BJP in South India: దక్షిణాదిలో బీజేపీ ఫెయిల్.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే సీన్ రిపీటా.. బీజేపీ వ్యూహమేంటి?

దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో బీజేపీ బలహీనంగానే ఉన్నట్లు లెక్క. ఇప్పట్లో ఏ రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. అందుకే దక్షిణాది పార్టీలు ఇప్పుడు బీజేపీ ముక్త దక్షిణ భారత్ అంటూ ప్రచారం చేస్తున్నాయి.

BJP in South India: దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు కర్ణాటక ఫలితాలు గట్టిదెబ్బ కొట్టాయి. దక్షిణాదిలో అధికారంలో ఉన్న ఒకే ఒక రాష్ట్రంలో కూడా అధికారం కోల్పోయింది బీజేపీ. ఇది ఆ పార్టీ ఇమేజ్‌ను మరింత దిగజార్చే అవకాశం ఉంది. దీంతో దక్షిణాది ప్రజలు బీజేపీని మరోసారి తిరస్కరించే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఇక బీజేపీ ఇక్కడ పుంజుకుంటుందా? లేదా ఎప్పట్లాగే చతికిలపడుతుందా? దక్షిణాదిపై బీజేపీ వ్యూహమేంటి?
దేశంలో బలంగా ఉన్న జాతీయ పార్టీ బీజేపీనే. అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. పలు రాష్ట్రాల్లో, కేంద్రంలోనూ అధికారంతో సత్తా చాటుతోంది. బీజేపీ ఉత్తరాదిన ఎంత బలంగా ఉన్నా.. దక్షిణాదిన మాత్రం బలహీనంగానే ఉంది. ఇప్పటివరకు కర్ణాటకలో మాత్రమే అధికారం దక్కించుకోగలిగింది. అది కూడా ఇప్పుడు కోల్పోయింది. అంటే దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో బీజేపీ బలహీనంగానే ఉన్నట్లు లెక్క. అధికారం కోల్పోయినప్పటికీ ఒక్క కర్ణాటకలో మాత్రమే కాస్త బలంగా ఉంది. మరే రాష్ట్రంలోనూ బీజేపీకి అంత సీన్ కనిపించడం లేదు. ఇప్పట్లో ఏ రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. దక్షిణాదిలో పాగా వేయాలనుకుంటున్న బీజేపీ ఆశలపై కర్ణాటక ఫలితాలు నీళ్లు జల్లినట్లైంది. అందుకే దక్షిణాది పార్టీలు ఇప్పుడు బీజేపీ ముక్త దక్షిణ భారత్ అంటూ ప్రచారం చేస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో
తెలంగాణలో గతంతో పోలిస్తే బీజేపీ కాస్త మెరుగ్గానే ఉంది. బండి సంజయ్ అధ్యక్షుడయ్యాక ఆ పార్టీ ప్రజల్లోకి దూసుకెళ్లింది. మరోవైపు మోదీ, అమిత్ షా ఇమేజ్, నద్దా నాయకత్వం, హిందూత్వ అంశం, మీడియా సహకారం వంటివి ఆ పార్టీకి కొంతవరకు ఉపయోగపడ్డాయి. అలాగని పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. అధికార బీఆర్ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా ఆ పార్టీ బలంగానే ఉంది. మరోవైపు కాంగ్రెస్ బలపడుతోంది. దీంతో తెలంగాణలో అధికారం కోసం త్రిముఖ పోరు తప్పేలా లేదు. తెలంగాణలో ఈసారి అధికారమే లక్ష్యంగా అధిష్టానం పావులు కదుపుతున్నప్పటికీ అనుకున్నంతగా బీజేపీకి మైలేజీ రావడం లేదు. హిందూత్వ అంశం కొంతమేరే పని చేస్తోంది. మోదీ, అమిత్ షా చరిష్మా కాస్త తగ్గినట్లే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా అధికారంలోకి వస్తుందని గ్యారెంటీ ఇవ్వలేని పరిస్థితి. కాకపోతే తెలంగాణ నుంచి గతంలోకంటే మెరుగైన సీట్లను బీజేపీ సాధిస్తుంది. ఇక ఏపీలో అయితే చెప్పుకోవడానికేమీ లేదు. రెండు, మూడు ఎమ్మెల్యే సీట్లు, ఒకట్రెండు ఎంపీ సీట్లు సాధిస్తేనే గొప్ప అనేలా ఉంది పరిస్థితి. అసలు అధిష్టానమే ఏపీపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఈసారి తెలంగాణ మీద దృష్టిపెట్టి, వచ్చే ఎన్నికల సమయానికి ఏపీపై దృష్టిపెట్టాలని అధిష్టానం భావిస్తోంది. మరోవైపు అటు వైఎస్ జగన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తూ, ఇంకోవైపు ఆ పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జనసేనతో కలిసున్నాం అంటుంది. దీంతో ఏపీలో ఆ పార్టీ స్టాండ్ ఏంటో ఎవరికీ తెలియడం లేదు. అక్కడ హిందూత్వ అంశం పని చేయదు. పార్టీకి సరైన నాయకులు లేరు. అందువల్ల ఏపీని బీజేపీ ఈసారికి వదిలేయాల్సిందే.
ఇతర రాష్ట్రాల్లో
తమిళనాడులో బీజేపీకి పెద్దగా ఛాన్స్ లేదనే చెప్పాలి. ప్రాంతీయ వాదానికి.. ముఖ్యంగా తమ ద్రవిడ సంస్కృతికి విలువనిచ్చే తమిళులు బీజేపీని, హిందూత్వను అంగీకరించే అవకాశమే లేదు. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు బీజేపీ ఎంత ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదు. అక్కడ అధికార డీఎంకే బలంగా ఉంది. అందువల్ల ఆ పార్టీని బీజేపీ ఎదుర్కోవడం సాధ్యం కాదు. పోనీ ప్రతిపక్షమైన అన్నా డీఎంకేతో కలిసినా బీజేపీకి పెద్దగా ఉపయోగం లేదు. తమిళులు బీజేపీ, మోదీకి వ్యతిరేకంగానే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ ప్రభావం చాలా తక్కువే. మూడు, నాలుగు ఎంపీ స్థానాలు సాధిస్తేనే చాలా గొప్ప అక్కడ. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి డీఎంకే మద్దతు ప్రకటించింది. అందువల్ల రాబోయే ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్-డీఎంకే కూటమిదే ఆధిపత్యం. ఇక కేరళలో కూడా ఇదే పరిస్థితి. అక్కడా హిందూత్వ ఎజెండా, మోదీ, అమిత్ షా చరిష్మా వంటివేవీ పని చేయవు. కేరళలో మిత్ర పక్షాలతో కలిసి కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉంది. కమ్యూనిస్టుల తర్వాత కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ ఉంటుంది. కేరళలో ఏ పార్టీ లేదా ఏ కూటమి గెలిచినా మోదీకి వ్యతిరేకంగానే ఉంటాయి. అవసరమైతే కాంగ్రెస్‌కే మద్దతిస్తాయి. దీంతో కేరళలోనూ బీజేపీ ఆటలు సాగవు. ఇక కర్ణాటకలో తాజా ఫలితాల సంగతి తెలిసిందే. బీజేపీని ప్రజలు తిరస్కరించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ ప్రభావం ఉంటుంది. కర్ణాటక నుంచి కూడా బీజేపీకి తక్కువ సీట్లే వస్తాయి.


