Bandi Sanjay: తెలంగాణలో వ్యూహం మార్చిన బీజేపీ.. కమలం పార్టీకి ఇది మేలు చేసే ఛాన్స్ ఉందా ?

సీట్లు పెరిగాయ్ అంతే.. ఓట్లు కాదు అని కర్ణాటకలో కాంగ్రెస్ విజయంపై బీజేపీ విమర్శలు చేస్తున్నా.. లోలోపల మాత్రం టెన్షన్ మొదలైంది. తెలంగాణలో అయితే మరింత గుబులు కనిపిస్తోంది కమలం పార్టీలో ! ఇలాంటి పరిస్థితుల మధ్య సరికొత్త వ్యూహానికి బీజేపీ నేతలు తెరతీశారు. దీనికి కరీంనగర్‌లో హిందూ ఏక్తా యాత్రే ఎగ్జాంపుల్ అనే చర్చ జరుగుతోంది. ఎంఐఎంతో బీఆర్ఎస్ కలిసిపోయి.. తెలంగాణలో హిందువులకు అన్యాయం చేస్తుందని చెప్పడమే ఈ యాత్ర లక్ష్యం అని బీజేపీ నేతలు అంటున్నారు.

  • Written By:
  • Publish Date - May 17, 2023 / 03:49 PM IST

నిజానికి కేసీఆర్ కుటుంబ పాలన, నిరుద్యోగ యువతలో అసంతృప్తి, పేపర్‌ లీకేజీ వ్యవహారాన్ని ఆయుధంగా చేసుకొని తెలంగాణ ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ ప్లాన్ చేసింది. ఐతే అవేవి పెద్దగా వర్కౌట్ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో కమలం పార్టీ పెద్దలు రూట్ మార్చినట్లు క్లియర్‌గా అర్థం అవుతోంది. ఇప్పుడు బీజేపీ ముందున్న ఒకే ఒక్క ఆప్షన్‌.. మతపరమైన అంశమే ! దీన్నే ట్రంప్‌కార్డులా వాడుకోవాలని కమలం పార్టీ భావిస్తుందా అంటే.. కరీంనగర్‌లో జరిగిన హిందూ ఏక్తా యాత్రతో నిజమే అనే చర్చ జరుగుతోంది.

ఐతే హిందీ రాష్ట్రాల్లో ఇలాంటి వ్యూహంతోనే బీజేపీ వరుస విజయాలు సాధించింది. తెలంగాణలో ఆ పాచికలు పారే అవకాశాలు అసలు లేవు. తెలంగాణలో హిందుత్వ రాజకీయాలు చేయడానికి బీజేపీ సిద్ధంగా ఉందని క్లియర్‌గా కనిపిస్తోంది. ఐతే కర్ణాటక ఫలితాలతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్.. బీజేపీ అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లలో మంచి వాటాను కాంగ్రెస్ ఆకర్షించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

హిందూత్వ పేరుతో బీజేపీ చేస్తున్న రాజకీయాన్ని జనాలు ఒప్పుకుంటారా అంటే.. కర్ణాటకలో జరిగిన సీనే.. తెలంగాణలోనూ రిపీట్ కావడం ఖాయం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. దీంతో ఇప్పుడు బీజేపీ మరో మార్గం చూసుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అంటున్నారు. సామాజిక, ఆర్థిక కారణాలు, ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు.. మరో బలమైన అస్త్రం బీజేపీ సంధించాల్సి ఉంటుందన్నది మెజారిటీ వర్గాల అభిప్రాయం. తెలంగాణ ఓటర్లు.. హిందుత్వ కార్డు కన్నా సెంటిమెంట్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. స్థానిక అంశాల ప్రభావితంతోనే ఓటు వేయడానికి సిద్ధపడుతుంటారు. బీజేపీ తెలుసుకోవాల్సిన విషయం ఇదే. దీనికి అనుగుణంగా వ్యూహాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది అన్నది మాత్రం క్లియర్‌.