BJP: గెలుపే లక్ష్యంగా జంట పదవులపై బీజేపీ గురి.. కేంద్రంలో మంత్రి పదవి.. రాష్ట్రంలో పార్టీ బాధ్యతలు..

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం సోమవారం జరగబోతుంది. మరోసారి కేంద్రంలో అధికారం చేపట్టేందుకు అనువుగా అవసరమైన ప్రణాళికల్ని ఈ సమావేశంలో మోదీ.. కేంద్ర మంత్రులకు, పార్టీ నేతలకు వివరిస్తారు. దీనిపై దిశానిర్దేశం చేస్తారు.

BJP: వచ్చే ఏడాది జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష‌్యంగా బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోంది. మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని పట్టుదలతో ఉంది. దీనిలో భాగంగా జంట పదవుల అంశంపై అధిష్టానం తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ కీలక మార్పులకు సిద్ధమవుతోంది.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం సోమవారం జరగబోతుంది. మరోసారి కేంద్రంలో అధికారం చేపట్టేందుకు అనువుగా అవసరమైన ప్రణాళికల్ని ఈ సమావేశంలో మోదీ.. కేంద్ర మంత్రులకు, పార్టీ నేతలకు వివరిస్తారు. దీనిపై దిశానిర్దేశం చేస్తారు. కేంద్రంలో, పార్టీలో మార్పు-చేర్పుల గురించి కూడా వివరిస్తారు. ఇప్పటికే ఈ విష‍యంలో పార్టీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మోదీ, అమిత్ షాతోపాటు జేపీ నద్దా కూడా కీలక మార్పులకు సిద్ధమయ్యారు. మంత్రివర్గంలోనూ మార్పులు చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఇవి సెమీ ఫైనల్స్ వంటివి. ఇక్కడి ఫలితాలే చాలా వరకు లోక్‌సభ ఎన్నికల్లోనూ రిపీటవుతాయి. అందుకే ఈ అసెంబ్లీ ఎన్నిలను కూడా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే కర్ణాటకలో మోదీ, అమిత్ షా వ్యూహాలు పని చేయలేదు. రాష్ట్ర నాయకత్వం సరిగ్గా లేనప్పుడు తామెంత ప్రయత్నించినా ఫలితం ఉండదని మోదీ, అమిత్ షా అభిప్రాయానికొచ్చారు. దీంతో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో అగ్రనాయకత్వాన్ని బలోపేతం చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ పరిస్థితి ఏంటి..? అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి..?
బీజేపీ అధికారంలోకి రావాలని భావిస్తున్న వాటిలో తెలంగాణ ఒకటి. మొన్నటివరకు పరిస్తితులు అనుకూలంగానే అనిపించినా ఇప్పుడు తేడా కొడుతున్నాయి. ముఖ్యంగా అధ్యక్షుడు బండి సంజయ్‌పై అసంతృప్తి, అంతర్గత కుమ్ములాటలు పార్టీని దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వాన్ని మార్చే అంశంపై అధిష్టానం తీవ్రంగా ఆలోచిస్తోంది. ఉన్నట్లుండి బండి సంజయ్‌ను తప్పిస్తే అది పార్టీని మరింత దెబ్బతీస్తుందని కొందరు అంటుంటే, ప్రస్తుత పరిస్తితుల్లో అదొక్కటే సరైన పరిష్కారం అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. పార్టీలో కీలక నేతల మధ్యే సమన్వయం లేకపోవడంతో క్యాడర్ కూడా నిరాశలో ఉంది. పార్టీలోకి కొత్తగా వచ్చిన నేతలకు, ఎప్పట్నుంచో ఉంటున్న వారికి మధ్య పొసగడం లేదని అధిష్టానం గుర్తించింది. ఈ విషయంలో బండి సంజయ్ సఫలం కాలేకపోయారు. అందుకే అందరినీ కలుపుకొని వెళ్లే నేత కోసం అధిష్టానం ఆలోచిస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ బాధ్యతలు అప్పగించాలని భావిస్తోంది. దీనికి కిషన్ రెడ్డి సిద్ధంగా లేరు. అయినప్పటికీ అధిష్టానం సూచనమేరకు కిషన్ రెడ్డి బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. కేంద్ర మంత్రికే, రాష్ట్ర బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం నిర్ణయించిన నేపథ్యంలో త్వరలోనే దీనిపై స్పష్టమైన ప్రకటన రావొచ్చు. మరోవైపు కేంద్ర మంత్రులు పార్టీ బాధ్యతలు తీసుకుంటే, వారి పదవులకు న్యాయం చేయలేరు. అందుకే అంత కీలకం కాని శాఖలు కేటాయించి, రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించాలని చూస్తోంది. అలాగే బండిని పదవి నుంచి తొలగిస్తే, కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలని కూడా నిర్ణయించారు. మరోవైపు బండిని అధ్యక్షుడిగా తొలగిస్తే, పార్టీలోని ఆయన వ్యతిరేకులు సంతోషిస్తారని, ఆ రకంగా పార్టీకి మేలు జరుగుతుందని కూడా అధిష్టానం ఆలోచన. కిషన్ రెడ్డికి రాష్ట్ర బాధ్యతలు అప్పగించడం వల్ల ఆయన సామాజికవర్గాన్ని ఆకట్టుకునే వీలుంటుంది. అలాగే బీజేపీ నేతలు కాంగ్రెస్ వైపు వెళ్లకుండా కూడా అడ్డుకోవచ్చు.