బీజేపీ ఎజెండా ఫెయిల్
ఉత్తరాది రాష్ట్రాల్లో హిందూత్వ ఎజెండా బాగా పని చేసింది. హిందూ-ముస్లిం వివాదాల వల్ల బీజేపీ భారీగా లబ్ధిపొందింది. ఈ విషయంలో బీజేపీ వ్యూహాల్ని అక్కడి ప్రజలు ఆదరించారు. కానీ, ఇవేవీ దక్షిణాది రాష్ట్రాల్లో పని చేయడం లేదు. కర్ణాటకలో హిజాబ్ అంశం, టిప్పు సుల్తాన్, మత ఘర్షణలు, ముస్లిం రిజర్వేషన్ల రద్దు, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు, మోదీ, షా ఇమేజ్ వంటివేవీ పనిచేయలేదు. పైగా ఆ పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత పెరిగేలా చేశాయి. హిందీని జాతీయ భాషగా చేయాలంటూ బీజేపీ చేసిన ప్రయత్నాల్ని తమిళనాడు, కర్ణాటక ప్రజలు తిప్పికొట్టారు. ఇటీవల పెరుగును దహీ అనాలంటూ కేంద్రం ఆదేశించడం కూడా ప్రజల ఆగ్రహానికి కారణమైంది. గుజరాత్ పాల బ్రాండ్ అమూల్‌ను కర్ణాటకలోకి తీసుకురావాలనుకోవడం, అక్కడి నందిని బ్రాండ్‌ను దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా బీజేపీపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగేలా చేశాయి. ఇక్కడి నేతలపై కేసులు పెట్టి వేధించడం, దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపడం, నిధులు విడుదల చేయకపోవడం వంటి అనేక అంశాలు బీజేపీకి ప్రతికూలంగా మారాయి.
ఇప్పుడేం చేయాలి?
తెలంగాణలో అధికారం కోసం చేసే ప్రయత్నాలు ఫలించడం కష్టమే. మరోవైపు ఏపీలో ఇప్పటివరకు జనసేనతోనే ఉన్న బీజేపీ ఇకపై టీడీపీతో కూడా కలిసే ఛాన్స్ ఉంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఏపీలో ఏదో ఒక పార్టీ మద్దతు లేకుండా బీజేపీ బలపడటం కష్టం. అటు జగన్‌తో కలవలేదు. ఇప్పటివరకు టీడీపీని వ్యతిరేకించినప్పటికీ ఇకపై ఆ కూటమితో ఉంటేనే బీజేపీకి అంతోఇంతో ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఏపీలో ఒక్క సీటు కూడా రాదు. మిగతా రాష్ట్రాల్లో కూడా అక్కడి ప్రజల వైఖరిని అర్థం చేసుకుని సాగితేనే బీజేపీకి ఆదరణ. అలా కాకుండా ఉత్తరాది, మతతత్వ రాజకీయాలు చేద్దామంటే ఇక్కడ చెల్లవనే సంగతి బీజేపీ పెద్దలకు ఇప్పటికే అర్థమై ఉంటుంది.