Telangana Bjp: జీహెచ్‌ఎంసీ ఎన్నికల తరువాత తెలంగాణ బీజేపీలో జోరు మొదలైంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న బీజేపీకి ఇక తిరుగేలేదు అనుకున్నారంతా. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని.. కాస్త కష్టపడితే అధికారంలో వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అంచనాలు వేశారు. కానీ అందరి అంచనాలను బీజేపీ నేతలే తలకిందులు చేశారు. సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. అధికారం సంగతి పక్కన పెడితే ప్రతిపక్షంలో కూడా ఉంటారో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఇప్పుడు బీజేపీ ఉంది.
దీనికి కారణం ఆ పార్టీలో ఉన్న అంతర్గత పోరు. కొన్ని రోజుల నుంచి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి, సీనియర్ నేతలకు పొసగడంలేదు. బండి సంజయ్ స్థానంలో వేరే వ్యక్తి రాబోతున్నారు అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితిలో తెలంగాణ నేతలతో బీజేపీ జాతీయ నేతలు భేటీ అయ్యారు. ఈ మీటింగ్‌లో బండి సంజయ్ మీద తీవ్ర విమర్శలు చేశారట దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. బండి సంజయ్ ఎవరినీ పట్టించుకోవడంలేదని.. ఆయన అధ్యక్షుడిగా ఉంటే పార్టీ పరిస్థితి కష్టమే అంటూ నేరుగానే చెప్పారట. ఇక రాష్ట్రంలో పరిస్థితులు కూడా బాగా లేవని.. తాను ఎమ్మెల్యేగా గెలిచేందుకు బీజేపీ గుర్తు 10 శాతం మాత్రమే పని చేసిందని చెప్పారట. తెలంగాణ బీజేపీ శాసనసభాపక్ష నేత పదవి ఖాళీగా ఉందన్న విషయం కూడా జాతీయ నాయకత్వం కనీసం గుర్తించలేదని అసహనాన్ని వ్యక్తం చేశారట. ఇక ఈటల రాజేందర్ సందర్భం దొరికిన ప్రతీసారి ఇండైరెక్ట్‌గా బీజేపీ మీద అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. మహ్మద్ ప్రవక్త మీద ఇబ్బందికర వ్యాఖ్యలు చేసిన కేసుతో రాజాసింగ్ సైలెంట్ అయ్యారు. ఇప్పుడు అందరి టార్గెట్ బండి సంజయ్ కాబట్టి ఆయన ఆ పదవిలో సక్రమంగా కొనసాగలేరు. దీంతో ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్ప బీజేపీకి వేరే ఆప్షన్ లేదు. అందుకే కేంద్ర మంత్రిగా కొనసాగుతూనే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కూడా కిషన్ రెడ్డికి అప్పగించే ఆలోచనలో బీజేపీ హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా జరిగినా ఇప్పుడు ఉన్న నేతలు సహకరిస్తేనే పోటీ సాధ్యమవుతుంది. అలా కాదంటే మాత్రం ఇక రాష్ట్రంలో సిచ్యువేషన్ బీఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అవుతుంది. ఇప్పటికే బీజేపీలో ఉన్న పరిస్థితి చూసి పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్‌కు వెళ్లిపోయారు. బీజేపీలో ఉన్న చాలా మంది నేతలు కూడా పక్క చూపులు చూస్తున్నారు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్‌లో ఎన్నికలు వస్తే ప్రధాన పోటీ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే ఉంటుంది. ఇప్పటికైనా బీజేపీ పరిస్థితిని చక్కదిద్దుకోకపోతే వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ స్థానానికే పరిమితమవుతుంది.