Pawan Kalyan and BJP: పొత్తులపై పవన్ కల్యాణ్‌ను డిఫెన్స్ లో పడేసిన బీజేపీ!

టీడీపీతో సంబంధం లేకుండా కేవలం బీజేపీ-జనసేన కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు మాత్రమే కమలం నేతలు సిద్ధంగా ఉన్నారు. అలా కాకుండా తాను టీడీపీతో వెళ్లాలనుకుంటే అది పవన్ కల్యాణ్ ఇష్టం అనేది బీజేపీ మాటగా ఉంది.

  • Written By:
  • Publish Date - April 3, 2023 / 05:49 PM IST

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ – జనసేన మధ్య పొత్తు ఉంటుందా.. ఉండదా.. అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇన్నాళ్లూ బీజేపీకి, జనసేనకు మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయిందని, ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఇక కష్టమని అందరూ అనుకున్నారు. జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయడం ఖాయమని నిర్ణయానికి వచ్చేశారు. అయితే ఎవరూ ఊహించని విధంగా జనసేనాని పవన్ కల్యాణ్ ఢిల్లీలో ప్రత్యక్షం కావడం, బీజేపీ పెద్దలకోసం పడిగాపులు కాస్తుండడం ఆసక్తి కలిగిస్తోంది. బీజేపీతో పొత్తుకోసమే పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

అయితే పవన్ కల్యాణ్ ను కలిసేందుకు బీజేపీ అగ్రనేతలెవరూ సుముఖంగా లేనట్టు సమాచారం. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం కావడానికి పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారు. అయితే వారి నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. ప్రస్తుతానికి ఏపీ వ్యవహారాలు చూస్తున్న మురళీదరన్ మాత్రమే పవన్ కల్యాణ్ సహచరుడు నాదేండ్ల మనోహర్ తో భేటీ అయ్యారు. ఆయనతో జరిగిన ప్రాథమిక చర్చల్లో పొత్తుపై ప్రతిష్టంభన నెలకొంది.

బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లే విధంగా జనసేనాని ప్రతిపాదించినట్టు సమాచారం. అయితే టీడీపీతో కలిసేందుకు బీజేపీ ససేమిరా అంటోంది. జనసేనతో కలిసి పని చేసేందుకు మాత్రమే సిద్ధంగా ఉంది. టీడీపీపై బీజేపీకి నమ్మకం లేదు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్- పీడీఎఫ్ తో కలిసి పనిచేసింది టీడీపీ. అది బీజేపీకి మింగుడు పడడంలేదు. టీడీపీ తరపున పవన్ కల్యాణ్ వకాల్తా పుచ్చుకుని ఢిల్లీ వచ్చినట్టు బీజేపీ అనుమానిస్తోంది. వాస్తవానికి ఢిల్లీ రావాలని బీజేపీ నుంచి పవన్ కల్యాణ్ కు ఎలాంటి ఆహ్వానమూ లేదు. అయినా పవన్ కల్యాణ్ స్వయంగా ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలను కలిసి పొత్తుపై చొరవ తీసుకుంటున్నారు. దీనిపై బీజేపీకి అనేక అనుమానాలు ఉన్నాయి.

టీడీపీతో సంబంధం లేకుండా కేవలం బీజేపీ-జనసేన కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు మాత్రమే కమలం నేతలు సిద్ధంగా ఉన్నారు. అలా కాకుండా తాను టీడీపీతో వెళ్లాలనుకుంటే అది పవన్ కల్యాణ్ ఇష్టం అనేది బీజేపీ మాటగా ఉంది. టీడీపీ ఉన్న ఏ కూటమిలోనూ తాము ఉండమని బీజేపీ అధిష్టానం తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది. తమతో కలసి వస్తారా.. లేకుంటే టీడీపీతో వెళ్తారా.. అనేది కూడా ఆలోచించుకుని చెప్పాలని పవన్ కల్యాణ్ కు మురళీధరన్ స్పష్టం చేసినట్టు సమాచారం. పవన్ కల్యాణ్ ఇచ్చే సమాధానాన్ని బట్టే బీజేపీ పెద్దలతో మీటింగ్స్ ఉంటాయా.. ఉండవా.. అనేది తేలనుంది.