పొత్తు విషయంలో అధ్యక్షురాలు పురందేశ్వరి ఏమీ తేల్చనప్పటికీ, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి మాత్రం జనసేనతోపాటు టీడీపీతోనూ పొత్తు ఉంటుందని వెల్లడించారు. ఈ విషయంలో ఢిల్లీ హైకమాండ్ నుంచి వచ్చిన సూచనమేరకే తాను మాట్లాడుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో వైసీపీ దుర్మార్గ పాలనను అంతమొందించడమే తమ లక్ష్యమని, ఆ పార్టీని ఓడించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కలుస్తాయని చెప్పారు. కేంద్రం నుంచి సంకేతాలు రాకుంటే తానెందుకు ఈ విషయం గురించి చెబుతానని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి నారాయణ స్వామి కూడా ఇటీవల దీనిపై స్పష్టత ఇచ్చారని ఆదినారాయణ రెడ్డి గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా తమ కూటమి పోటీ చేసి గెలవడం ఖాయమన్నారు. ఇప్పటికే మూడు పార్టీల కూటమి దిశగా చర్చలు సాగుతున్నట్లు చెప్పారు. సీబీఐ కేసుల నుంచి జగన్‌ను కేంద్రం కాపాడుతోందనే ప్రచారంలో నిజం లేదన్నారు. ఆది నారాయణ రెడ్డి వ్యాఖ్యలతో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా పని చేస్తాయని స్పష్టత వచ్చింది.
సందేహాలెన్నో
పొత్తు విషయంలో పురందేశ్వరి, ఆదినారాయణ రెడ్డి చెప్పిన విషయాల్లో స్పష్టత కరువైంది. ఇద్దరి మాటల్లోనూ బేధం కనిపిస్తోంది. మరోవైపు టీడీపీతో పొత్తు గురించి హైకమాండ్ నుంచి ఏ విధమైన స్పష్టత రాలేదు. ఇంకోవైపు కేంద్రంలో వైసీపీ చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏకంగా మంత్రివర్గంలో చేరుతుందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు టీడీపీతో కూడా ఈ మధ్య బీజేపీ చర్చలు జరుపుతున్నట్లు కనిపిస్తోంది. బీజేపీ.. వైసీపీతో ఉంటుందా..? తటస్థంగా ఉంటుందా..? లేక జనసేన-టీడీపీ కూటమితో కలుస్తుందా..? అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. లేక ఇదంతా బీజేపీ మైండ్ గేమా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.