BJP: బీజేపీ దూకుడు మంత్రం.. ఎన్నికల కోసం వంద రోజుల ప్లాన్.. వర్కవుటయ్యేనా..?

తెలంగాణలోని జిల్లాల అధ్యక్షులు, రాష్ట్రస్థాయి నేతలతో అధ్యక్షుడు కిషన్ రెడ్డి మంగళవారం సమావేశమయ్యారు. వంద రోజుల యాక్షన్ ప్లాన్‌పై చర్చించాయి. ఈ మేరకు బీజేపీకి చెందిన వర్గాలు కీలక వివరాలు వెల్లడించాయి.

  • Written By:
  • Publish Date - July 12, 2023 / 04:42 PM IST

BJP: తెలంగాణ ఎన్నికల క్షేత్రంలో వెనుకబడ్డట్లు కనిపిస్తున్న బీజేపీ తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని నిర్ణయించింది. మూడు లేదా నాలుగు నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఆ లోపే స్పీడ్ పెంచాలని డిసైడ్ అయ్యింది. వంద రోజులప్లాన్‌తో పార్టీకి పునరుత్తేజం తేవాలని చూస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని కార్యక్రమాలు చేపట్టబోతుంది. తెలంగాణలోని జిల్లాల అధ్యక్షులు, రాష్ట్రస్థాయి నేతలతో అధ్యక్షుడు కిషన్ రెడ్డి మంగళవారం సమావేశమయ్యారు.

వంద రోజుల యాక్షన్ ప్లాన్‌పై చర్చించాయి. ఈ మేరకు బీజేపీకి చెందిన వర్గాలు కీలక వివరాలు వెల్లడించాయి. దీనిప్రకారం.. బీఆర్ఎస్ కుటుంబ పాలన, అవినీతిని బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లబోతుంది. అలాగే సమాచార హక్కు చట్టం ఉపయోగించుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆస్తి వివరాల్ని సేకరించి, ప్రజల ముందు ఉంచనుంది. ప్రభుత్వ పథకాల అమలులో వైఫల్యాల్ని కూడా తెరమీదకు తీసుకురానుంది. మరోవైపు డబుల్ బెడ్ రూం ఇండ్లపై కూడా బీజేపీ సమీక్ష జరపబోతుంది. ఇంకా నిర్మాణంలోనే ఉన్న ఇండ్ల గురించి స్థానికులకు వివరించడం, ఈ విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలకు వివరించడం చేయనుంది. అన్ని మండలాల్లోనూ ఇండ్ల నిర్మాణాల్ని బీజేపీ నేతలు పరిశీలిస్తారు. దళిత బంధు పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది. పథకానికి ఎంపికైన వాళ్లెవరు..? అసలైన లబ్ధిదారులు ఎవరు..? ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యేల అవినీతి.. పథకం అమలులో లోపాలు వంటి అంశాల్ని బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్లబోతోంది.

బీజేపీ చేయబోయే పోరాటంపై రాజ్యసభ ఎంపీ కే లక్ష్మణ్ వివరించారు. వంద రోజులపాటు రాష్ట్రస్థాయిలో, జిల్లా స్థాయిలో ఉధృతంగా కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా గతంలోనే బండి సంజయ్ అనేక కార్యక్రమాలు చేపట్టారని, ఇకపై చేపట్టబోయే కార్యక్రమాలకు షెడ్యూల్ ఖరారు చేయాల్సి ఉందన్నారు. ప్రధాని మోదీ చేపడుతున్న మన్ కీ బాత్‌లాగే తెలంగాణలో ప్రతి నెలా టిఫిన్ బైటక్స్ నిర్వహిస్తామన్నారు. దీనిలో భాగంగా నియోజకవర్గ స్థాయిల్లో అన్ని వర్గాల వారితో సమావేశమవ్వనున్నట్లు తెలిపారు. దళితవాడల్లో బీజేపీ కార్యకర్తలు పర్యటించి, అక్కడి సమస్యలపై అధ్యయనం చేయబోతున్నట్లు వెల్లడించారు.
17 ర్యాలీలకు ప్లాన్
మరోవైపు తెలంగాణలో భారీ సభలు, ర్యాలీలు నిర్వహించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయాధ్యక్షుడు నద్దా ఆధ్వర్యంలో వేరువేరుగా సభలు, ర్యాలీలు నిర్వహించనుంది. ఈ మేరకు ఇలాంటి కార్యక్రమాలు 17 లోక్‌సభ స్థానాల్లో నిర్వహించాలనుకుంటోంది. ఈ నెల 29న ఖమ్మంలో అమిత్ షా ఆధ్వర్యంలో సభ జరగనుంది. ఇప్పటికే నిర్వహించిన సభలకు మంచి స్పందన వస్తోందని, తెలంగాణ ప్రజలు మోదీవైపు, బీజేపీ వైపు చూస్తున్నారని లక్ష‌్మణ్ అన్నారు. కర్ణాటకలో హామీల అమలులో కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. బీజేపీ ప్రజల మేనిఫెస్టోతో ముందుకొస్తుందని వివరించారు. లిక్కర్ స్కాంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు వాటి పని అవి చేస్తాయన్నారు.
ఈటల, బండి వర్గీయుల గొడవ
తెలంగాణలో బీజేపీని ఎలా అధికారంలోకి తేవాలి అనే అంశంపై సమీక్ష జరిగిన రోజే పార్టీ ఆఫీసులో గొడవ జరగడం గమనార్హం. పార్టీ సోషల్ మీడియా విభాగానికి సంబంధించి ఈటల, బండి సంజయ్ వర్గీయుల మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. ఈటలకు వ్యతిరేకంగా బండి వర్గం పోస్టులు పెడుతోందని ఈటల వర్గీయులు ఆరోపించారు. దీనికి బండివర్గం కూడా ధీటుగా బదులిచ్చింది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత తలెత్తింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి, దూషణకు ప్రయత్నించాయి. బీజేపీ సోషల్ మీడియా ఇంఛార్జి ప్రశాంత్‌తో ఈటల, కిషన్ రెడ్డి వర్గీయులు గొడవకు దిగారు. చివరకు కొందరు నేతలు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఈ అంశంపై బీజేపీలోని కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. క్రమశిక్షణ కలిగిన పార్టీలో ఈటల వర్గీయులు ఇలా చేయడం సరికాదని అంటున్నారు.