T BJP: బీజేపీ తొలి జాబితా సిద్ధం.. మరో వారంలో ప్రకటన..!

119 మంది అభ్యర్థులకుగాను.. మొదటి జాబితాలో 38 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించబోతుంది. అభ్యర్థుల ఎంపిక కోసం బీజేపీ కసరత్తు పూర్తి చేసింది. మొదటి విడత జాబితాపై ఒక స్పష్టతకు వచ్చింది. దీంతో ఈ నెల మూడో వారంలో తొలి జాబితా వస్తుంది.

  • Written By:
  • Publish Date - October 8, 2023 / 05:16 PM IST

T BJP: తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో పార్టీలన్నీ ఎన్నికల కోసం సిద్ధమవుతున్నాయి. ఎన్నికల్ ప్రక్రియలో కీలకమైన అభ్యర్థుల ఎంపికపై పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక కాంగ్రెస్, బీజేపీ కూడా అదే పనిలో ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల చేసేందుకు బీజేపీ సిద్ధమైంది. అమావాస్య తర్వాత తొలి జాబితాకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 16 లేదా 17న అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనుంది.

119 మంది అభ్యర్థులకుగాను.. మొదటి జాబితాలో 38 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించబోతుంది. అభ్యర్థుల ఎంపిక కోసం బీజేపీ కసరత్తు పూర్తి చేసింది. మొదటి విడత జాబితాపై ఒక స్పష్టతకు వచ్చింది. దీంతో ఈ నెల మూడో వారంలో తొలి జాబితా వస్తుంది. ఆ తర్వాత మరో రెండు విడతలుగా పూర్తి అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. మొత్తం మూడు విడతల్లో అభ్యర్థుల ప్రకటన ఉండబోతుంది. అభ్యర్థుల జాబితా ప్రకటన పూర్తవగానే.. పూర్తిస్థాయి ప్రచారంపై బీజేపీ దృష్టి సారిస్తుంది. ఇప్పటికే తెలంగాణలో దూకుడుగా సభలు నిర్వహిస్తోంది. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా వంటి అగ్ర నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. త్వరలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కూడా సభలకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఎన్నికలలోపు తెలంగాణలో దాదాపు 30 సభలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని బీజేపీ నేతలు అంటున్నారు. ఇప్పటికే ప్రచార వ్యూహం, సభలు, ర్యాలీలు వంటి అంశాలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. పార్టీ అగ్రనేతలతో చర్చించారు.

హోంమంత్రి అమిత్ షా, జేపీ నద్దాతో చర్చలు జరిపారు. తెలంగాణలో నిర్వహించబోయే సభల్లో ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నద్దాతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు కూడా పాల్గొంటారు. పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి, బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ను ఎదుర్కోవాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో నిర్వహించిన భారీ బహిరంగ సభల్లో పాల్గొని, తెలంగాణకు వరాల జల్లు కురిపించారు. వీటివల్ల బీజేపీపై తెలంగాణలో కొంత సానుకూలత ఏర్పడింది.