Bandi Sanjay: వాట్ నెక్స్ట్.. మంత్రి పదవి వద్దన్న బండి.. ఏం చేయబోతున్నారు..?

కేంద్ర మంత్రి పదవి వద్దన్న బండి.. సాధారణ నేతగానే మిగిలిపోతారా..? ఇకపై ఆయన వైఖరి ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో బండి త్వరలోనే తన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

  • Written By:
  • Publish Date - July 5, 2023 / 01:36 PM IST

Bandi Sanjay: తెలంగాణ అధ్యక్ష పదవి నుంచి తొలగించడంతో బండి సంజయ్ అసంతృప్తికి గురయ్యారని తెలుస్తోంది. ఒకవైపు పార్టీని బాగా నడిపించావు అని ప్రశసించిన అధిష్టానం తనను తీసేయడంతో ఏం చేయాలో తేల్చుకోలేకపోతున్నారు బండి సంజయ్. అధ్యక్ష పదవి నుంచి తొలగించిన అధిష్టానం కేంద్ర మంత్రి పదవిని ఆఫర్ చేసింది. అయితే, ఈ పదవి తీసుకునేందుకు బండి సంజయ్ విముఖత వ్యక్తం చేశారు. తాను సాధారణ కార్యకర్తగానే ఉంటానని అధిష్టానానికి స్పష్టం చేశారు. అధిష్టానం విషయంలో బండి అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది ఎన్నికల సమయం. ఇలాంటి సమయంలో అధ్యక్ష పదవి నుంచి తనను తొలగించడం మంచిది కాదని ఆయన అధిష్టానానికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ, ఫలితం లేకపోయింది. ఈ విషయంలో అప్పటికే నిర్ణయం తీసుకున్నామని, అవసరమైతే కేంద్ర మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం చెప్పింది. ఈ విషయాన్ని బండికి చెప్పి, కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించింది. దీంతో బండి అసంతృప్తితో ఉన్నారు. గతంలో తెలంగాణలో బీజేపీ అధ్యక్ష పదవి తీసుకున్న నేతలెవరూ మాస్ లీడర్‌గా ఎదగలేకపోయారు. కానీ, బండి మాత్రం మాస్ లీడర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక విషయాల్లో దూకుడుగా వెళ్లారు. కార్యకర్తల మద్దతు లభించింది. బీజేపీ చేపట్టిన అన్ని సభల్ని బండి సక్సెస్ చేయగలిగారు. అయినప్పటికీ అధిష్టానం బండిని తొలగించింది. ఈ నిర్ణయం పార్టీకి మేలు చేస్తుందా.. లేదా అనేది కాలం నిర్ణయిస్తుంది. ఈ లోపు బండి తన రాజకీయ భవిష‌్యత్తు విషయంలో ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది. కేంద్ర మంత్రి పదవి వద్దన్న బండి.. సాధారణ నేతగానే మిగిలిపోతారా..? ఇకపై ఆయన వైఖరి ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో బండి త్వరలోనే తన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
కిషన్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పిన బండి
తాను పదవి కోల్పోయినప్పటికీ నూతనంగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న కిషన్ రెడ్డికి సోషల్ మీడియా వేదికగా బండి సంజయ్ శుభాకాంక్షలు చెప్పారు. అలాగే రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా నియమితులైన ఈటల రాజేందర్‌కు అభినందనలు తెలిపారు. సమర్ధులైన కిషన్ రెడ్డి నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తేవడానికి కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు బండి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ప్రత్యర్థి వర్గం హ్యాపేయేనా..?
బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని ఈటల, కోమటిరెడ్డి, జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, విజయశాంతి, రఘునందన్ రావు వంటి నేతలు బలంగా కోరుకున్నారు. ఇప్పుడు బండిని తొలగించడంతో వీళ్లంతా హ్యాపీయే అంటూ ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా ఈటల, కోమటిరెడ్డి, రఘునందన్ రావు వంటి నేతలు ఈ విషయంలో తెగ హడావిడి చేశారు. వీరిలో బండి మార్పును ప్రభావితం చేసింది ఎవరూ అనే చర్చ సాగుతోంది. కొందరు నేతలు పట్టుబట్టడం వల్లే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. బండిని మార్చకపోతే కొందరు నేతలు అవసరమైతే పార్టీ మారేందుకు కూడా సిద్ధపడటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందంటున్నారు. బండిని మారిస్తే చాలని ఆశించిన వాళ్లంతా ఇప్పుడు పార్టీ కోసం ఏ మేరకు పని చేస్తారో చూడాలి. అయితే, బండి సంజయ్‌ను తొలగించడంతో ఆయన అనుకూల వర్గం మాత్రం అసంతృప్తితో ఉంది. ఏదేమైనా ఈ నిర్ణయం పార్టీలో చర్చకు దారితీస్తుంది. ఇక కిషన్ రెడ్డి పార్టీని ఎలా నడిపిస్తారో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.