వివాదరహితులకే అవకాశం
రెండేళ్లక్రితం మోదీ మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. ఈ సమయంలో అవినీతి ఆరోపణలు, వివాదాలు ఉన్న 12 మందిని మంత్రివర్గం నుంచి తొలగించారు. ప్రకాశ్ జవదేకర్, హర్షవర్ధన్, రవి శంకర్ ప్రసాద్ వంటి కీలక నేతల్ని మంత్రి పదవి నుంచి తప్పించారు. వివాదాలకు దూరంగా ఉన్న జ్యోతిరాధిత్య సింధియా, శర్బానంద్ సోనోవాల్, అశ్విని వైష్ణవ్ వంటి వారికి అవకాశం ఇచ్చారు. సహాయ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి క్యాబినెట్ హోదా ఇచ్చారు. ఆ తర్వాత రెండేళ్లలో ఎలాంటి మార్పులూ చేయలేదు. కిరణ్ రిజిజును మాత్రం న్యాయశాఖ నుంచి తొలగించారు. ఈ పరిస్థితుల్లో కొత్తగా కొందరికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. ఎన్నికల ఏడాది కాబట్టి ఈ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించబోతుంది అధిష్టానం. అందుకే వివాదాలకు దూరంగా ఉండే సమర్ధులైన వారినే ఎంపిక చేసే అవకాశం ఉంది. గతంలో ఓబీసీలకు అధిక సీట్లు కేటాయించారు. ఈసారి కూడా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో వీరికే అధిక స్థానాలు ఇచ్చే ఛాన్స్ ఉంది.
బలమైన నాయకత్వమే లక్ష్యం
కర్ణాటకలో బీజేపీ ఓడిపోయేందుకు కారణం.. అక్కడ బలమైన నాయకత్వం లేకపోవడమే. యెడియూరప్ప తర్వాత ఆ స్థాయి నేతను బీజేపీ తయారు చేయలేకపోయింది. కాంగ్రెస్ నుంచి వచ్చిన విమర్శల్ని బొమ్మై తిప్పికొట్టలేకపోయారు. కాంగ్రెస్‌కు చెందిన సిద్ధరామయ్, డీకే శివ కుమార్‌ను బొమ్మై ఎదుర్కోలేకపోయారు. అందువల్లే మోదీ, అమిత్ షా ఎంతగా కృషి చేసినా గెలవలేకపోయింది. గతంలో కూడా చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో కూడా ఇలాగే ఓడిపోయింది. కానీ, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో బీజేపీ అత్యధిక సీట్లు సాధించింది. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయేందుకు కారణం.. అక్కడి నాయకత్వంపై ప్రజలకు నమ్మకం లేకపోవడమే. కేంద్రంలోని బీజేపీ నాయకత్వంపై మాత్రం ప్రజలక నమ్మకం ఉండటంతో బీజేపీకి అత్యధిక సీట్లు కట్టబెట్టారు. అందుకే రాష్ట్రాల్లో బలమైన నాయకత్వాన్ని తయారు చేయాలని బీజేపీ భావిస్తోంది. ముఖ్యంగా అక్కడ ముఖ్యమంత్రుల్ని ఢీకొట్టగలిగే నేతలైతేనే మంచిదిన ఆలోచిస్తోంది. ముఖ్యమంత్రి స్థాయి నేతలను ఎదుర్కోవాలంటే కేంద్ర మంత్రులతోనే సాధ్యమని నమ్ముతోంది. అందుకే పాలనానుభవం, రాజకీయ అనుభవం ఉన్న కేంద్ర మంత్రులకే రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. ఇకపై పార్టీలో ఒక కేంద్ర మంత్రి పదవి.. మరో రాష్ట్ర పదవి.. రెండు పదవులు ఇచ్చి గెలుపునకు బాటలు వేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.