BJP Freebies: కర్ణాటక ఎన్నికల్లో ఉచిత హామీలు.. బీజేపీ రూటు మార్చిందా? చెప్పేదొకటి.. చేసేదొకటా?

బీజేపీ ఏ రాష్ట్రంలోనూ ఉచిత హామీలు ఇవ్వదు. ఒకవేళ ఏదైనా రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అప్పటివరకు ఉన్న ఉచిత పథకాలకు నెమ్మదిగా కోత వేస్తుంది. ఉచిత హామీలు ఇచ్చే పార్టీలను కూడా వ్యతిరేకిస్తుంటుంది. అలాంటిది ఇప్పుడు బీజేపీ రూటు మార్చింది. కర్ణాటక ఎన్నికల్లో ఉచిత హామీలు గుప్పిస్తోంది.

BJP Freebies: ఓటర్లకు ఉచిత హామీలు ఇవ్వడానికి తాము వ్యతిరేకం అని బీజేపీ గొప్పగా చెప్పుకుంటుంది. ఏ రాష్ట్రంలోనూ పెద్దగా ఉచిత హామీలు ఇవ్వదు. ఒకవేళ ఏదైనా రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అప్పటివరకు ఉన్న ఉచిత పథకాలకు నెమ్మదిగా కోత వేస్తుంది. ఉచిత హామీలు ఇచ్చే పార్టీలను కూడా వ్యతిరేకిస్తుంటుంది. అలాంటిది ఇప్పుడు బీజేపీ రూటు మార్చింది. కర్ణాటక ఎన్నికల్లో ఉచిత హామీలు గుప్పిస్తోంది. ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తోంది. ఇతర పార్టీల్లాగే బీజేపీ కూడా మారిపోయిందా? సిద్ధాంతాలను వదిలేసిందా? లేక ఇతర పార్టీల్లాగా మారకుంటే అధికారం రాదని అర్థమైందా? ఇంతకీ ఈ మార్పునకు కారణమేంటి?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 10న జరగనున్నాయి. అందుకే పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉచిత హామీలు గుప్పిస్తున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్ ముందుంది. మరోవైపు కర్ణాటకలో కాంగ్రెస్ హవా వీస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే తిరిగి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. పార్టీ సిద్ధాంతాన్ని పక్కనబెట్టి మరీ ఇతర పార్టీల్లాగే ఉచిత హామీలు గుప్పిస్తోంది. మోదీ విధానాలకు వ్యతిరేకంగా ఈసారి బీజేపీ మేనిఫెస్టో రూపొందించింది. ఓటర్లపై వరాల జల్లు కురిపించింది. ఇదే ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల్ని ఆశ్చర్యపరుస్తోంది.
ఉచిత వరాల జల్లు
తాజాగా విడుదల చేసిన మేనిఫెస్టోలో కర్ణాటక ఓటర్లపై బీజేపీ వరాల జల్లు కురిపించింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, అలాగే రోజూ అర లీటరు నందిని పాలను అందిస్తామని చెప్పింది. ప్రతి వార్డులో అటల్ ఆహార్ కేంద్రం ఏర్పాటు, సీనియర్ సిటిజన్లకు ఉచిత వార్షిక మాస్టర్ హెల్త్ చెకప్‌, పేదలకు ఉచితంగా ఇండ్లు, రేషన్ షాపులలో బియ్యంతోపాటు ఉచితంగా ఐదు కేజీల చిరు ధాన్యాల పంపిణీ, పోటీ పరీక్షల కోసం యువతకు ఉచిత కోచింగ్ వంటి పథకాల్ని ప్రకటించింది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఉచిత హామీల్ని ప్రకటించడంపై ప్రతిపక్షాలు విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఎన్నికల స్టంట్ మాత్రమే అంటూ కొట్టిపారేస్తున్నాయి.
ఓటమి తప్పదని తెలిసే ఇలా చేస్తోందా?
అనేక సర్వేలు కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతున్నట్లు చెబుతున్నాయి. అందుకే ఎలాగైనా ఓటర్లను ఆకట్టుకునే లక్ష్యంతోనే బీజేపీ ఇలా ఉచిత వరాల జల్లు కురిపించిందని ప్రతిపక్షాలు అంటున్నాయి. కేవలం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇలా హామీలు గుప్పించిందని విమర్శిస్తున్నాయి. ఇది బీజేపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అని, ఓట్ల కోసం సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చిందని అంటున్నాయి. ఆ పార్టీ చెప్పేదొకటి.. చేసేదొకటి అంటూ ప్రజలు కూడా అంటున్నారు. అయినా ప్రజలు బీజేపీని నమ్మబోరని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.
మోదీ మాటల్ని పట్టించుకోని కర్ణాటక బీజేపీ
ఉచిత పథకాలకు తాను వ్యతిరేకం అని ప్రధాని మోదీ గతంలో ప్రకటించారు. ఉచిత పథకాలు ఇచ్చే పార్టీలను తీవ్రంగా వ్యతిరేకించారు. కష్టపడి పన్నులు చెల్లించే వారి సొమ్మును కొందరికి ఉచిత పథకాల రూపంలో అందజేయడం వల్ల వాళ్లంతా ఎంతో ఆవేదన చెందుతున్నారని మోదీ చెప్పారు. అందుకే తాము ఉచిత పథకాలు ఇవ్వకుండా అందరి సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నామని, దీంతో ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని మోదీ అన్నారు. తాను ఉచిత పథకాల్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. కానీ, ఇప్పుడు కర్ణాటక బీజేపీ నేతలు అంతకుమించి ఉచిత హామీలు ప్రకటించారు. దీంతో ఉచిత హామీల విషయంలో మోదీ మాటను కూడా లెక్కచేయడం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.