Bandi Sanjay: బండికి ఉద్వాసన.. స్వయంకృతాపరాధమేనా..?

ఇప్పుడు బండికి కేంద్ర మంత్రి పదవి వస్తుందో.. రాదో.. కానీ, కీలకమైన పదవి మాత్రం కోల్పోయాడు. ఒకవేళ కేంద్ర మంత్రి పదవి వచ్చినా.. ఆ పదవి ఉండేది మరో తొమ్మిది నెలలు మాత్రమే. ఆ తర్వాత ఎలాగూ ప్రభుత్వం రద్దవుతుంది. ఇదంతా బండి స్వయంకృతాపరాధమే.

  • Written By:
  • Publish Date - July 5, 2023 / 09:59 AM IST

Bandi Sanjay: తెలంగాణ బీజేపీలో అసంతృప్తికి కారణం అధ్యక్షుడు బండి సంజయ్ వ్యవహారశైలే అని అందరికి తెలిసిన విషయమే. పార్టీని ఎంతగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగినా.. నేతలను కలుపుకొని వెళ్లలేకపోయారు. ఎవరికీ ప్రాధాన్యం ఇవ్వకుండా ఆధిపత్యం కోసం ప్రయత్నించారు. దీనివల్ల తాను బలమైన నేతగా ఎదుగుతానని భావించారే కానీ.. ఇతర నేతల్లో వ్యతిరేకత పెరుగుతుందని ఊహించలేకపోయారు. ఇది చివరకు తన పదవికే ఎసరుపెట్టింది.

ఇప్పుడు బండికి కేంద్ర మంత్రి పదవి వస్తుందో.. రాదో.. కానీ, కీలకమైన పదవి మాత్రం కోల్పోయాడు. ఒకవేళ కేంద్ర మంత్రి పదవి వచ్చినా.. ఆ పదవి ఉండేది మరో తొమ్మిది నెలలు మాత్రమే. ఆ తర్వాత ఎలాగూ ప్రభుత్వం రద్దవుతుంది. ఇదంతా బండి స్వయంకృతాపరాధమే. ఈటల, రఘునందన్ రావు వంటి కొందరు బలమైన నేతల విషయంలోనైనా బండి సంజయ్ తన వైఖరి మార్చుకోవాల్సింది. వాళ్లకు తగిన ప్రాధాన్యం ఇస్తూ వ్యతిరేకత పెరగకుండా చూసుకోవాల్సింది. అలాగే విజయశాంతి, కోమటిరెడ్డి, జితేందర్ రెడ్డి వంటి వారిని కూడా గుర్తించాల్సింది. సాధారణంగా రాజకీయాల్లో భవిష‌్యత్తులో తనకు పోటీ వస్తారనుకున్న నేతల్ని ఎవరూ ప్రోత్సహించరు. అలాగని పూర్తిగా పక్కనపెట్టేసినా తప్పే. ఈ తప్పే చేశారు బండి సంజయ్. తనకు పోటీ దారుల విషయంలో సమతూకం పాటించాలి. ఏ నాయకుడైనా సరే ఇలాంటి విషయంలో జాగ్రత్తపడకపోతే వేటు తప్పదు. అందరికీ ప్రాధాన్యమిస్తూనే తనదైన ముద్ర వేసేందుకు చూడాలి. ఇతరులకు అవకాశం ఇస్తూనే తాను మరింత బలమైన నేతగా ఎదగాలి. అప్పుడే రాజకీయ నాయకుడిగా నిలబడతారు. అలా కాకుండా తోటి నేతలతో పేచీలు పెట్టుకుంటే.. వాళ్లు ఏదో ఒక రోజు పదవికి ఎసరు పెడతారు. ఈ విషయంలో బండి సంజయే ఉదాహరణ. గతంలో తెలంగాణలో బీజేపీకి ఎప్పుడూ లేని ఊపు తెచ్చారు బండి సంజయ్.

రకరకాల కార్యక్రమాలతోపాటు వివాదాలతోనూ బీజేపీని ప్రజలు గుర్తించేలా చేయగలిగారు. అధికార బీఆర్ఎస్‌ను ధీటుగా ఎదుర్కొన్నారు. కేసీఆర్ అండ్ కోపై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అనేలా చేయగలిగారు. మరోవైపు కేంద్రం నుంచి అందిన సహకారం కూడా బండి సంజయ్‌కు కలిసొచ్చింది. మోదీ, అమిత్ షా, నద్దా వంటి అగ్రనేతలు బండికి కావాల్సినంత స్వేచ్ఛ, మద్దతు ఇచ్చారు. దీంతో బండి మరింత దూకుడుగా వ్యవహరించారు. అటు ఆర్ఎస్ఎస్, హిందూత్వ సిద్ధాంతాల్ని కాపాడేందుకు కూడా బండి ప్రయత్నించారు. అయినా సరే.. పార్టీలో పెరుగుతున్న అసమ్మతిని అంచనా వేయలేకపోయారు. అదుపు చేయలేకపోయారు. చివరికి పదవి కోల్పోవాల్సి వచ్చింది. అయితే, ఇంతవరకు బీజేపీని నడిపించిన నేతగా బండికి అధిష్టానం ప్రాధాన్యం ఇచ్చి పార్టీలోనో, ప్రభుత్వంలోనో కీలకమైన పదవి ఏదైనా కట్టబెడుతుందేమో చూడాలి.