BJP IN SOUTH: మూడు నెలల క్రితం కర్ణాటకలో బీజేపీ అధికారం కోల్పోయింది.. తెలంగాణపై ఆశలు పెట్టుకుంటే అధికారం మాట అటుంచి 8 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే అభ్యర్థులు గెలుపొందారు. ఇప్పటికే ఆ పార్టీకి ఉన్న నాలుగు ఎంపీ స్థానాల్లో… ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు పోటీ చేసి ఓడిపోయారు. ఆ నాలుగు లోక్ సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. అవి కాకుండా కొత్త ఏరియాల్లో అసెంబ్లీ సీట్లు బీజేపీకి వచ్చాయి. దాంతో తెలంగాణలోనూ కమలం పార్టీకి అంత సీన్ లేదని తేలిపోయింది. దక్షిణాదిలో ఏపీతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ… ఇలా ఏ రాష్ట్రంలోనూ ఆ పార్టీని జనం ఆదరించడం లేదు.
ఈ పరిస్థితుల్లో 2024 ఏప్రిల్ లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఎలా వెళ్ళాలన్నది బీజేపీ అధిష్టానం పెద్దలకు అర్థం కావట్లేదు. ఉత్తరాదిన హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో ఉన్న హవా … దక్షిణాదిలో ఎందుకు లేదు… అందుకు అడ్డంకిగా ఉన్న అంశాలేంటి అన్నదానిపై బీజేపీ హైకమాండ్ దృష్టి పెట్టింది. జనరల్ ఎలక్షన్స్ నాటికి ఈ దక్షిణాది రాష్ట్రాల్లోని స్థానిక ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడాలని డిసైడ్ అయింది.
ఉత్తరాదిలో లాగా దక్షిణాదిలో… ముస్లింలపై వ్యతిరేకత…బలమైన హిందూత్వ వాదం అనేవి పనిచేయడం లేదు. కానీ ఢిల్లీ పెద్దలు ఇక్కడకు వచ్చినప్పుడల్లా… వీటినే ఎక్కువగా టచ్ చేస్తున్నారు. అలాగే హిందూత్వ ప్రభావం కొంత వరకూ ఉన్నా….హార్డ్ కోర్ భావజాలం అయితే దక్షిణాదిలో లేదు. హిందువులు కూడా స్థానిక అవసరాలను బట్టి… ఆయా పార్టీలకు ఓట్లేస్తున్నారు. కర్ణాటకలోనూ హిందూత్వను రెచ్చగొట్టడానికి ప్రయత్నించి కమలం పార్టీ బొక్కబోర్లా పడింది. అప్పుడే అర్థం చేసుకోవాల్సి ఉంది. కానీ ఎందుకు ఆ ఇష్యూని లైట్ తీసుకున్నారు ఢిల్లీ పెద్దలు. మరీ ముఖ్యంగా దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నచోట్ల బీజేపీ ఎదగడం కష్టమవుతోంది. అందుకోసం ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవడమో… లేదా ఆ పార్టీలను ఎదగనీయకుండా చేస్తేనో తప్ప… బీజేపీకి దక్షిణాదిలో ఓట్లు పడే అవకాశాలు లేవు. ప్రాంతీయ పార్టీల లాగే ఆందోళనలు, ధర్నాలు లాంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను కమలం పార్టీ అమలు చేయాల్సి ఉంటుంది. అసలు దక్షిణాది విషయంలో బీజేపీ ప్రత్యేక పాలసీ రూపొందించుకొని వెళితే తప్ప… ఇక్కడ ఆ పార్టీకి ఆదరణ ఉండదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.